విశ్లేషణ: జనాల దృష్టిని మరల్చేందుకే అరెస్టులు

ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో ఎన్నో వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. ఈ జీవో వల్ల లోకల్​ వారిమైన తాము నాన్​ లోకల్​ అవుతున్నామని ఉద్యోగులు, టీచర్లు ఆందోళన చేపట్టారు. ఇక జూనియర్లు, సీనియర్ల లొల్లి కూడా ముదిరింది. దీని కారణంగా కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. ఈ పరిణామాల నేపథ్యంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్​ పార్టీపై ఒత్తిడి పెరిగింది. ఇదే సమయంలో 317 జీవోను రద్దు చేయాలంటూ దీక్ష చేయాలనుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ను అరెస్ట్​ చేయించడం ద్వారా ఈ ఇష్యూ నుంచి జనాలను డైవర్ట్​ చేయడానికి ప్రయత్నించింది అధికార పార్టీ. అయితే సీఎం కేసీఆర్​ ఒకటి అనుకుంటే.. సంజయ్​ అరెస్ట్​ బూమరాంగ్​ అయినట్టుగా కనిపిస్తోంది.

తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీక్షలు, పాదయాత్రలతో ఉనికిని చాటుకునే అధికార, ప్రతిపక్షాలు ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగాలు భర్తీ చేయకపోవడం.. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటంతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు షురూ అయ్యాయి. వీటికి తోడు రైతులను వరి వేయొద్దని, వరి వేస్తే ఉరే అని చెప్పిన కేసీఆర్‌‌‌‌‌‌‌‌ తన ఫామ్​ హౌస్‌‌‌‌లో వరి వేసి ప్రజల్లో అసంతృప్తిని పెంచారు. వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు, జనం దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం మొదలుపెట్టారు.

317 జీవోతో మొదలైన లొల్లి

ఇలాంటి పరిస్థితుల్లో తెరపైకి వచ్చిన 317 జీవో అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తోంది. స్థానికత అంశమే కీలకంగా ఆధారంగానే తెలంగాణ ఉద్యమం జరిగింది. అయితే 317 జీవోతో లోకల్​ వారే నాన్​ లోకల్​ వారిగా మారడం వివాదాస్పదమవుతోంది. అలాగే స్థానికత అనే అంశాన్ని ప్రస్తావించకుండా.. సీనియార్టీకి ప్రయార్టీ ఇవ్వడం వల్ల కూడా ఇష్యూ తీవ్రత పెరిగింది. కొత్తగా ఏర్పాటైన జిల్లాలు.. ముఖ్యంగా హైదరాబాద్​ చుట్టుపక్కల, అర్బన్​ ఏరియాలకు దగ్గరగా ఉన్న జిల్లాల్లో ఎక్కువ మంది సీనియర్లు అలాట్​ అయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో గ్రామీణ, మారుమూల జిల్లాలకు జూనియర్లు పరిమితం కావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనిని బీజేపీ ఆయుధంగా వాడుకోవాలని ప్రయత్నించడంతో బండి సంజయ్​ ఇంటిపై దాడి చేసి అరెస్ట్‌‌‌‌ చేయించింది. దీని ద్వారా జనాల ఆలోచనలను డైవర్ట్​ చేయొచ్చని కేసీఆర్​ భావించారు.

దుబ్బాక, హుజూరాబాద్​లో ఎదురుదెబ్బలు..

గత లోక్‌‌‌‌ సభ ఎన్నికల్లో నాలుగు ఎంపీ స్థానాలను గెలుచుకున్నా.. బీజేపీని అప్పటి వరకు కేసీఆర్ సీరియస్​గా తీసుకోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ను భావిస్తూనే ఆ పార్టీని బలహీనపరుస్తూ వచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ఎంత వీక్ అవుతుందో బీజేపీ అంత స్ట్రాంగ్ అవుతోందని పసిగట్టలేకపోయారు. దుబ్బాక లో రఘునందన్ రావు గెలిచిన తర్వాత కూడా లైట్ తీసుకున్నారు. జీహెచ్ఎంసీలో కమలం గట్టి పోటీనిచ్చినా ఇది పట్టణానికే పరిమితమనుకున్నారు. భూ కబ్జా ఆరోపణలతో ఈటల రాజేందర్ ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచీ కథ పూర్తిగా మారిపోయింది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ ఆలస్యం చేసింది. స్పీడ్ గా స్పందించిన బీజేపీ ఈటలను తమ పార్టీలోకి లాక్కుంది.  హుజూరాబాద్ లో ఈటల మరోసారి ఘన విజయం సాధించారు. అప్పటి నుంచి కేసీఆర్​ సహనం కోల్పోయారు. అంత వరకు బీజేపీ నేతలు ఏం మాట్లాడినా పట్టించుకోని కేసీఆర్.. ఫైర్ కావడం మొదలుపెట్టారు.

