పోలింగ్ ప్రశాంతం..ఖమ్మం పార్లమెంట్​లో 75.19 శాతం

పోలింగ్ ప్రశాంతం..ఖమ్మం పార్లమెంట్​లో 75.19 శాతం
  •     గంటగంటకూ పెరిగిన ఓట్లు
  •     అక్కడక్కడా మొరాయించిన ఈవీఎంలు

ఖమ్మం, వెలుగు : ఖమ్మం పార్లమెంట్​ పరిధిలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.  ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల దగ్గర జనం రద్దీ కనిపించింది. పొద్దున 10 గంటల వరకు పెద్దగా ఎండ తీవ్రత లేకపోవడంతో ఓటేసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపించారు. ఆ తర్వాత కూడా క్రమంగా ఓటింగ్ శాతం పెరిగింది. సాయంత్రం 5 గంటల వరకు 70.76 శాతం పోలింగ్ నమోదైంది.

కీలకంగా మహిళా ఓటర్లు

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే  పోలింగ్ శాతం నమోదైంది. 2019 పార్లమెంట్ ఎన్నికలతో  పోల్చినా ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. అన్ని నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది.  ఏ పోలింగ్ కేంద్రంలో చూసినా మహిళా ఓటర్లు బారులు తీరి కనిపించారు.  

పలు పోలింగ్ కేంద్రాల  సమీపంలో పార్టీల కార్యకర్తలు  తమ పార్టీకే ఓటేయాలంటూ  సింబల్​ చూపిస్తూ ఓటు అభ్యర్థించారు.   గ్రామాల్లో,   ఖమ్మం నగరంలో ఒకే చోట ఎక్కువ పోలింగ్ బూత్ లు ఉన్న చోట తక్కువ వీల్ చైర్లు   ఉండడంతో వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడ్డారు.  

పోలింగ్​ కేంద్రాలను సందర్శించిన అభ్యర్థులు

 అభ్యర్థులు  ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత పలు పోలింగ్​ కేంద్రాలను సందర్శించారు.  కాంగ్రెస్​ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఖమ్మం, వైరా, సత్తుపల్లి నియోజకవర్గాల్లో  బూత్ లను సందర్శించారు. కానీ,  రఘురాంరెడ్డి  ఓటు  మహబూబాబాద్​ పార్లమెంట్ లో ఉండడంతో ఆయన అక్కడే ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీఆర్ఎస్​ అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్​ఎస్​టీ రోడ్డులోని కవిత కాలేజీలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్​ రావు ముల్కలపల్లి మండలం తిమ్మంపేటలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

నిరంతరం వెబ్​కాస్టింగ్​

 పోలింగ్  తీరును వెబ్​ క్యాస్టింగ్ ద్వారా కొత్త కలెక్టరేట్ ​నుంచే ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఖమ్మం  కలెక్టర్ వీపీ గౌతమ్ పరిశీలించారు. ఖమ్మం నగరంలోని నయా బజార్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్ఆర్ అండ్  బీజీఎన్ఆర్ కాలేజీ పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బంది కలకుండా మెరుగైన సౌకర్యాలు కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. 

ఓటేసిన ప్రముఖులు

 ఖమ్మం టౌన్/ భద్రాద్రి కొత్తగూడెం : 

  • ఖమ్మంలోని  14వ డివిజన్ గొల్లగూడెం లోని ప్రాథమిక పాఠశాలలో  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన ఓటేశారు.   బీఆర్ఎస్  అభ్యర్థి నామ నాగేశ్వరరావు ఎన్ ఎస్టీ రోడ్డులో ఉన్న కవిత పీజీ కాలేజ్ లో కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కు ను వినియోగించుకున్నారు.  
  •     ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తన కుటుంబ సభ్యులతో కలిసి ఓల్డ్ ఎన్ ఎస్పీ క్యాంపులో ఉన్న డాక్టర్ బీఆర్​అంబేద్కర్ కాలేజ్ లో ఓటేశారు. 
  •     ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ  గౌతమ్ దంపతులు  క్యూ లైన్ లో నిలబడి జిల్లా అటవీశాఖ  కార్యాలయ పోలింగ్​ కేంద్రంలో  ఓటు హక్కును వినియోగించుకున్నారు. 
  •     భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్​ ప్రియాంక అలాపాల్వంచలోని నవభారత్​ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో ఓటేశారు. 
  •     రామవరం సమీపంలోని త్రీ ఇంక్లైన్​ లో ఏర్పాటు చేసిన పోలింగ్​ కేంద్రంలో భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ బి. రోహిత్​ రాజు ఓటేశారు. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మణుగూరులో ఓటు హక్కును వినియోగించుకున్నారు. 

పలుచోట్ల మొరాయించిన ఈవీఎంలు 

  •     ఎర్రుపాలెం మండలం నర్సింహాపురం బూత్ నెంబర్​ 249లో ఉదయం కాసేపు ఈవీఎం మొరాయించింది.  కొణిజర్ల మండలం అంజనాపురంలో ఈవీఎంలో సాంకేతిక సమస్య రాగా, కొద్దిసేపట్లోనే దాన్ని అధికారులు సరిదిద్దారు.  ఏన్కూరు మండలం రాయమాదారంలో పొలాలకు వెళ్లేందుకు ఎన్​ఎస్​పీ కాల్వపై బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్​ చేస్తూ  ఓట్లు వేయబోమని  మొండికేశారు.  ఎమ్మార్వో ద్వారా విషయం తెలుసుకున్న కలెక్టర్​ వీపీ గౌతమ్​ సమస్యను పరిష్కరిస్తామంటూ హామీనివ్వడంతో ఆ తర్వాత ఓటింగ్ లో పాల్గొన్నారు.
  •     సత్తుపల్లి పాత సెంటర్​ యూపీఎస్​ స్కూల్​ లోని 220 బూత్​ లో ఈవీఎం కాసేపు మొరాయించింది.  రఘునాథపాలెం మండల కేంద్రంలోని 40వ పోలింగ్ స్టేషన్​ లో మాక్​ పోలింగ్ తర్వాత 10 నిమిషాల పాటు ఈవీఎం మొరాయించింది.
  •     చాలా గ్రామాల్లో మహిళలు, వృద్ధులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆటోల్లో పోలింగ్ కేంద్రాలకు తరలించారు.