కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను అప్పగించిన్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో గత ప్రభుత్వమే కేఆర్ఎంబీకి అప్పచెప్పటానికి నిర్ణయించినట్లు కాంగ్రెస్ చెప్పుతుంటే, లేదు లేదు కాంగ్రెస్ ఒప్పుకున్నదని బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఆ ప్రాజెక్టులు వాటి పరిధిలోని 15 కంపోనెంట్స్ ( స్లూయిజ్ కెనాల్స్ లాంటివి) బోర్డుపరిధిలోకి వెళుతున్నాయని, రాష్ట్ర విభజన చట్టం 2014లో పేర్కొన్న మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రాజెక్టుల నిర్వహణలో శ్రీశైలం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో, నాగార్జునసాగర్ తెలంగాణ ఆధ్వర్యంలో ప్రస్తుతం ఉన్నట్లే కొనసాగనున్నవి. రోజువారీ సమస్యలేవైనా వస్తే త్రిసభ్య కమిటీ అభిప్రాయం మేరకు కేఆర్ఎంబీ నిర్ణయం తీసుకోనున్నది.
కేఆర్ఎంబీలో సభ్యులుగా ఉన్న ఏపీ ఇరిగేషన్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నారాయణ రెడ్డి ప్రాజెక్టులను అప్పజెప్పేందుకు అభ్యంతరం లేదని తెలిపారు. తెలంగాణ ఇరిగేషన్ సెక్రెటరీ రాహుల్ బోజ్జా మాత్రం..కృష్ణా జలాలలో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతనే కేఆర్ఎంబీకి అప్పజెప్పుతామని, తెలంగాణ నీటివాటా ట్రిబ్యునల్ లో ఉన్నందున ప్రాజెక్టును అప్పగించబోమని కేంద్రానికి లెటర్ రాశారు. తెలంగాణ లేవనెత్తిన మొత్తం 7 షరతులకు కేంద్రం అంగీకరించిన తర్వాతనే ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పజెప్పటానికి ఒప్పుకుంటామని తెలిపారు.
రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను 50:50 పంపిణీ ఉండాలని, శ్రీశైలంలో కనీస జల మట్టాన్ని 830 అడుగులుగా నిర్వహించడం, బేసిన్లోని ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వడం, బేసిన్ వెలుపల కేవలం 34 టీఎంసీలకు ( తెలుగు గంగకు 15 టీఎంసీలు, శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ కు 19 టీఎంసీలు) మాత్రమే అనుమతి ఉన్నదని గుర్తు చేశారు. నీటి వాటాలు తేల్చకుండా ప్రాజెక్టులను కంపోనెంట్లను ఇచ్చే ప్రసక్తే లేదని కేఆర్ఎంబీ 17వ సమావేశంలోనే స్పష్టం చేశామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మాత్యులు తెలిపారు. డిసెంబర్ 17న ఢిల్లీలో జరిగిన సమావేశంలో తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను పారదర్శకంగా మినిట్స్ లో రికార్డు చేయడానికి బదులు వక్రీకరించేలా ఉన్నాయని నొక్కి చెప్పారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య వాదోపవాదాలు
రెండు నెలల్లో పార్లమెంటుకు ఎన్నికలు జరగనున్నవేళ రాజకీయ వాతావరణం వేడెక్కుతున్నది. దాదాపు10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కృష్ణా జలాల పంపిణీలో తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీల జలాలలో అతి తక్కువకు 299 టీఎంసీలకు 2015లో ఒప్పుకున్నదని అది నేటికీ కొనసాగుతున్నదని తీవ్రంగా విరుచుకుపడుతున్నది. జనవరిలో జరిగిన మీటింగులో తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబీకి అప్పజెప్పేందుకు ఒప్పుకున్నదని, బయటికివచ్చి మాట మార్చుతున్నదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందిస్తూ.. గతంలో జరిగిన అపెక్స్ సమావేశాలకు కేసీఆర్ పాల్గొనకుండా తెలంగాణ వాటాపై నిగ్గు తేల్చకుండా ఏపీకి అనుకూలంగా వ్యవహరించారని దీనితో తెలంగాణకు 299 టీఎంసీలకే పరిమితమైందని కౌంటర్ గా విమర్శిస్తున్నది.
