మన దేశంలో దాదాపు 60 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడి బతుకుతున్నారు. స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచీ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపెట్టినా.. నేటికీ ఏటా వేల మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కొనసాగుతోంది. గత ఆరేండ్లలో ఒక్క తెలంగాణలోనే 6500 మంది రైతులు అప్పుల బాధలు భరించలేక బలవన్మరణానికి పాల్పడ్డారు. దేశంలో చాలా మంది రైతులు తాము కష్టపడి పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధర రాక దళారులు ఇచ్చిన రేటుకే అమ్ముకుంటూ వారి చేతిలో దగాపడుతున్నారు. ఆ పరిస్థితుల్లో మార్పు రావాలని, రైతులు స్వేచ్ఛగా తమ పంటకు ఎక్కడ మంచి ధర వస్తే అక్కడ అమ్ముకునే వ్యవస్థను తీసుకొస్తూ కేంద్రం కొత్త వ్యవసాయ చట్టాలు చేస్తే.. వాటిని అడ్డుకునేందుకు దళారీలు కుట్రలు చేస్తున్నారు. రైతులకు జరిగే మేలు తెలియనీయకుండా తప్పుడు ప్రచారాలతో ఉద్యమం నడిపిస్తున్నారు. ఈ సమయంలో రైతులకు అవగాహన కల్పించి, ఆందోళన తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలు, రాజకీయ నేతలపై ఉంది. అన్ని పార్టీలూ రాజకీయాలను పక్కన పెట్టి రైతుకు మంచి చేయడంపై ఆలోచన చేయాలి.
రైతే రాజు.. దేశానికే వెన్నెముక లాంటి మాటలను ఎన్నో ఏండ్లుగా వింటూనే ఉన్నాం. కానీ రైతు కష్టానికి తగ్గ ఫలితం దక్కేలా చేయడంలో ప్రభుత్వాలూ సీరియస్ గా ప్రయత్నం చేయలేకపోయాయి. దీంతో రైతులకు గిట్టుబాటు ధర రాక, దళారీల చేతిలో మోసపోవడం వల్ల పెట్టిన పెట్టుబడులు రాక, చేసిన అప్పులు తీర్చలేక, వడ్డీలు కట్టలేక తమ పంట భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్ముకుని పట్నాలకు వలస పోతున్నారు. బతుకుదెరువు కోసం అపార్ట్ మెంట్ వాచ్ మెన్లు గా పని చేయాల్సిన దుస్థితి నెలకొంటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 135 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో తిండి గింజలు దొరకని కరువు పరిస్థితులు వస్తాయి. అందుకే ముందు జాగ్రత్త చర్యగా కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను తెచ్చింది. దళారీ వ్యవస్థకు చెక్ పెట్టి.. రైతులకు మంచి రేటు వచ్చేలా మేలు చేసేందుకు తెచ్చిన ఈ చట్టాలను అమలు చేసేందుకు మోడీ సర్కారు పట్టుదలతో ఉంది.
మిల్లర్లు, దళారీల ఇష్టారాజ్యం
గతంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ అవకాశవాద రాజకీయ పార్టీలు రైతులకు అర చేతిలో వైకుంఠం చూపించి, అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేస్తూ వచ్చాయి. మిల్లర్లు, దళారుల చేతిలో రైతులు మోసపోకుండా కాపాడే రక్షణ వ్యవస్థలపై దృష్టి పెట్టలేదు. పండించిన పంటలను ధాన్యపు మిల్లుల దగ్గరకు తరలించి ఎప్పుడు కొంటారా అని రోజుల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితిలో రైతులు మగ్గిపోవడానికి ఆ పార్టీల విధానాలే కారణం. వరి క్వింటాల్ కు రూ.1880 మద్దతు ధర ఉన్నా మిల్లర్లు ఏవో వంకలు పెట్టి రూ.1600 నుంచి రూ.1700 లోపే చెల్లిస్తున్నారు. మధ్య దళారులు, మిల్లర్లదే ఇష్టారాజ్యంగా సాగిపోతోంది. కొన్ని రాజకీయ పార్టీల నేతలు, దళారీ మాఫియా కుమ్మక్కై రైతుల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు.
