వరంగల్ : పలుచోట్ల రాత్రి వరకు కొనసాగిన పోలింగ్

నెట్​వర్క్​, వెలుగు:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ      ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం ఏడు గంటలకు పోలింగ్​ ప్రారంభం కాగా.. సాయంత్రం ఐదు గంటల వరకు సెంటర్ల వద్ద  ఓటర్లు  క్యూ  కట్టారు.   కొన్నిచోట్ల సమయం అయిపోయిన తర్వాత లైన్లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇచ్చారు. దీంతో రాత్రి వరకు పోలింగ్  కొనసాగింది.  పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. 

హనుమకొండ, వరంగల్​లో  :  హనుమకొండ, వరంగల్​లోని  పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాల్లో సాయంత్రం ఐదు గంటల వరకు 76.85 శాతం, 51.34 శాతం పోలింగ్​ నమోదైంది.    గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్​ శాతం ఎక్కువ నమోదు కాగా.. పట్టణ ప్రాంతాల్లో తక్కువ ఓటింగ్​ నమోదు కావడం గమనార్హం.  ఓటింగ్​ ప్రక్రియ పూర్తి అనంతరం ఈవీఎంలను వరంగల్ ఏనుమాముల మార్కెట్​ లోని స్ట్రాంగ్ రూమ్​లకు తరలించారు.   వరంగల్ వెస్ట్​ బీఆర్​ఎస్​ అభ్యర్థి దాస్యం వినయ్​ భాస్కర్​   వడ్డేపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఓటు వేశారు.

బీజేపీ అభ్యర్థి రావు పద్మ హంటర్​ రోడ్డులోని శ్రీవికాస్​ జూనియర్​ కాలేజీ, కాంగ్రెస్​ అభ్యర్థి నాయిని రాజేందర్​ రెడ్డి హనుమకొండలోని తేజస్విని స్కూల్​ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. పరకాలలోని 42వ బూత్​ లో బీఆర్​ఎస్​ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి దంపతులు, కమలాపూర్​ లోని 262 బూత్​ లో హుజూరాబాద్​ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్​ దంపతులు, వేలేరు మండలంలో స్టేషన్​ ఘన్​ పూర్​ బీజేపీ అభ్యర్థి గుండు విజయరామారావు ఓటు వేశారు.

 ధర్మసాగర్​ మండలం తాటికాయల గ్రామంలో రెండు ఈవీఎంలు మొరాయించడంతో దాదాపు గంట పాటు పోలింగ్ ఆలస్యమైంది.  హసన్​ పర్తి మండలం దేవన్నపేట గ్రామపంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఓటింగ్​ ప్రారంభమైన గంట తరువాత ఈవీఎం మొరాయించింది.  నర్సంపేటలో సాయంత్రం ఐదు గంటలకు 83 శాతం పోలింగ్​ నమోదు అయింది.   వరంగల్​ తూర్పులో  సాయంత్రం ఓటింగ్​  సమయం దగ్గర పడుతుండటంతో   ఓటు వేసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 5గంటల తర్వాత 64% నమోదైంది. 

జయశంకర్‌‌ భూపాలపల్లి  :  భూపాలపల్లి, ములుగు జిల్లాలో   అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌‌ ప్రశాంతంగా జరిగింది.   భూపాలపల్లి నియోజకవర్గంలో   317 పొలింగ్ కేంద్రాలను,  ములుగు అసెంబ్లీ నియోజకవర్గంలో  303 పోలింగ్ కేంద్రాలను  ఏర్పాటు చేశారు.  పలు చోట్ల ఈవీఎంలు, వీవీప్యాట్లు మొరాయించాయి.   ఉదయం నుంచే పోలింగ్‌లో  వేగం కనిపించింది.  సాయంత్రం 5 గంటల వరకు  76.10 % ఓట్లేసినట్లుగా జిల్లా కలెక్టర్‌‌ భవేశ్‌‌ మిశ్రా ప్రకటించారు.  

5 గంటల తర్వాత  గేట్లు వేసి ఉంచడంతో ఓటర్లు కొందరు వెనుదిరిగారు.  మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో భారీగా పోలింగ్‌‌ జరగడంతో ఎలక్షన్‌‌ ఆఫీసర్లు ఊపిరి పీల్చుకున్నారు.   ములుగులో సాయంత్రం 5 గంటల వరకు  79 % ఓట్లేశారు. రాత్రి 7 దాటినా ఇంకా అక్కడక్కడ పోలింగ్‌‌ జరిగుతుందని జిల్లా కలెక్టర్‌‌ ఇలా త్రిపాటి ప్రకటించారు. పోలింగ్‌‌ శాతం పెరిగే అవకాశాలున్నాయని తెలిపారు. 

మహబూబాబాద్‌‌ :   జిల్లా లోని 18 మండలాల పరిధిలో చిన్నచిన్న  ఘటనలు మినహా  పోలింగ్‌‌ప్రశాంతంగా కొనసాగింది.   జిల్లా కేంద్రంలో కలెక్టర్‌‌ శశాంక, ఎస్పీ సంగ్రామ్​ సింగ్​ జీ పాటిల్ ఓటు హక్కును వినియోగించుకున్నారు.    మహబూబాద్‌‌లో  ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీ టి.రవీందర్​ రావు ఓటేశారు.   గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఓట్లు వేయడానికి ఉత్సాహం చూపగా పట్టణ ప్రాంత ప్రజలు తొర్రూరు, మహబూబాబాద్​, డోర్నకల్​, మరిపెడలో మాత్రం  ఓట్లు వేయడానికి పెద్దగా ఆసక్తిని చూపలేదు.    సాయంత్రం 5గంటల వరకు ,డోర్నకల్ నియోజకవర్గంలో 79.32శాతం, మహబూబాబాద్​లో 75.93 శాతం  నమోదయినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక తెలిపారు.  

 జనగామ :  జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో పోలింగ్​ గురువారం రాత్రి పొద్దు పోయే వరకు కొనసాగింది. ఉదయం ఏడు గంటల నుంచి  పోలింగ్​ మొదలైంది.     సాయంత్రం 5 గంటల వరకు స్టేషన్​ ఘన్​పూర్​లో 76.25శాతం, పాలకుర్తిలో 81.23 శాతం, జనగామలో 83.34 శాతంగా నమోదైంది. జిల్లా మొత్తంగా 861 పోలింగ్​ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియ పూర్తి చేశారు. అనంతరం ప్రత్యేక భద్రత మధ్య ఈవీఎంలను జనగామ శివారు పెంబర్తి వీబీఐటీ కాలేజీలోని స్ట్రాంగ్​ రూంకు తరలించారు