నీళ్ల పునః పంపిణీ కావాలంటే మూడో ట్రిబ్యునలే శరణ్యం
కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో 69 శాతం ఉన్న తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర అన్యాయం జరిగిందని, ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి కాకపోవటం వల్ల బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణకు తక్కువ నీటి కేటాయింపులు జరిగాయని, 69 శాతం పరీవాహక ప్రాంతం ఉన్న తెలంగాణకు కనీసం 50% అయినా నీటి కేటాయింపులు జరగాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది.1956 అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం సెక్షన్ 3 కింద నియామకమైన బచావత్ ట్రిబ్యునల్1976లో ఇచ్చిన ఫైనల్ తీర్పులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టీఎంసీల నీటిని కేటాయిస్తూ ఈ తీర్పు 2000 మే వరకు అమలులో ఉంటుందని చెప్పింది.
అదనపు జలాల పంపిణీ విషయంలో 2004 జూన్ 31న ఏర్పాటుచేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ లో ప్రాథమిక తీర్పు వెల్లడించింది. దీనిపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. తిరిగి 2013లో తుది అవార్డు వెలువరించగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సుప్రీంకోర్టు నుంచి స్టే తేవడంతో అవార్డు నోటిఫికేషన్ ఆగిపోయింది. నోటిఫై చేసేవరకు దానికి చట్టబద్ధత ఉండదు. అంటే ఇప్పటికీ బచావత్ ట్రిబ్యునల్ అవార్డు అమల్లో ఉంది. ఈలోపు రాష్ట్ర విభజన జరిగింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 89 మేరకు రెండు రాష్ట్రాలుగా ఏర్పాటైన తర్వాత పంపిణీ కానీ జలాలు ఉంటే పంపిణీ చేస్తూ నీటి ఎద్దడి రోజుల్లో ప్రొటోకాల్ నిర్ణయించే బాధ్యతను మాత్రమే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం అప్పగించింది. ప్రస్తుతం ఈ అంశాలపైనే ట్రిబ్యునల్ విచారణ జరుగుతుంది.
సుప్రీంకోర్టుకు తెలంగాణ సర్కారు
బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసినా సరైన సమాధానం రాలేదని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసింది. గమనార్హమైన అంశం ఏమిటంటే ఒక్క బచావత్ ట్రిబ్యునల్ అవార్డులోనే కాకుండా, కోర్టు స్టేతో ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పులో కూడా న్యాయం జరగలేదని తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. ఈలోపు కర్ణాటక ప్రభుత్వం కూడా ఆర్డీఎస్ కు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నాలుగు టీఎంసీలు కేటాయించడంపై సుప్రీంకోర్టు కెక్కింది. ఈ మూడు పిటిషన్లు 2015లో సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు విచారణకు వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం అభ్యర్థిత్వం వేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే విచారణ జరగాలని చెప్పింది. అయితే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది అవార్డుపై ఉన్న కేసు ఇప్పటికీ ఏళ్ల తరబడి సుప్రీంకోర్టులోనే ఉంది. కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటే ట్రిబ్యునల్ వేస్తామని కేంద్రం హామీ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్రం కేసు ఉపసంహరించుకుంది. దీంతో నీటి పంపిణీ తగాదా మొదటికి వచ్చింది.
