రాష్ట్రంలో 17ఎంపీ స్థానాలకు మొదలైన పోలింగ్

రాష్ట్రంలో 17ఎంపీ స్థానాలకు మొదలైన పోలింగ్

రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 17ఎంపీ సీట్లకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ స్థానంలో 185 మంది, అత్యల్పంగా మెదక్ స్థానంలో 10 మంది ఉన్నారు. దివ్యాంగుల కోసం బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్లు ప్రింట్ చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో దివ్యాంగ ఓటర్లకు ర్యాంప్ లు, వీల్ చైర్లతోపాటు ఉచిత రవాణా సౌకర్యం కల్పించనున్నారు. విధుల్లో 3 లక్షల మందికిపైగా సిబ్బంది పాల్గొంటున్నారు.  రాష్ట్రంలో మొత్తం 2 కోట్ల 97 లక్షల 8 వేల 599 మంది ఓటర్లు ఉన్నారు. 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రెండు ఎంపీ స్థానాల పరిధిలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.

నిజామాబాద్ ఎంపీ స్థానంలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రాష్ట్రంలో మొత్తం 34 వేల 604 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇందులో 6 వేల 445 పోలింగ్ స్టేషన్లను క్రిటికల్ పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. మొత్తం 79వేల 882 ఈవీఎంలు, 42వేల 853 కంట్రోల్ యూనిట్లు, 46 వేల 731 వీవీ ప్యాట్లు అందుబాటులో ఉంచారు. 4వేల 169 వెబ్కాస్టింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మిగతా చోట్ల డిజిటల్ రికార్డ్ ఉంటుంది. ఇందుకోసం 21 వేల 360 సీసీ కెమెరాలు, 13 వేల 244 ఆండ్రాయిడ్ ఫోన్స్, ట్యాబ్స్ సిద్ధం చేశారు.