నిజామాబాద్, వెలుగు: పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో పోలింగ్ శాతం తగ్గింది. అసెంబ్లీ ఎన్నికల్లో తరలివచ్చిన ఓటర్లు ఎంపీ ఎలక్షన్ పై ఓటర్లు ఆసక్తి చూపలేదు. పోలింగ్ శాతాన్ని పెంచడానికి ఆఫీసర్లు చేసిన ప్రయత్నాలు పెద్ద రిజల్టు ఇవ్వలేకపోయాయి. కేవలం ఆరు నెలల వ్యవధిలో పోలింగ్ శాతం తగ్గడంపై పొలిటికల్ సర్కిల్స్ కూడా చర్చించుకుంటున్నాయి. అర్బన్ సెగ్మెంట్ ఓటర్లు ఎప్పటిలానే ఈసారి కూడా నిరాసక్తత చూపారు. పోటాపోటీ ఎన్నిక జరిగినట్లు భావిస్తున్న అభ్యర్థులు లాభనష్టాల లెక్కలు వేసుకుంటున్నారు.
అసెంబ్లీలో 74.71శాతం.. పార్లమెంట్లో 71.92 శాతం పోలింగ్ నమోదైంది. నవంబర్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో మొత్తం 16,72,118 మంది ఓటర్లుండగా 12,49,234 మంది ఓటు హక్కు వినియోగించుకున్నాయి. 74.71 శాతం పోలింగ్ నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల వేళ కొత్తగా32,749 మందికి ఓటు హక్కు లభించడంతో మొత్తం ఓటర్లు సంఖ్య 17,04,867కు చేరింది. పోలింగ్ శాతం మాత్రం పెరగలేదు. 12,26,133 మంది పౌరులే ఓటు వేయగా పోలింగ్ 71.92 శాతంగా నమోదైంది.
పెరిగిన ఓటర్లతో పాటు అసెంబ్లీలో ఓటేసిన 23,101 మంది పార్లమెంట్ ఎన్నికలకు దూరం ఉన్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ ఓటింగ్‌లో మార్పు తేవడానికి ఆఫీసర్లు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అసెంబ్లీలో 62.64 శాతం రికార్డయిన పోలింగ్ పార్లమెంట్ ఎలక్షన్లో 61.83 శాతంగా నమోదైంది. ఇందూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 29 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ప్రధాన పార్టీల తరఫున బీజేపీ క్యాండిడేట్‌గా అర్వింద్, కాంగ్రెస్ నుంచి జీవన్‌రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ పక్షాన బాజిరెడ్డి గోవర్ధన్ బరిలో ఉన్నారు. ఈ ముగ్గురు అభ్యర్థులు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంట్ బరిలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పోలింగ్పెరుగుతుందని భావించగా ఉల్టా అయింది. అయితే 2019 పార్లమెంట్ ఎన్నికలలో 68.37 శాతంగా ఉన్న పోలింగ్ ఈసారి 71.92 శాతానికి పెరిగినా.. అసెంబ్లీ ఎన్నికల కంటే తగ్గింది.
పోలింగ్ సరళి
2023 అసెంబ్లీ 2024 పార్లమెంట్
ఆర్మూర్ 77.06% 73.14%
బోధన్ 78.25% 74.56%
నిజామాబాద్ 62.64% 61.83% (అర్బన్)
నిజామాబాద్77.09% 74.54% (రూరల్)
బాల్కొండ 78.97% 74.75%
కోరుట్ల 76.30% 73.75%
జగిత్యాల 76.24% 73.92%
మొత్తం 74.71% 71.92%