- సికింద్రాబాద్ సర్కిల్‌లో ఏకంగా 18.86% పెరిగింది
- సాయంత్రం వరకు చాలా పోలింగ్ బూత్‌లు ఖాళీ
- లైవ్ వెబ్‌క్యాస్టింగ్‌లో ఎక్కడా కనిపించని ఓటర్లు
- అయినా చివర్లో భారీగా నమోదైన పోలింగ్
- మొత్తంగా 46.6% పోలింగ్ జరిగినట్టు ఈసీ ప్రకటన
హైదరాబాద్, వెలుగు: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్ పోలింగ్ చివర్లో ఒక్కసారిగా పెరిగింది. పొద్దున్నుంచీ సాయంత్రం ఐదు గంటల దాకా మందకొడిగా జరిగినా.. సాయంత్రం ఐదు గంటల తర్వాత భారీగా నమోదైంది. కొన్ని డివిజన్లలో అయితే ఈ పెంపు ఏకంగా 12 శాతం నుంచి 14 శాతం దాకా ఉంది. వాస్తవానికి సాయంత్రం నాలుగు గంటల నుంచే పోలింగ్ సెంటర్లలో ఎక్కడా ఓటర్ల క్యూలు కనిపించలేదు. ఎలక్షన్ స్టాఫ్ కూడా రిలాక్స్ అవుతూ కనిపించారు. దీనిపై సోషల్‌మీడియాలోనూ ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ చివరికి ఈసీ ప్రకటించిన లెక్కల్లో పోలింగ్ శాతం ఎక్కువగా ఉంది. దీనిపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ చివర్లో అవకతవకలు జరిగాయని, అందుకే ఓటింగ్ పర్సంటేజీ పెరిగిందని ఆరోపిస్తున్నాయి. దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు కూడా కంప్లైంట్లు చేశాయి.
పొద్దంతా మెల్లమెల్లగా..
2016 గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో మొత్తంగా 45.29 శాతం పోలింగ్ నమోదైంది. అయితే ఈసారి గ్రేటర్లో పోటీ విపరీతంగా పెరిగింది.దుబ్బాక బైఎలక్షన్లో గెలుపుతో బీజేపీలో జోష్ కనిపించడం, ఎట్లయినా తిరిగి గెలవాలన్న ఉద్దేశంతో టీఆర్ఎస్ పూర్తిగా ఫోకస్ చేయడం, కాంగ్రెస్ కూడా బలం చూపుకోవాలన్న ఉత్సాహంతో ఉండటంతో.. ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలిరావొచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. కానీ పొద్దున్నుంచే పోలింగ్ మందకొడిగా సాగింది. పొద్దున 9 గంటల వరకు 3.95 శాతం, 11 గంటల వరకు 11.62 శాతం, ఒంటి గంట వరకు 20.35 శాతం, మూడు గంటల వరకు 29.76 శాతం, ఐదు గంటల టైముకు 37.11 శాతం పోలింగ్ నమోదైంది. అప్పటికే పోలింగ్ బూత్‌లు చాలా వరకు ఖాళీ అయ్యాయి. కొన్నిచోట్ల పోలింగ్ స్టాఫ్ రిలాక్స్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు మంగళవారం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి. ఇక మంగళవారం అర్ధరాత్రి మొత్తం ఓటింగ్ 45.7 శాతంగా నమోదైనట్టు ఈసీ అధికారులు తెలిపారు. అయితే 46.6 శాతం పోలింగ్ అయినట్టు బుధవారం పొద్దున ప్రకటించారు.
చివరి గంటలోనే..
