వాషింగ్టన్: గత ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక తాను వైట్‌హౌస్‌ను వీడి ఉండాల్సింది కాదని అమెరికా రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ క్యాండిడేట్, మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ వ్యాఖ్యానించారు. తాము చాలా బాగా పనిచేశామని, ఓటమిని ఒప్పుకొని ఉండాల్సింది కాదని పరోక్షంగా చెప్పారు. మంగళవారం అమెరికా 47 వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పోలింగ్ పూర్తికానున్నది. ఈ నేపథ్యంలో సోమవారం ట్రంప్ సుడిగాలి పర్యటన చేశారు. పెన్సిల్వేనియాలోని లిటిట్జ్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ 2020 ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను పదవిని వీడే నాటికి దేశానికి అత్యంత సురక్షితమైన సరిహద్దులున్నాయి. ఆ సమయంలో నేను వైట్‌హౌస్‌ను వీడాల్సింది కాదు.
మేం నిజంగా చాలా బాగా పనిచేశాం. ఈసారి ప్రతి పోలింగ్ బూత్ వద్ద వందలకొద్దీ లాయర్లను ఉంచాం” అని అన్నారు. కాగా, ఈ వ్యాఖ్యలు ఒకవేళ ట్రంప్ ఓడిపోతే నవంబర్ 5న జరిగే ఓటింగ్ ఫలితాన్ని అంగీకరించకుండా ఉండేందుకు అతడు రంగం సిద్ధం చేసుకుంటున్నాడనే భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. కాగా, అయోవాలో తనకంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ ముందున్నారన్న పోల్ సర్వేలపై ట్రంప్ స్పందించారు. ప్రత్యర్థిని పూర్తిగా అణచివేసేందుకే ఇలాంటి సర్వేలు చేస్తారని, అవి పూర్తిగా చట్టవిరుద్ధమని అభిప్రాయపడ్డారు. తాను అలాంటివాటిని అంతగా పట్టించుకోనని చెప్పారు.
నార్త్‌కరోలినాలోని కిన్స్టోన్లో నిర్వహించిన ఎలక్షన్ ర్యాలీలోనూ ట్రంప్ మాట్లాడారు. ఈ ఎన్నికల్లో హారిస్ గెలిస్తే సరిహద్దులను పూర్తిగా తెరుస్తారని, వలసదారులు, చొరబాటుదారులు, నేరగాళ్లు దేశంలోకి చొరబడతారని అన్నారు. హారిస్‌కు ముందుచూపు లేదని విమర్శించారు. తాను గెలిస్తే అమెరికన్లే దేశాన్ని పాలిస్తారని అన్నారు.