
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లలో 2018 ఎన్నికలతో పోలిస్తే ఈ సారి పోలింగ్ శాతం కొంత మేర తగ్గింది. వంద శాతం పోలింగ్ లక్ష్యంగా అధికార యంత్రాంగం విస్తృత అవగాహన, చైతన్య కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పోలింగ్ అనుకున్నంత స్థాయిలో జరగలేదు. అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచే జిల్లా ఎన్నికల అధికారులు, కొత్త ఓటర్ల నమోదు, పోలింగ్ శాతం పంపుపై ప్రత్యేక దృష్టి సారించారు.
అన్ని సెగ్మెంట్లలో ఓటరు చైతన్య యాత్రలు నిర్వహించారు. ఓటు విలువ, ఓటు హక్కు ప్రాధాన్యం తెలిపేలా కళాబృందాల ద్వారా అవగాహన కల్పించారు. ప్రధానంగా కాలేజీల్లో ప్రోగ్రాంలు ఏర్పాటు చేసి యువత ఓటు వేసేలా చైతన్య పరిచారు. పట్టణాలు, గ్రామాల్లో పోస్టర్ల ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రజలను జాగృత పరిచారు. నోడల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గ్రామగ్రామాన ఈవీఎంల ద్వారా ఓటు వేయడంపై ప్రత్యక్ష అవగాహన కల్పించారు.
80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నడవలేని పరిస్థితిలో ఉన్న ఓటర్లకు ఇంటి దగ్గరే ఓటు హక్కు వినియోగించుకునే సౌకర్యం కల్పించారు. పొలిటికల్ పార్టీలు కూడా గ్రామాల్లో ఉన్న ఓటర్లందరినీ కలిసి అందరూ విధిగా ఓటేయ్యాలని పిలుపునిచ్చారు. ఉద్యోగం, ఉపాధి రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉన్న వారిని స్వగ్రామాలకు రప్పించి ఓటేసేలా చూశారు. అయినప్పటికి పోలింగ్‌శాతం అనుకున్నంత పెరగలేదు.
మెదక్ జిల్లాలో..
జిల్లాలోని పోలింగ్‌శాతం స్వల్పంగా తగ్గింది. మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,40,341 లక్షల మంది ఓటర్లు ఉండగా 3,81,912 మంది (86.69 శాతం) ఓటు హక్కు వినియోగించుకున్నారు. నియోజకవర్గాల వారీగా మెదక్‌లో మొత్తం 2,16,748 మంది ఓటర్లకు 95,234 మంది మహిళలు, 89,685 మంది పురుషులు కలిపి 1,84,920 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నర్సాపూర్‌లో మొత్తం 2,23,593 ఓటర్లకు గాను 99,293 మహిళలు, 97,697 పురుషులు కలిపి 1,96,992 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సంగారెడ్డి జిల్లాలో..
జిల్లాలో ఓవరాల్ గా 76.61 శాతం పోలింగ్ నమోదైంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే స్వల్పంగా పోలింగ్ శాతం తగ్గింది. సంగారెడ్డి సెగ్మెంట్లో మొత్తం 2,45,253 ఓట్లు ఉండగా 92,065 మంది మహిళలు, 92,892 మంది పురుషులు కలిపి 1,84,974 మంది ఓటేశారు. ఆందోల్ సెగ్మెంట్లో 2,49,248 ఓట్లు ఉండగా 1,05,642 మంది మహిళలు, 1,05,722 మంది పురుషులు కలిపి 2,11,364 మంది ఓటేశారు. నారాయణఖేడ్ సెగ్మెంట్లో మొత్తం 2,31,000 ఓట్లు ఉండగా 98,000 మంది మహిళలు, 93,610 మంది పురుషులు కలిపి 1,92,418 మంది ఓటేశారు.
జహీరాబాద్ సెగ్మెంట్లో 2,70,785 ఓట్లు ఉండగా 1,01,302 మంది మహిళలు, 1,06,445 మంది పురుషులు కలిపి 2,07,748 మంది ఓటేశారు. పటాన్చెరు సెగ్మెంట్లో మొత్తం 3,97,237 ఓట్లు ఉండగా, 1,34,740 మంది మహిళలు, 1,42,792 మంది పురుషులు కలిపి 2,77,568 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
సిద్దిపేట జిల్లాలో ..
జిల్లాలో గత ఎన్నికలతో పోలిస్తే రెండు శాతం పోలింగ్ తగ్గింది. నాలుగు సెగ్మెంట్లలో కలిపి మొత్తం 84.13 శాతం నమోదైంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్ సెగ్మెంట్లలో గ్రామీణ ఓటర్లే ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జిల్లాల్లో మొత్తం 9,25,398 మంది ఓటర్లకు 7,87,871 మంది ఓటు వేశారు. వీరిలో పురుషులు 3,92,014 మంది కాగా మహిళలు 3,95,852 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలే 3,838 మంది అధికంగా ఓటు వేశారు.
సెగ్మెంట్ల వారీగా పరిశీలిస్తే నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే దుబ్బాకలో అత్యధికంగా 87.51 శాతం పోలింగ్ నమోదు కాగా కనిష్టంగా సిద్దిపేట నియోజకవర్గంలో 76.29 పోలింగ్ శాతం నమోదైంది. గజ్వేల్ నియోజకవర్గం 84.14 శాతంతో రెండవ స్థానంలో నిలవగా 78.75 శాతంతో హుస్నాబాద్ తృతీయ స్థానంలో నిలిచింది. ఈ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవడంలో అనాసక్తి చూపినట్లు కనిపిస్తోంది. సిద్దిపేట పట్టణంలో కేవలం 62 శాతమే పోలింగ్ జరిగింది. గజ్వేల్ పట్టణంలోను అటు ఇటుగా అరవై శాతం పోలింగ్జరిగింది.
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద గట్టి భద్రత
ఓట్ల లెక్కింపునకు రేపటి దాకా గడువు ఉండడంతో మూడు జిల్లాల్లోనూ ఈవీఎంలు భద్రపరచిన కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడెంచల భద్రత ఏర్పాటు చేశారు. ఈవీఎంలు భద్రపరిచిన గదులకు రెండు తాళాలతో సీల్ చేయగా వాటి వద్ద కేంద్ర బలగాలతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. రెండో అంచెలో రాష్ట్ర సాయుధ బలగాలతో మూడో అంచెలో సివిల్ పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. ఈవీఎంలు భధ్రపరచిన గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ రోజున అభ్యర్థుల ఏజెంట్లు, అధికారుల సమక్షంలో గదులను తెరచి ఈవీఎంలను బయటకు తీసుకొస్తారు.