అవకాశాలను వాడుకుంటున్న బీజేపీ

హుజూరాబాద్​లో ఈటల ఘన విజయం సాధించిన తర్వాత బీజేపీ తాననుకున్నది సాధించింది. ప్రధాన ప్రతిపక్షం తామేనని ప్రజల్లోకి తీసుకెళ్లగలిగింది. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకునే ప్రయత్నం చేసింది. దీంతో కేసీఆర్ తోపాటు మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు కూడా బీజేపీపైనే విమర్శలు గుప్పించడం మొదలు పెట్టారు. కాంగ్రెస్ ను పట్టించుకోవడం మానేశారు. అలాగే ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఒక యుద్ధమే నడిచిందంటే అతిశయోక్తి కాదు. మీరంటే మీరు బాధ్యులంటూ నాయకులు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. బండి సంజయ్ రైతు దీక్ష చేపట్టారు. టీఆర్ఎస్ పై ఆరోపణాస్త్రాలు సంధించారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో స్పందించింది. కేంద్రంతో యుద్ధానికి సై అన్నది. గల్లీలో ఆందోళనలు చేసి, ఢిల్లీలో కేంద్ర మంత్రులతో సమావేశమైంది. 

ధాన్యం కొనుగోళ్ల విషయంలోనే కాకుండా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకుంది. కేంద్రం పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గించిందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా తగ్గించాలని ఆందోళనలు చేసింది. ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతి అంశంలో దీక్షలు చేపట్టడం మొదలు పెట్టారు. మొదట రైతు దీక్ష, ఆ తర్వాత నిరుద్యోగ దీక్ష చేపట్టారు. ఆ తర్వాత ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల్లో అన్యాయాన్ని నిరసిస్తూ 317 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జాగరణ దీక్ష చేయాలని భావించారు. కానీ దానిని భగ్నం చేయడానికి సంజయ్​ను అరెస్ట్​ చేయడంతో టీఆర్ఎస్​కు లాభం కన్నా.. ఎక్కువ నష్టమే జరిగినట్టు అర్థమవుతోంది.

ఎవరికి ఎవరూ తక్కువ కారు..

కేసీఆర్ కాన్‌‌‌‌సంట్రేషన్ అంతా బీజేపీ పైనే ఉంది. నిన్న మొన్నటి వరకూ కాంగ్రెస్‌‌‌‌పై ఎత్తుగడలు వేసిన కేసీఆర్‌‌‌‌‌ఇప్పుడిక బీజేపీ విషయంలో కేర్‌‌‌‌‌‌‌తీసుకోక తప్పదని గ్రహించినట్టు ఉన్నారు. జాగరణ దీక్షలో బండి సంజయ్ అరెస్టు దీనికి నిదర్శనం. ఇప్పటికే కేంద్ర నాయకత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ అయింది. అలాగే ముందు కెళ్లాలని, ఏం జరిగినా చూసుకుంటామని బండి సంజయ్ కు భరోసా కల్పించింది. అయితే బండి అరెస్ట్ కేసీఆర్ కు మరో మైనస్ అయ్యే ప్రమాదం ఉంది. నియంతృత్వ పోకడలకు పోతున్నారని ఇన్నాళ్లు ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలకు బండి అరెస్ట్ మరింత బలం చేకూర్చింది. అయితే ఈ విషయం  బీజేపీకి మరింత బలాన్నిచ్చేదిలా ఉంది. ప్రజల్లో బీజేపీకి మరింత పబ్లిసిటీ మొదలయ్యింది. అయితే కేసీఆర్ ను తక్కువ అంచనా వేస్తే బీజేపీ తప్పులో కాలేసినట్టే.. బీజేపీని కేసీఆర్ తక్కువ అంచనా వేసినా ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఎవరు ఎవర్ని ఢీకొడతారో, ఏ పార్టీ నిలబడుతుందో ప్రజల తీర్పే వెల్లడిస్తుంది.

ఫిరోజ్ ఖాన్, 
సీనియర్ జర్నలిస్ట్