సోషల్ మీడియా క్యాంపెయినింగ్​..ఆన్​లైన్​ ప్రచారంలో బిజీగా ప్రధాన పార్టీల నేతలు 

రూ.లక్షలు చెల్లించి సైబర్​ వింగ్స్​ఏర్పాటు చేసుకుంటున్నరు
5 నుంచి 10 మంది ఎక్స్​పర్ట్స్​తో సైబర్ ​టీంలు 
లీడర్ల ప్రతి ప్రోగ్రాం జనానికి చేరేలా చేయడమే సైబర్​ వింగ్స్​ లక్ష్యం

జగిత్యాల, వెలుగు: ఎన్నికల ఏడాది కావడంతో జగిత్యాల జిల్లాలో సోషల్​మీడియా వేదికగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్‌‌ వేదికలుగా ప్రధాన పార్టీ లీడర్లు ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకోసం రూ.లక్షలు ఖర్చు చేసి ఎక్స్​పర్ట్స్​ టీంలను రిక్రూట్​ చేసుకుంటున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు తమకోసం పనిచేయాలని అగ్రిమెంట్​ చేసుకుంటున్నారు. ఈ మేరకు వారికి అన్ని రకాల సౌలత్‌లు కల్పిస్తున్నారు. ఈ టీంలు లీడర్ల ప్రోగ్రామ్‌లను ప్రచారం చేయడమే కాకుండా, ఆయా పార్టీల విధానాలను సైతం ప్రజలకు చేరువ చేస్తున్నారు. లీడర్ల రోజువారీ పర్యటనలు, అభివృద్ధి కార్యక్రమాల ఫొటోలతో నిత్యం వైరల్ ​చేస్తున్నారు.

 జిల్లాలో రూ.లక్షలు పోసి సైబర్ టీంలు.. 

ఒకప్పుడు రాష్ట్ర స్థాయి రాజకీయాలు శాసించే లీడర్లు పీకే లాంటి ఎన్నికల వ్యూహకర్తలతో అగ్రిమెంట్లు చేసుకునేవారు. వారు తమ సొంత సంస్థలతో సర్వేలు చేస్తూ, ప్రజల్లో ఆ పార్టీ పట్ల సానుభూతి కలిగేలా పోస్టులు పెట్టేవారు. తాజాగా ప్రస్తుతం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోని అధికార, ప్రతిపక్ష నేతలు, ఆశావహులు కూడా సోషల్ మీడియా వింగ్ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఒక్కో వింగ్ లో ఐదు నుంచి 10 మంది సభ్యులను నియమించుకుని వారికి సుమారు రూ.10-–15 లక్షల వరకు చెల్లిస్తున్నట్లు సమాచారం. 

ప్రతి ప్రోగ్రాం జనానికి చేరేలా.. 

ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో లీడర్లను బలోపేతం చేసే దిశగా సైబర్ టీంలు ప్రతి కార్యక్రమంలో తన మార్కు చూపిస్తున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు లీడర్ల కార్యక్రమాలను కవర్​చేస్తూ ఫొటోలు, వీడియోలను వైరల్​ చేస్తున్నారు. నేతల ప్రోగ్రామ్‌లు, స్పీచ్‌లపై కూడా సలహాలు సూచనలు ఇస్తున్నారు.. ఎప్పటికప్పుడు లీడర్ల ప్రోగ్రామ్స్​ జనాలకు చేరేలా వాట్సప్ గ్రూప్‌లతోపాటు ఫేస్ బుక్ పేజీలను క్రియేట్ చేస్తున్నారు. గ్రామాల్లో యాక్టివ్‌గా ఉండే యూత్​లీడర్లు, సోషల్​మీడియా ఇన్‌చార్జిలకు పంపిస్తూ విలేజ్​గ్రూపుల్లో వైరల్​చేస్తున్నారు.  గ్రామాల్లో సైతం దాదాపు ప్రతిఒక్కరి దగ్గర స్మార్ట్​ఫోన్లు ఉండడం ఈ రకమైన ప్రచారానికి ఉపయోగపడుతోంది.