శరవేగంగా ఎన్నికల కసరత్తు.. రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ బూత్..

  •     ఖమ్మం జిల్లాలో మొత్తం ఓటర్లు 11,67,077
  •     పొలిటికల్​పార్టీల సమక్షంలో ఈవీఎంల తనిఖీ పూర్తి  
  •     రేపటి నుంచే అవగాహన కార్యక్రమాలు
  •     రూట్ మ్యాప్​సిద్ధం చేసిన ఆఫీసర్లు
  •     కొత్త ఓటర్ల లిస్టులో పేరు చెక్ చేసుకోవాలన్న కలెక్టర్​ 

ఖమ్మం, వెలుగు : అసెంబ్లీ ఎన్నికలకు జిల్లాలో కసరత్తు స్పీడ్​గా జరుగుతోంది. ఎలక్షన్ ఏర్పాట్ల వివరాలను కలెక్టర్ వీపీ గౌతమ్ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులతో అధికారులు సమావేశాలు, ఈవీఎంల పనితీరుపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఓటరు జాబితాలో మార్పులు చేర్పులపై అభిప్రాయాలు తీసుకుంటున్నారు. గత నెల 25 నుంచి ఈనెల 9వ తేదీ వరకు జాతీయ, రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈసీఐఎల్ ఇంజినీర్లు ఈవీఎంలు, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ తనిఖీలు పూర్తి చేశారు. 3100 బ్యాలెట్ యూనిట్లలో 3000, 2403 కంట్రోల్ యూనిట్లలో 2390, 2359 వీవీప్యాట్ మిషన్లలో 2343 మిషన్లు సరిగ్గానే ఉన్నాయని తేల్చారు. వాటికి రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే పింక్​ పేపర్ల మీద సీల్ నంబర్ వేసి జడ్పీ కాంప్లెక్స్​లోని గోడౌన్ లో భద్రపరిచారు. ఈసీ ఆదేశాల ప్రకారం మొత్తం ఈవీఎంలలో 5 శాతం మిషన్లను ర్యాండమ్​గా సెలక్ట్​చేసి ట్రైనింగ్, అవేర్ నెస్ ​ప్రోగ్రాంలు నిర్వహించేందుకు, కొత్త ఓటర్లకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈవీఎంలు, వీవీ ప్యాట్లను ఈనెల20 నుంచి నియోజకవర్గ కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నారు. వీటికి ప్రత్యేకంగా ఎల్లో కలర్​ స్టిక్కర్లను అంటించారు.

ఇక ఈనెల20 నుంచి మొబైల్ డిమానిస్ట్రేషన్​వ్యాన్లలో కూడా ఈవీఎంలు, వీవీ ప్యాట్లపై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో తిప్పనున్నారు. దీని రూట్ మ్యాప్​షెడ్యూల్ ను ఆఫీసర్లు రిలీజ్​చేశారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున ఎల్ఈడీ స్క్రీన్లు బిగించిన వ్యాన్లలో వీడియోలను ప్రదర్శిస్తూ, రెండు విడతల్లో అన్ని మండలాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తారు. ఈ సమయంలో ఎవరైనా అనుమానాలు, సందేహాలుంటే నివృత్తి చేసుకోవచ్చని ఆఫీసర్లు చెబుతున్నారు. 

ఫీల్డ్ వెరిఫికేషన్​ ద్వారా ప్రక్షాళన పూర్తి...

జిల్లాలో గత నెల 23వరకే హౌస్​హోల్డ్ సర్వేను బూత్​లెవల్ ఆఫీసర్లు(బీఎల్ వో) పూర్తి చేశారు. ఈ ఏడాది జనవరి మొదటి వారం నుంచి ఇప్పటి వరకు ఫామ్–6 ద్వారా కొత్తగా 34,850 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో17,954 అప్లికేషన్ల పరిశీలన పూర్తి చేయగా, ఇంకా 16,890 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. ఫామ్–7 ద్వారా 8883 దరఖాస్తులు ఓటర్ల తొలగింపు కోసం వచ్చాయి. ఇక గతేడాది కాలంలో 29,550 మంది చనిపోయిన వారిని గుర్తించి ఓటర్ల జాబితాలో వారి పేర్లను తొలగించారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో డెత్ సర్టిఫికెట్ల కోసం మృతుల బంధువులు వచ్చిన సమయంలో వారి కుటుంబ సభ్యుల నుంచి ఫామ్–7ను కూడా అధికారులు సేకరించడంతో ఓటర్ల జాబితాలో మృతుల తొలగింపు సులభతరమైందంటున్నారు.

ఇక జిల్లాలో ఒకే డోర్​నంబర్ లో ఆరు కంటే ఎక్కువ ఓటర్లున్న ఇండ్లు 25,458 ఉన్నాయని గుర్తించారు. వీటిలో 2,33,483 మంది ఉండడంతో క్రాస్​చెక్ చేసుకునేందుకు ఆఫీసర్లు ఫీల్డ్ వెరిఫికేషన్​చేశారు. హాస్టళ్లు, అపార్ట్ మెంట్లలో ఇలా ఒకే అడ్రస్ పై ఎక్కువ మంది ఉన్నారని తేల్చారు. వీరిలో 2,21,055 మంది నిబంధనల ప్రకారమే ఆయా అడ్రసుల్లో ఉన్నారని గుర్తించారు. మిగిలిన12,428 మందిని ఫామ్–8 ద్వారా వాళ్లు కోరుకున్న మరో చోటుకి ఓటు బదిలీ చేశారు. 

ఆర్వోల ప్రకటన...

వచ్చే ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులను ఎన్నికల కమిషన్ ఆఫీసర్లు ఇటీవలే ప్రకటించారు. ఖమ్మం నియోజకవర్గానికి రిటర్నింగ్ అధికారిగా ఖమ్మం మున్సిపల్ కమిషనర్, పాలేరుకు రైల్వే, ఐపీటీ ల్యాండ్ అక్విజేషన్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, మధిరకు ఖమ్మం ఆర్డీవో, వైరాకు అడిషనల్​కలెక్టర్, సత్తుపల్లికి కల్లూరు ఆర్డీవో రిటర్నింగ్ ఆఫీసర్ గా వ్యవహరిస్తారు. 

రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ బూత్..

జిల్లాలో 789 ప్రాంతాల్లో ఇప్పటి వరకు1439 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఇప్పటికే అక్కడ ఓటర్లకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నాం. ఎన్నికలు సమీపించే నాటికి ఈ స్టేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రతి ఓటర్ కు రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్​ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. లేటెస్ట్ ఓటర్ లిస్టులో తమ పేరును చెక్ చేసుకోవాలి. ఎన్నికలు జరిగే సమయానికి18 ఏళ్లు నిండుతున్నవారు మూడు నెలలకు ముందు కూడా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. యువ ఓటర్లను ఎన్నికల్లో భాగస్వామ్యం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.

–వీపీ గౌతమ్, కలెక్టర్, ఖమ్మం