- సిరిసిల్ల మున్సిపాలిటీలో కలిసిన ఏడు గ్రామాలపై బీఆర్ఎస్ కొత్త డ్రామా
- 2018లో బలవంతంగా కలిపి.. ఇప్పుడు వద్దంటున్రు
- తిరిగి జీపీలుగా చేయాలని మున్సిపల్ కౌన్సిల్‌లో కౌన్సిలర్ల తీర్మానం
- ఇన్నాళ్లూ అభివృద్ధికి దూరమైన గ్రామాలు
రాజన్నసిరిసిల్ల, వెలుగు : సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీన గ్రామాలపై కొత్త పంచాయితీ నడుస్తోంది. 2016లో సిరిసిల్ల పట్టణ జనాభా 80వేలకు పైగా ఉండగా సెకండ్‌గ్రేడ్ మున్సిపాలిటీగా అప్గ్రేడ్అయ్యేందుకు లక్ష జనాభా అవసరమైంది. దీంతో పట్టణాన్ని ఆనుకొని ఉన్న 7 గ్రామాలను 2018లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీలో బలవంతంగా విలీనం చేసింది.
కాగా తాజాగా మున్సిపల్ కౌన్సిల్‌లో మెజారిటీ ఉన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆ గ్రామాలను జీపీలుగా మార్చాలని తీర్మానం చేయడం చర్చనీయాంశమైంది. దీంతోపాటు వేములవాడ మున్సిపాలిటీ పరిధిలోని తిప్పాపూర్, అయ్యోరుపల్లె, కొనాయపల్లె, శాత్రాజుపల్లె, నాంపల్లి గ్రామాలను తిరిగి గ్రామ పంచాయతీలుగా మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది.
నిరసన తెలిపినా పట్టించుకోలే...
రగుడు, చంద్రంపేట, ముష్టిపల్లి,చిన్నబోనాల,పెద్దబోనాల,పెద్దూర్, సర్థాపూర్ గ్రామాలు సిరిసిల్ల పట్టణానికి ఆనుకొని ఉంటాయి. ఈ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయాలని నాటి బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. కనీసం గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టలేదు.
దీనికి ఆయా గ్రామాల్లో నిరసన వ్యక్తమైంది. ఈ నిరసనలు 2018నుంచి మొన్నటి ఎలక్షన్ వరకు కొనసాగినా నాటి సర్కార్ పట్టించుకోలేదు. దీంతో పెద్దూర్, సర్థాపూర్గ్రామస్తులు కొందరు హైకోర్టును ఆశ్రయించారు. పల్లెలను పట్టణాల్లో ఎందుకు కలుపుతున్నారంటూ కోర్టు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 10 ఏండ్ల వరకు ఆస్తి పన్నులు పెంచబోమని, పట్టణానికి దీటుగా విలీన గ్రామాలను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వ హామీ ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదు.
ఏడు గ్రామాల్లో ఆగిన అభివృద్ధి
సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమయ్యాక ఆ ఏడు గ్రామాల్లో అభివృద్ధి నిలిచిపోయింది. ఆయా గ్రామస్తులు ఉపాధి హామీ పథకానికి దూరమయ్యారు. మున్సిపాలిటీ నుంచి ఎలాంటి ప్రత్యేక నిధుల కేటాయింపు జరగలేదు. దీంతో శానిటేషన్, డ్రైనేజీ వ్యవస్థ,ఇతర సౌలతులు కల్పన జరగలేదు. దీంతో ఏడు గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చాలని అసెంబ్లీ ఎన్నికల టైంలో నాయకులు, ప్రజల నుంచి డిమాండ్ వినిపించింది.
దీంతోపాటు కాంగ్రెస్ ఎమ్యెల్యే అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి విలీన గ్రామాలను తిరిగి గ్రామపంచాయతీలుగా మార్చుతామని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చారు. ఆయన చెప్పిన వెంటనే సిరిసిల్ల ఎమ్యెల్యే, మాజీ మంత్రి కేటీఆర్ సైతం విలీన గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చుతానని హామీ ఇచ్చారు.
కౌన్సిల్‌లో తీర్మానం
సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనమైన ఏడు గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చాలని తాజాగా కౌన్సిల్ తీర్మానం చేసింది. చైర్ పర్సన్ జిందం కళ అధ్యక్షతన సమావేశమైన కౌన్సిల్మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. తీర్మాన కాపీని ప్రభుత్వానికి పంపుతామని చైర్ పర్సన్ ప్రకటించారు.
విలీన గ్రామాల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా
విలీన గ్రామాలను తిరిగి జీపీలుగా మార్చాలనే డిమాండ్ ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా. .విలీన గ్రామాల ప్రజలకు అండగా నిలుస్తా. గత ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండానే ఆ ఏడు గ్రామాలను బలవంతంగా మున్సిపాలిటీలో కలిపింది. అభివృద్ధి పేరిట సర్థాపూర్,పెద్దూర్ గ్రామాల్లోని గ్రామస్తుల భూములను తీసుకొని బాధితులకు మరో చోట కేటాయిస్తామని చెప్పి కేటీఆర్మోసం చేశారు.
కేకే మహేందర్ రెడ్డి, కాంగ్రెస్‌నేత