మంచిని స్వాగతించాలి
1917లో బీహార్‌లో జరిగిన చంపారన్ రైతు ఉద్యమంతో నేటి రైతు పోరాటానికి పోలిక పెడుతున్నారు. కానీ ఆనాడు బ్రిటిష్ పాలకులు రైతులపై అధిక భూమి శిస్తు విధించడం, నీలిమందు సాగు చేయాలని చట్టం చేయడం లాంటి విధానాలకు వ్యతిరేకంగా గాంధీజీ నాయకత్వంలో ఉద్యమాలు చేసి రైతులు విజయం సాధించారు. కానీ నేడు రైతుల పంటకు మంచి ధర రాకుండా అడ్డుకునే విధానాలను మోడీ సర్కారు పక్కనపడేస్తోంది. రైతు ఆదాయం రెట్టింపు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది. కొత్త అగ్రి చట్టాల వల్ల రైతులకు ఏ మాత్రం నష్టం కలగదని, ప్రతిపక్షాలు తమ స్వార్థం కోసం రైతులకు అన్యాయం చేయొద్దని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ అనేక సార్లు చెప్పారు. దీనిని దృష్టిలో పెట్టుకుని అందరూ మంచిని స్వాగతించాలి. ఇప్పటికే రైతు సంఘాలు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు ముందుకు రావడం మంచి పరిణామం. కొన్ని డిమాండ్లపై రెండు పక్షాల నుంచి సానుకూలత కనిపించింది. జనవరి 4న జరిగే మరో దఫా చర్చలతో రైతులు ఉద్యమాన్ని విరమించే పరిస్థితి రావాలని దేశమంతా కోరుకుంటోంది. ఇప్పటికైనా ప్రతిపక్షాలు కూడా తమ వైఖరి మార్చుకుని దేశ అభివృద్ధి, రైతుల అభ్యున్నతి కోసం పని చేస్తూ రైతులకు చట్టాల ద్వారా జరిగే మేలు ఏంటన్నది రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల నేతలూ అవగాహన కల్పించేలా ముందుకు రావాలి.
కొత్త చట్టాలతో దోపిడీ కుదరదనే..
కేంద్రం కొత్తగా తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతు తన పంటను ఎక్కడైనా అమ్ముకునే అవకాశం వస్తోంది. దేశ అవసరాల దృష్ట్యా ఆహార నిల్వలపై ఉన్న ఆంక్షలను కూడా ఎత్తేశారు. స్వామినాథన్ కమిషన్ రిపోర్ట్‌లో చెప్పిన అనేక విషయాలు ఈ చట్టం ద్వారా అమలులోకి వస్తాయి. తాము ఇన్నాళ్లుగా చేస్తున్న దోపిడీ ఈ చట్టాల రాకతో కుదరదని దళారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా పంజాబ్, హర్యానాల్లోని దళారీలు ఏటా వేల కోట్లు సంపాదన కోల్పోతారు. దీంతో అక్కడే ఈ చట్టాలకు వ్యతిరేక ఉద్యమం మొదలైంది. దళారీలు లేనిపోని ప్రచారాలు చేసి, రైతులకు జరిగే మేలు తెలియనీయకుండా చేయడం ద్వారా వారిని తమ పోరాటంలోకి లాగారు. మిగతా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అంతగా కనిపించడం లేదన్న విషయం అందరూ గమనించవచ్చు.
ప్రజలు సహించరు
గతంలో కరోనా టైమ్‌కి ముందు పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేసిన నిరసనలకు ముందు ఒక మైనారిటీ వర్గాన్ని ముందుంచి కొన్ని రాజకీయ పార్టీలు తమ స్వార్థానికి వాడుకున్నట్లుగా.. ఇప్పుడు అగ్రి చట్టాలపై ఉద్యమంలో రైతులను ఫ్రంట్ ఫేస్ గా వాడుకుంటున్నాయి. గాంధీజీ అహింసావాదం నినాదంతో కొన్ని రాజకీయ పార్టీలు దీనిని తమ స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్న తీరును దేశమంతా గమనిస్తోంది. దీనిని ప్రజలు సహించరు, అలాంటి పార్టీలకు తగిన సమయంలో గుణపాఠం చెబుతారు. ఇటీవల దేశ వ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే దీనికి నిదర్శనం.
రైతు మంచి కోసం రాజకీయాలు పక్కన పెట్టాలె
- వెలుగు ఓపెన్ పేజ్
- January 2, 2021
లేటెస్ట్
- విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు జారీ
- బుద్వేల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. అగ్నికి ఆహుతైన DCM
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- హైదరాబాద్ నడిబొడ్డున రూ.11 లక్షల నకిలీ సిగరెట్లు సీజ్
- బీర్ల ధరల పెంపు.. కొత్త బ్రాండ్ బీర్లపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
- తిండైన మానేస్తారు కానీ వాళ్ళు అది మాత్రం ఆపరు: రాశీ కన్నా
- షమీ వచ్చేశాడు.. ఇక వార్ వన్ సైడే: 14 నెలల తర్వాత భారత జట్టులోకి రీ ఎంట్రీ
- గుండెపోటుతో తాటిచెట్టుపైన గీతకార్మికుడు మృతి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- బుజ్జితల్లి వీడియో సాంగ్ రిలీజ్.. ఎమోషనల్ ట్రీట్ ఇచ్చారుగా..
Most Read News
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- Fateh Box Office: గేమ్ ఛేంజర్‌కు పోటీగా సోనూ సూద్ మూవీ.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?
- కొత్త రేషన్ కార్డుల జారీకి పక్కాగా అర్హుల ఎంపిక: కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- Daaku Maharaj: డాకు మహారాజ్ బుకింగ్స్ ఓపెన్.. టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?
- కాంటినెంటల్ హాస్పిటల్లో అరుదైన సర్జరీ