ఎన్డీఎస్ఏ బృందాల పర్యవేక్షణలో డ్యాములు
శ్రీశైలం, నాగార్జునసాగర్ డ్యాములను వాస్తవానికి ఒకటిన్నర సంవత్సరాల క్రితమే కేంద్రం పంపించిన డ్యామ్ సేఫ్టీ అథారిటీవారు డ్యాములను సందర్శించి పరిశీలించిన అనంతరం డ్యాములు ఏమాత్రం సురక్షితంగా లేవని తెలిపినారు. ఈ డ్యాముల సంరక్షణ కోసం "జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ " వారికి కేంద్రం అప్పజెప్పింది. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టుల డ్యాములు ఎన్ డీఎస్ఏ పరిధిలోనికి వెళ్ళినవి. దీంతో ప్రాజెక్టుల నిర్వహణ కేంద్ర పరిధిలోకి వెళ్ళినది. ఇప్పటికైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాల పునర్విభజన చట్టంలో పేర్కొన్నవిధంగా ఒకటికి రెండుసార్లు వారి ఇరిగేషన్ చీఫ్ లతో కలిసి విస్తృతస్థాయిలో చర్చించుకోవాలి. అందుకు కేంద్ర విద్యుత్ జలశక్తి మంత్రి సహకరించాలి. రాష్ట్రంలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్కూడా ప్రధాన ప్రతిపక్ష పార్టీగా సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నదిపై చేపట్టిన ప్రాజెక్టులపూర్తికి చిత్తశుద్ధితో కృషి చేయాలి.
పిట్టపోరు.. పిట్టపోరు పిల్లి తీర్చినట్టు
రాష్ట్ర విభజనతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నుంచి నీటితో పాటు విద్యుత్ శక్తి ఉత్పత్తిపై ఇరు రాష్ట్రాలు ఫిర్యాదు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రాజెక్టు మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) పునరుద్ధరించాలని నిర్ణయించారు. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు సాంకేతికంగా ఉన్న ఇబ్బందులపై ఆర్ఎంసీ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆర్ఎంసీ నివేదిక అనుసరించి ఈ రెండు ప్రాజెక్టులు బోర్డుకు అప్పగించాలి. బోర్డుకు అప్పగించాకే ఆపరేషన్ ప్రొటోకాల్, రూల్ కన్వర్లను ఫైనలైజ్ చేయాలని సీడబ్ల్యూసీకి కేంద్రం ఆదేశించింది.
ఎన్నికల ముందు నవంబర్ 29న అర్ధరాత్రి నాగార్జునసాగర్ డ్యాం ఏపీ వైపు భాగాన్ని స్వాధీనం చేసుకొని గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తూ ఏపీ వైపు గేట్లు నిర్వహణను తామే చూసుకుంటామని వాదిస్తున్నది. కృష్ణా నీటిని ఎవరు విడుదల చేయాలని అంశంపై తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో సాగర్ ప్రాజెక్టు కృష్ణా బోర్డు తాత్కాలిక నిర్వహణలోకి వెళ్ళింది. రాష్ట్రాలకు నీటిని విడుదల చేయాలన్నా ఇకపై జల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నా, రివర్సబుల్ పంపింగ్ చేయాలన్నా, పంటలకు నీరు విడుదల చేయాలన్నా, తాగునీటి అవసరాలు తీర్చాలన్నా కేంద్ర అధికారుల అధీనంలోని కృష్ణాబోర్డు యంత్రాంగమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కృష్ణా జలాల్లో రెండు రాష్ట్రాల వాటాకు సంబంధించిన వివాదమే ఇంకా పరిష్కారం కాలేదు. 2015లో తాత్కాలిక ఏర్పాట్ల కింద 66 శాతం ఏపీకి, 34శాతం తెలంగాణకు కేటాయించడం జరిగింది. తెలంగాణ మాత్రం ఈ నీటి పంపిణీని అంగీకరించబోమని కృష్ణా జలాలను చెరిసగం పంచాల్సిందేనని తెలిపింది.
- ఉజ్జిని రత్నాకర్ రావు, సీపీఐ సీనియర్ నాయకుడు