
- ఆయన వచ్చినా ‘చింతా’కే టికెట్ ఇవ్వాలని తీర్మానం
- జగ్గారెడ్డిని రానియ్యొద్దని మాజీ ఎమ్మెల్యే వర్గం పట్టు
- వినకపోతే రాజీనామాలు చేయాలని నిర్ణయం
- మందలించిన మంత్రి హరీశ్‌రావు
సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి చేరతారో లేదో తెలియదు కానీ, ఇప్పటినుంచే ఆయన చేరికపై బీఆర్ఎస్లో వ్యతిరేకత కనిపిస్తోంది. జగ్గారెడ్డి వస్తే మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కు టికెట్ ఇయ్యరని ఆయన అనుచరులు అనుమానపడుతున్నారు. జగ్గారెడ్డి చేరికపై విస్త్రృత ప్రచారం జరగడంతో బీఆర్ఎస్పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, కొందరు ముఖ్య లీడర్లు బుధవారం సంగారెడ్డి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో రహస్యంగా సమావేశమయ్యారు. ఇందులో పాల్గొన్న కంది, కొండాపూర్, సదాశివపేట, సంగారెడ్డి మండలాల బీఆర్ఎస్ లీడర్లు జగ్గారెడ్డి చేరడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. పార్టీలోకి రానియ్యవద్దని, కాదని చేర్చుకుని టికెట్ఇస్తే కలిసికట్టుగా రాజీనామాలు చేయాలని చింత ప్రభాకర్ వర్గీయులు తీర్మానించారు. ఇదిలా ఉండగా మీటింగ్నుంచే ఓ ముఖ్య లీడర్మంత్రి హరీశ్‌రావుకు ఫోన్‌చేసి ఈ విషయమై మాట్లాడగా మంత్రి ఆ లీడర్ ను మందలించినట్టు సమాచారం. ఇప్పటి నుంచే ఈ చర్చలు.. మీటింగులు అవసరమా అని బెదిరించి ఒకవేళ అదే జరిగితే పార్టీ నిర్ణయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే అని నచ్చజెప్పినట్టు తెలిసింది.
చింతాకు..లేకపోతే ఆ ఇద్దరికే ఇవ్వాలె
నియోజకవర్గానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీలో ఎవరు చేరినా మాజీ ఎమ్మెల్యే, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింత ప్రభాకర్ కే టికెట్ఇవ్వాలని ఆ పార్టీ ముఖ్యనేతలు మీటింగ్‌లో తీర్మానించారు. ఒకవేళ చింతకు ఆరోగ్య సమస్యలు అడ్డొస్తే ప్రత్యామ్నాయంగా ఆయన తర్వాత ఉన్న ముఖ్యులకు ఇవ్వాలే తప్ప బయటనుంచి వచ్చిన వారికి ఇవ్వకూడదని నిర్ణయించారు. ఈ క్రమంలో టికెట్ ఆశిస్తున్న ఒకరిద్దరు లీడర్లు ట్రస్టుల పేరుతో ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డిని వ్యతిరేకించడంతోపాటు ఆ ఇద్దరు, ముగ్గురి పేర్లు ప్రపోజ్ చేస్తూ తీర్మానించి అందరి సంతకాలతో సీఎం కేసీఆర్ కు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు ఆ కాపీలు ఇవ్వాలని తీర్మానించారు.
కాంగ్రెస్ లో అయోమయం
ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాజకీయ సమీకరణాలపై సంగారెడ్డి కాంగ్రెస్ క్యాడర్ అయోమయంలో పడింది. బీఆర్ఎస్ లోకి వెళ్తారా వెళ్లరా అన్నదానిపై ఆ పార్టీ సెకండ్ కేడర్నేతల్లో చర్చ మొదలైంది. నిజంగానే జగ్గారెడ్డి పార్టీ మారితే ఆ తర్వాత స్థానంలో తామే ఉంటామని ఒకరిద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రచారం చేసుకుంటున్నారు. అయితే, కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కొందరు ఆశావహులు కాంగ్రెస్ పెద్దలతో టచ్ లో ఉన్నట్టు తెలిసింది.