మహబూబ్‌నగర్ : పోలింగ్​ ప్రశాంతం

మహబూబ్‌నగర్ :  పోలింగ్​ ప్రశాంతం
  • ఈవీఎంల మొరాయింపుతో ఓటర్లకు తప్పని తిప్పలు
  • జడ్చర్ల, దేవరకద్రలో 11 గంటల తర్వాత అనుహ్యంగా పెరిగిన పోలింగ్​
  • టీఎన్జీవోస్​ మాజీ అధ్యక్షుడు రాజేందర్​రెడ్డిపై బీఆర్ఎస్​ లీడర్ల దాడి
  • వర్కూరులో పోలింగ్​ స్టేషన్​లోకి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యే చిట్టెంను అడ్డుకున్న కాంగ్రెస్​ లీడర్లు

వెలుగు, నెట్​వర్క్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్  ప్రశాంతంగా జరిగాయి. పలు పోలింగ్​ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు క్యూలో బారులు తీరడంతో కొన్ని సెంటర్ల వద్ద రాత్రి 8 గంటల వరకు పోలింగ్​ సాగింది. అనంతరం పోలీసు బందోబస్తు  మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్​ రూమ్​లకు తరలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకపోవడంతో అధికారులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 

మందకొడిగా ప్రాంరభమై..

ఉదయం ఏడు గంటలకు పోలింగ్​ ప్రారంభమైనా 11 గంటల వరకు మందకొడిగా సాగింది. జడ్చర్ల, దేవరదకద్ర నియోజకవర్గాల్లో 11 గంటల తర్వాత ఒక్కసారిగా పోలింగ్​ పర్సంటేజీ పెరిగింది. రెండు నియోజకవర్గాల్లో పోలింగ్​ ముగిసే సమయానికి 75 శాతం పైగా ఓట్లు పోల్​ అయ్యాయి. ఉదయం తొమ్మిది గంటల వరకు నారాయణపేటలో 8 శాతం, మక్తల్​లో 9.67 శాతం, మహబూబ్​నగర్​లో 11.98, జడ్చర్ల 11.50, దేవరకద్రలో 7.10, 11 గంటల వరకు నారాయణపేటలో 21.60, మక్తల్ 24.56, మహబూబ్​నగర్​లో 24.6, జడ్చర్లలో 23.11, దేవరకద్రలో 19.83, మధ్యాహ్నం ఒంటి గంట వరకు నారాయణపేట 42.90, మక్తల్ 42.31, మహబూబ్​నగర్​ 42.38, జడ్చర్ల 50.14, దేవరకద్ర 42.78, 3 గంటల వరకు నారాయణపేట 55.4, మక్తల్ 58.86, మహబూబ్​నగర్​ 57.05, జడ్చర్ల 61.30, దేవరకద్ర 58.62, ఐదు గంటలకు నారాయణపేట 66.13, మక్తల్​ 69.21, మహబూబ్​నగర్​ 69.32, జడ్చర్ల 73.80, దేవరకద్ర 78.32 % పోలింగ్​ నమోదైంది. 

సతాయించిన ఈవీఎంలు..