అన్ని డివిజన్లలో పొద్దున్నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి రెండు గంటలకోసారి పోలింగ్ పర్సంటేజీని ప్రకటించారు. ప్రతిసారి కూడా పోలింగ్ పర్సంటేజీ ఏడెనిమిది శాతం మేర పెరుగుతూ వచ్చింది. సాయంత్రం 5 గంటల వరకు ఇదే సాగింది. కానీ తర్వాత ఆరింటి వరకు.. అంటే గంటలోనే 10 శాతం వరకు ఓటింగ్ శాతం పెరిగింది. గ్రేటర్లో మొత్తం 33 సర్కిళ్లు ఉండగా.. సగం సర్కిళ్లలో ఏకంగా 12 నుంచి 18 శాతం వరకు పెరగడం గమనార్హం. సికింద్రాబాద్ సర్కిల్‌లో సాయంత్రం 5 గంటల వరకు 29.22 శాతంగా ఉన్న పోలింగ్.. చివరికి 48.08 శాతానికి చేరింది. ఇలాగే.. చాంద్రాయణగుట్టలో 40.56 శాతం నుంచి 53.07 శాతానికి, ఫలక్‌నుమాలో 33.24 శాతం నుంచి 49.79 శాతానికి పెరిగింది. చాలా డివిజన్లలో ఇట్లాగే ఒక్కసారిగా పోలింగ్ పెరిగింది.
ఓటర్లు లేకున్నా..
గ్రేటర్ హైదరాబాద్‌లోని చాలా డివిజన్లలో పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూడా పోలింగ్ కేంద్రాలు బోసిపోయి కనిపించాయి. సాధారణంగా ఎన్నికల్లో సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూలైన్లు కనిపిస్తుంటాయి. ఈసీ రూల్స్ ప్రకారం టైంలోగా క్యూలో ఉన్న అందరికీ ఓటేసే చాన్స్ ఇస్తారు. కానీ మంగళవారం జరిగిన జీహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎక్కడా కూడా ఇలాంటి సీన్ కనిపించలేదు. ఓటర్లే కాదు.. రాజకీయ పార్టీల హడావుడి కూడా లేదు. పొద్దున్నుంచీ ఉన్నట్టుగానే సాయంత్రం కూడా మెల్లగా ఓటింగ్ జరిగింది. బూత్‌లన్నీ ఖాళీగా ఉండటంతో ఎలక్షన్ స్టాఫ్ రిలాక్స్ అవడం కనిపించింది. ఈసీ ఆఫీసులో ఏర్పాటు చేసిన లైవ్ వెబ్ క్యాస్టింగ్ లో ఏ పోలింగ్ సెంటర్ల దగ్గర కూడా పెద్దగా ఓటర్లు కనిపించలేదు.
ఈసీకి కంప్లైంట్స్
సర్కిల్ పేరు 5 గంటల తుది చివర్లో
వరకు పోలింగ్ పెరిగింది
సికింద్రాబాద్ 29.22 48.08 18.86
ఫలక్‌నుమా 33.24 49.79 16.55
గోషామహల్ 35.51 51.80 16.29
శేరిలింగంపల్లి 28.14 41.80 13.66
పటాన్‌చెరు 52.76 65.09 12.33
చందానగర్ 26.42 38.26 11.84
చార్మినార్ 37.97 49.24 11.27
కంచన్ బాగ్ లో ఎక్కువ.. యూసుఫ్ గూడలో తక్కువ
గ్రేటర్ ఎలక్షన్లలో అత్యధికంగా ఆర్సీపురం డివిజన్లో -67.71 శాతం పోలింగ్ నమోదైంది. అదేకోవలో పటాన్‌చెరు -65.77, భారతీ నగర్ -61.89, గాజులరామారం -58.61 శాతం ఓటింగ్ జరిగింది. అతి తక్కువగా యూసుఫ్‌గూడలో -32.99 శాతం, మెహదీపట్నం -34.41, సైదాబాద్ -35.77, సంతోష్ నగర్ 35.94, మియాపూర్ డివిజన్లో -36.34 శాతం పోలింగ్ జరిగింది.
అనుమానాలు వస్తున్నయ్
అధికారాన్ని దుర్వినియోగం చేసి ఎలక్షన్లలో ప్రయోజనం పొందడం టీఆర్‌ఎస్ వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఎలక్షన్ చివరి గంటలో పోలింగ్ శాతం భారీగా పెరగడాన్ని బట్టి చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయి. ఎలక్షన్ కమిషన్, పోలీసులు, అధికార వ్యవస్థ టీఆర్ఎస్కు తలొగ్గాయి. ఎన్నికల ప్రకియ, పోలింగ్ సరళిని చూస్తే.. టీఆర్‌ఎస్ అక్రమాలకు పాల్పడిందని స్పష్టమవుతోంది. ఈ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్‌దే..
– సంపత్‌కుమార్,
ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే