- ఓల్డ్ సిటీలోని సమస్యాత్మక కేంద్రాలపై ఫోకస్
- హైదరాబాద్ బీజేపీ, ఎంఐఎం అభ్యర్థుల మధ్య స్వల్ప ఉద్రిక్తత
- పోలింగ్ కు చివరి రెండు గంటల్లో అలర్ట్ గా పోలీసులు
హైదరాబాద్,వెలుగు :గ్రేటర్‌లో సిటీలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఓల్డ్ సిటీలో స్వల్ప ఘటనలు మినహా హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల లోక్ సభ సెగ్మెంట్లతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్ బై పోల్ లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. మీర్‌చౌక్‌లో హైదరాబాద్ బీజెపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత, ఎంఐఎం అభ్యర్థి ఒవైసీ ఒకరికొకరు ఎదురు కావడంతో కొత్త ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు ఇరువర్గాలను వారిని చెదరగొట్టారు.
ముగ్గురు సీపీల మానిటరింగ్
ఉదయం నుంచి సాయంత్రం దాకా పోలింగ్ సరళిని మూడు కమిషనరేట్ల సీపీలు శ్రీనివాస రెడ్డి, అవినాశ్మహంతి, తరుణ్ జోషి పర్యవేక్షించారు. సమస్యాత్మక కేంద్రాలను నిఘాలోకి తెచ్చారు. గొడవలు సృష్టించే వారిని గుర్తించేలా మఫ్టీ పోలీసులను మోహరించి బందోబస్తును సమీక్షించారు. డీసీపీ అధికారులతో మానిటరింగ్ చేశారు. ఓల్డ్ సిటీలో సీఆర్‌పీఎఫ్ బలగాలను మోహరించారు.
పోలింగ్ బూత్ ల వద్ద కట్టుదిట్టం
సమస్యాత్మక కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు పెట్టి.. సీసీ టీవీ కెమెరాలను కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో కనెక్ట్ చేసి పోలింగ్‌ను సమీక్షించారు. ఓల్డ్ సిటీపైనే సీపీ శ్రీనివాసరెడ్డి ఎక్కువగా నిఘా పెట్టారు. ఓటర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే బూత్‌లోకి అనుమతిచ్చారు. 5 జోన్లలోని క్రిటికల్ ఏరియాల్లో సెంట్రల్ ఫోర్సెస్, టాస్క్‌ఫోర్స్,స్పెషల్ ఆపరేషన్ టీమ్స్‌ను మోహరించారు. మౌంటెడ్ కెమెరాలతో లైవ్ స్ట్రీమింగ్ ను పర్యవేక్షించారు. గొడవలు జరిగిన ప్రాంతాల్లోని సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ కలెక్ట్ చేశారు.
వృద్ధులు, దివ్యాంగులకు..
బూతుల వద్ద బందోబస్తును సీపీలు స్వయంగా పర్యవేక్షించారు. పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ.. ఓటర్లను మినహా ఇతరులను అనుమతించలేదు. వృద్ధులు, దివ్యాంగులను బందోబస్తు పోలీసులే స్వయంగా బూత్‌లోకి తీసుకెళ్లారు. పెట్రోలింగ్, బ్లూ కోల్ట్స్ సిబ్బందిని అలెర్ట్ చేశారు. ఇందుకోసం డయల్100 కాల్స్‌తో డైరెక్ట్ కనెక్ట్ చేశారు. దొంగఓట్లు, ఓట్ల గల్లంతు, డబ్బు పంపిణీపై అందిన ఫిర్యాదుల ఆధారంగా అదనపు బలగాలను డిప్లాయ్ చేశారు.