ఏపీలో ప్రారంభమైన పోలింగ్.. కొన్నిచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

ఏపీలో ప్రారంభమైన పోలింగ్.. కొన్నిచోట్ల మొరాయిస్తున్న ఈవీఎంలు

ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని చోట్ల ఓటింగ్ ప్రారంభమైన కొద్ది సేపటికే ఈవీఎంలు పనిచేయలేదు. విశాఖలోని కృష్ణా కాలేజీలోని పోలింగ్ కేంద్రంలో ఆరు ఈవీఎంలు పనిచేయలేదు. అనంతపురం జిల్లా గాండ్లపర్తిలోని 153 పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం కూడా మొరాయించింది. దీంతో వాటిని సరిచేసేందుకు ఎన్నికల అధికారులు ప్రయత్నించారు. విషయాన్ని ఉన్నతాధికారులకు తెలిపారు.

ఏపీలో.. 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలలో పోలింగ్ జరగుతోంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. విశాఖ జిల్లాలోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. APలో 46 వేల 120 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ప్లాన్ చేశారు. సమస్యాత్మకంగా ఉండే పోలింగ్ కేంద్రాల దగ్గర మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించేందకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 2 వేల 118 మంది… 25 లోక్ సభ నియోజకవర్గాలకు 319 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.  మొత్తం 3 కోట్ల 93 లక్షల 45 వేల 717 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే ఈ సారి దాదాపు 10 లక్షల మంది యువత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 56 వేల 908 మంది సర్వీసు ఓటర్లు, 5 లక్షల 27 వేల మంది వరకు దివ్యాంగులు ఓటర్లు ఉన్నారు.

APలో తొలిసారిగా ఈ ఎన్నికల్లోనే వీవీ ప్యాట్లను ఈసీ వినియోగిస్తోంది. తొలిసారి బ్యాలెట్ యూనిట్లపై అభ్యర్థుల ఫొటోలను కూడా ముద్రించింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్ కేంద్రాల దగ్గర నిఘా కట్టుదిట్టం చేశారు. బాడీ ఓన్ కెమెరాలు, సీసీ కెమెరాలు, డ్రోన్ లు వినియోగిస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వీడియో రికార్డింగ్ చేయనున్నారు.  28వేల పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేశారు.

మొత్తం 3 లక్షల మంది పోలింగ్ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తున్నారు.  పోలింగ్ కు లక్షా 20 మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాట్లు చేశారు. 197 కంపెనీల కేంద్ర బలగాలు, 51 వేల 525 పోలీసులు, 60 కంపెనీల ఏపీ ఎస్పీ బలగాలు,4 వేల 500 మంది కర్నాటక, 736 మంది ఒడిశా పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మొత్తం 46 వేల 120 పోలింగ్ స్టేషన్లు ఉండగా… అందులో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు 8 వేల 514 గుర్తించారు.