  •    దేవరకద్ర, మక్తల్, జడ్చర్ల, కొడంగల్​ నియోజవర్గాల్లోని పలు పోలింగ్​ స్టేషన్లలో ఈవీఎంలు సతాయించాయి. కొన్ని చోట్ల టెక్నికల్​ ప్రాబ్లం వల్ల ఈవీఎంలు స్లోగా రన్​ కావడంతో పోలింగ్​ టైం     ముగిసినా ఎనిమిది గంటల వరకు ఆఫీసర్ల పర్మిషన్​తో పోలింగ్​ కొనసాగింది.
  •   మద్దూరు మండలంలోని చెన్నారెడ్డిపల్లిలో ఈవీఎం మొరాయించడంతో రాత్రి తొమ్మిది వరకు పోలింగ్ జరిగింది. 
  •   నవాబ్​పేట మండలం యన్మన్​గండ్లలో ఉదయం ఏడు గంటలు ప్రారంభం కావాల్సిన పోలింగ్​.. ఈవీఎం మొరాయించడంతో గంట ఆలస్యంగా ప్రారంభమైంది. 8 గంటల వరకు పోలింగ్​        సాగింది. లోకిరేవు, కొండాపూర్, కాకర్లపహాడ్​ పోలింగ్​ స్టేషన్లలో ఈవీఎంలలో నెట్​వర్క్​ ప్రాబ్లం వల్ల ఆరున్నర వరకు పోలింగ్​ సాగింది.
  •   ఊట్కూర్ మండలం పెద్దచెట్టు గ్రామంలోని 19వ పోలింగ్​ స్టేషన్​లో  ఈవీఎం మొరాయించింది. దీంతో రాత్రి ఏడు గంటల వరకు పోలింగ్​ సాగింది.
  •   జడ్చర్ల మున్సిపాల్టీలోని 185 పోలింగ్ స్టేషన్​ వద్ద  ఈవీఎం మొరాయిచింది. దీంతో అరగంట పాటు పోలింగ్​ నిలిచిపోయింది. అధికారులు టెక్నికల్​ ప్రాబ్లమ్​ను సాల్వ్​ చేయడంతో తిరిగి          పోలింగ్​ ప్రారంభమైంది.
  •   దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామంలోని 140 పోలింగ్​ స్టేషన్​లో ఈవీఎం అరగంట పాటు సతాయించడంతో పోలింగ్​ నిలిచిపోయింది. ఇదే మండలంలోని గోపన్​పల్లిలో 145లో కూడా ఇదే ప్రాబ్లమ్​ రావడంతో అక్కడ అరగంట తర్వాత పోలింగ్​ తిరిగి ప్రారంభమైంది.
  •   చిన్నచింతకుంట మండల కేంద్రంలో 221 పోలింగ్​ స్టేషన్​లో ఈవీఎం రెండు సార్లు మొరాయించింది. దీంతో పోలింగ్​ ఆలస్యమైంది.
  •   అడ్డాకుల మండలం బలీదుపల్లి గ్రామంలో ఒకే పోలింగ్​ స్టేషన్​ను ఏర్పాటు చేయడం వల్ల ఓటర్లు ఇబ్బంది పడ్డారు. దాదాపు రాత్రి ఏడున్నర గంటల వరకు పోలింగ్​ సాగింది. 1,136 ఓటకు గాను 940 ఓట్లు పోలయ్యాయి.
  •   గద్వాల జిల్లా మానవపాడు మండలం అమరవాయి, గట్టు మండలం గొర్లఖాన్ దొడ్డి, గద్వాల పట్టణం, మల్దకల్ మండలం పెద్దోడి విలేజ్ లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్​ ఆలస్యమైంది. ధరూర్  మండలం గుడ్డందొడ్డి విలేజ్​లో బీజేపీ కార్యకర్త రమేశ్ పై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారు. 
  •  వనపర్తి జిల్లా పాన్​గల్​ మండలం అన్నారంలో ఈవీఎంలు మొరాయించగా, ఖిల్లా ఘణపురం, పెద్దమందడి మండలంలోని పలు గ్రామాల్లో  ఓటర్లకు డబ్బు పంచుతున్నారన్న ప్రచారం జరగడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్  వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. 

నిరసనలు.. దాడులు

నారాయణపేట జిల్లా మక్తల్​ నియోజకవర్గం మాగనూర్​ మండలం వర్కూరు గ్రామంలో బీఆర్ఎస్​ క్యాండిడేట్​, ఎమ్మెల్యే చిట్టెం రామోహన్​రెడ్డిపై కాంగ్రెస్​ కార్యకర్తలు తిరగబడ్డారు. 59, 60వ పోలింగ్​ స్టేషన్​లోకి ఎమ్మెల్యే తనతో పాటు మరో 14 మంది బీఆర్ఎస్​ లీడర్లను తీసుకొచ్చారు. ఇందుకు కాంగ్రెస్​ లీడర్లు అడ్డు చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే, ఆయన వాహనంపై దాడి చేసే ప్రయత్నం చేయగా, అక్కడే ఉన్న పోలీసులు, గన్​మెన్​లు ఎమ్మెల్యేను అక్కడి నుంచి పంపించారు.

ఆయన కారులో వెళ్తుండగా వెంబడించారు.మహబూబ్​నగర్​ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీనివాస్​కాలనీలో ఉన్న 100, 101 పోలింగ్​ స్టేషన్ల వద్ద టీఎన్జీవోస్​ మాజీ అధ్యక్షుడు​రాజేందర్ రెడ్డిపై బీఆర్ఎస్​ లీడర్లు దాడి చేశారు. తనపై బీఆర్ఎస్​ అభ్యర్థి, మంత్రి వి.శ్రీనివాస్​ గౌడ్​ ఆదేశాలతో మహేశ్​గౌడ్ తో పాటు మరికొందరు దాడి చేశారని రూరల్​పోలీస్​ స్టేషన్​లో కంప్లైంట్​ చేశారు.