చౌటుప్పల్ : మునుగోడులో ఉప ఎన్నికల నేపథ్యంలో కండువా రాజకీయాలు జోరుగా సాగుతున్నాయి. ఎప్పుడెవరు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడంలేదు. చౌటుప్పల్ కు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సుర్వి అంజయ్య ఆగస్టు 26న లింగారెడ్డిగూడెం ఫంక్షన్ హాల్ లో జరిగిన కార్యక్రమంలో బీజేపీలో చేరారు. ఆయన సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ లో చేరారు.
సాయంత్రమయ్యే సరికి మళ్లీ రాజగోపాల్ రెడ్డి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. తాను రాజగోపాల్ రెడ్డి తోనే ఉంటానని ప్రకటించారు. చౌటుప్పల్ టీఆర్ఎస్ లీడర్లు ఒక పనిమీద తనను సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి ఇంటికి పిలిచారని, అక్కడికి వెళ్లగానే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తన మెడలో బలవంతంగా టీఆర్ఎస్ కండువా కప్పారని అంజయ్య వివరణ ఇచ్చారు.