ఎమ్మెల్సీ ఎలక్షన్ లో నలుగురి మధ్యే పోటీ!
ఓటేసేందుకు పోటెత్తిన టీచర్లు, లెక్చరర్లు.. 90.4% పోలింగ్
ఎల్లుండి సరూర్‌నగర్ స్టేడియంలో ఓట్ల లెక్కింపు
హైదరాబాద్, వెలుగు : ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. 90.40 శాతం మంది టీచర్లు, లెక్చరర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. 9 జిల్లాల పరిధిలో 29,720 మంది ఓటర్లుండగా.. వారి కోసం 137 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను సరూర్ నగర్ స్టేడియంలోని స్ట్రాంగ్ రూమ్‌కి తరలించారు. ఈనెల 16న కౌంటింగ్ జరగనుంది. 10 గంటల్లోపు 19.54 శాతం పోలింగ్ నమోదు కాగా.. మధ్యాహ్నం12 గంటల వరకు 48.53 శాతం, 2 గంటల వరకు 75.05 శాతం, సాయంత్రానికి 90.40 శాతానికి చేరినట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా గద్వాల్ జిల్లాలో 97.15 శాతం మంది ఓట్లు వేశారు. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లాలో 82.25 శాతం నమోదైంది.
బరిలో 21 మంది అభ్యర్థులు
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోటీ మాత్రం పీఆర్టీయూటీఎస్ అభ్యర్థి చెన్నకేశవరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్ అభ్యర్థి మాణిక్ రెడ్డి, బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి, పీఆర్టీయూటీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి మధ్య ఉండనుందని టీచర్లు పేర్కొంటున్నారు. చెన్నకేశవరెడ్డికి సర్కారు పెద్దలు మద్దతిచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క బీజేపీ అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి తరఫున కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి, నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రఘునందన్ రావు తదితరులు ప్రచారం చేశారు.
కౌంటింగ్‌కి ఏర్పాట్లు చేస్తున్నం
పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని రిటర్నింగ్ ఆఫీసర్ ప్రియాంక ఆల తెలిపారు. ‘‘బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచాం. గురువారం జరిగే కౌంటింగ్‌కి ఏర్పాట్లు చేస్తున్నాం. లాస్ట్ టైమ్ జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 93 మంది క్యాండిడేట్లు ఉండటంతో కౌంటింగ్ ఆల స్యం అయింది. ఇప్పుడు ఈ ఎన్నికలో 21 మందే ఉన్నారు. 24 గంటల్లో కౌంటింగ్ పూర్తవుతుందని అనుకుంటున్నం. కౌం టింగ్ సెంటర్ వద్ద 200 మంది ఆఫీసర్లు, సిబ్బంది పనిచేస్తున్నారు”అని తెలిపారు.