
హైదరాబాద్: తెలంగాణలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. చివరి గంటలో పోలింగ్ కేంద్రాల దగ్గర భారీగా క్యూలు కనిపించాయి. 4 గంటల లోపు క్యూలో ఉన్నవారికి అధికారులు ఓటేసే అవకాశం ఇచ్చారు. పెద్దపల్లిలో అత్యధికంగా 77.95 శాతం పోలింగ్ నమోదైంది. నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి 90 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. ఉదయం నుంచి పోలింగ్లో టీచర్లు భారీగా పాల్గొన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ 80 శాతం దాటింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా 80 శాతం దాటింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నల్గొండ అర్జాల బావి దగ్గర స్ట్రాంగ్ రూంలకు బ్యాలెట్ బాక్సులు తరలించారు. మధ్యాహ్నం వరకూ పోలింగ్ మందగొడిగా సాగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కట్టారు. ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఒకట్రెండు ఘటనల మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాల్లో మొత్తం 680 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో 406 గ్రాడ్యుయేట్ పోలింగ్ స్టేషన్లు, 181 టీచర్స్ పోలింగ్ స్టేషన్లతో పాటు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ ఓటర్లకు కలిపి 93 కామన్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కరీంనగర్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో 15 జిల్లాలకు ఎన్నికల మెటీరియల్, బ్యాలెట్ బాక్సులను బుధవారం డిస్ట్రిబ్యూట్ చేశారు. పోలింగ్ ముగిసిన అనంతరం అన్ని జిల్లాల నుంచి బ్యాలెట్ బాక్సులను కట్టుదిట్టమైన భద్రత మధ్య కరీంనగర్‌లోని అంబేద్కర్ స్టేడియంలోని రిసెప్షన్ సెంటర్‌కు తరలించారు.
Also Read:-మార్చి 3 నుంచి హైదరాబాద్లో కొన్ని స్కూళ్ల టైమింగ్స్లో మార్పులు..
గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు తమ ఓటు వినియోగించుకునేందుకు స్పెషల్ క్యాజువల్ లీవ్ వర్తించే విధంగా వెసులుబాటు కల్పించారు. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక సంస్థ లేదా ఇతర అన్ని ప్రైవేట్ మేనేజ్మెంట్, అథారిటీల్లో పని చేస్తూ గ్రాడ్యుయేట్ ఓటు హక్కు ఉన్న ఉద్యోగులు, కార్మికులు సైతం వారి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా యాజమాన్యాలు అనుమతి, వెసులుబాటు ఇవ్వడం గమనార్హం.
మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 3,55,159 మంది ఓటర్లు ఉండగా, ఈ స్థానంలో 56 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి చిన్నమైల్ అంజిరెడ్డి, బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్యే పోటీ నెలకొంది. ఇక మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో 27,088 మంది ఓటర్లు ఉన్నారు. ఈ స్థానంలో 15 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, యూటీఎఫ్ -టీపీటీఎఫ్ అభ్యర్థి అశోక్ కుమార్, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి మధ్య పోటీ ఉంది.