కా లుష్యం మానవుల మీద రకరకాలుగా ప్రభావం చేస్తుంది. పర్యావరణ కాలుష్య కారకాలు, రసాయనాలు, విష వాయువులు, లోహాలు, సీసం లేదా మిథైల్, పాదరసం వంటివి కొందరిని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. ఒకప్పుడు, వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మదనపల్లి దగ్గర నివసిస్తే వ్యాధిగ్రస్తులకు ఉపశమనం వస్తుంది అని అక్కడ ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. ఉద్యోగ విరమణ అనంతరం బెంగళూరు నగరానికి అనేక కుటుంబాలు చేరడానికి పర్యావరణమే కారణం. ప్రకృతి వలన ఆరోగ్యం ఉన్నప్పుడు, ఆ వనరులు లేకుంటే కలుషితం అయితే వ్యాధులు రావడం కూడా సహజం. అభివృద్ధి, ఆధునికత వెంట పరుగులు పెడుతున్న మానవ సమాజం ఆరోగ్యం అందించే ప్రకృతి వనరులను కలుషితం చేస్తూ, తమ ఆహారం, నీళ్ళు, ప్రాణవాయువులను కలుషితం చేసుకుంటున్నది. జీవించే పర్యావరణమే నిరంతరం మారుతూ ఉంటుంది. పారిశ్రామికీకరణ, పట్టణీకరణ మానవ ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయి.
ప్లాస్టిక్, రసాయనాలు,ఉష్ణోగ్రతల్లో మార్పులు
ప్రస్తుతం మానవ సమాజం వేలాది రసాయనాలను తయారు చేసి, వాడుతున్నది. ఇవి గాలి, నీరు, ఆహారంలో రకరకాలుగా చేరుతున్నాయి. వ్యాధులకు అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. కొన్ని రసాయనాల కణాలు రోగ నిరోధక శక్తి నిఘాను దాటి నిక్షిప్తం అవుతున్నాయి. వైరల్ ఇన్ఫెక్షన్ల వల్ల ఇతర వ్యాధులు వచ్చే ప్రమాదం ఇటీవల పెరిగింది. వీటిలో క్యాన్సర్, అలెర్జీ వ్యాధులు, అటోమ్యూన్ వ్యాధులు ఉన్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాలు కూడా కొత్తగా జోడి అయినాయి. సూక్ష్మ ప్లాస్టిక్ పదార్థాలు మానవుల శరీరంలో ప్రవేశిస్తున్నాయి అని పరిశోధకులు గుర్తించారు. మానవ కార్యకలాపాల కారణంగా ఉష్ణోగ్రతలలో వస్తున్న విపరీత మార్పులు, వాతావరణంలో వస్తున్న దీర్ఘకాలిక మార్పులు కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యాధుల వ్యాప్తిని పెంచాయి. వాతావరణ మార్పుల కారణంగా పరోక్షంగా పేదరికాన్ని పెంచుతూ, వారిని రోగగ్రస్తులను చేస్తున్నది. వాతావరణ మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పెరుగుతున్న వర్షపాత వైవిధ్యం కారణంగా ఆహార భద్రతను, ఆహార వైవిధ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది.
జన్యుమార్పిడి వంగడాలు - అనారోగ్య పరిణామాలు
జన్యు మార్పిడి వంగడాల వల్ల ఏర్పడే అనారోగ్య పరిణామాల మీద పరిశోధనలు చాల తక్కువ. సెరాలిని అనే ఫ్రెంచ్ శాస్త్రవేత్త జన్యు మార్పిడి పంటల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది అని హెచ్చరించారు. వాటి వల్ల ఏర్పడే ప్రమాదకర పరిణామాలను గుర్తించకుండా, గుడ్డిగా వివిధ ప్రభుత్వాలు అనుమతులు ఇస్తున్నాయి. ఈ టెక్నాలజీ పేరిట కంపెనీలు తమ గుత్తాధిపత్యం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మానవుల శరీరాలలో వైవిధ్యం ఉంది. ఖండాల వారీగా జన్యువులలో తేడా ఉన్నది. ప్రయాణాలు, వలసల నేపథ్యంలో ఈ జన్యు వైవిధ్యంలో మార్పులు వస్తున్నాయి.
దంపతులవుతున్న రక్త సంబంధీకులు
నెదర్లాండ్స్ దేశంలో ఒక 41 ఏళ్ల వ్యక్తి వీర్యదానం ద్వారా 500 మందికి పైగా పిల్లలకు తండ్రి అయ్యాడని ఇటీవల ఒక మహిళ ఫిర్యాదు చేసింది. రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు వద్దు అంటున్న వైద్య రంగం, అటువంటి పరిణామాల గురించి శోధించడం లేదు. ఆధునిక న్యాయ శాస్త్రం వీర్య దానం వల్ల జరిగే నష్టాల గురించి ఆలోచించడం లేదు. ఇటీవల కొన్ని దేశాలలో పుట్టిన పిల్లల ద్వారా కొందరు దంపతులు తోబుట్టువులు అని తెలిసింది. విచ్ఛిన్నమవుతున్న సామాజిక సంబంధాలలో వావి వరుసలు తెలిసే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ప్రాచీన సామాజిక కట్టుబాట్లు, గోత్రం, ఇంటి పేరు, వగైరాలను కాదంటున్న ఆధునిక మానవులు, తోబుట్టువులను, రక్త సంబంధీకులను గుర్తించే వ్యవస్థలు ఏర్పాటు చేసుకోలేదు. కలుషితాల వల్ల, జన్యు మార్పిడి వల్ల రాబోయే తరాల మీద పడే ప్రభావాల గురించి ఆలోచించడం లేదు.
జన్యుమార్పిడి పరిశోధనలు
ఇదిలా ఉంటే, సమస్యను సృష్టించి దానిని పరిష్కారం కొరకు పరితపించే ఆధునిక వ్యాపార-విజ్ఞాన పరిశ్రమ మొక్కలు, జంతువులు, మనుష్యుల మీద జన్యుమార్పిడి పరిశోధనలు చేస్తున్నారు. జన్యుమార్పిడి వల్ల సహజ జన్యుక్రమం శాశ్వతంగా కలుషితం అయ్యే ప్రమాదం గురించి నిపుణులు ఆందోళన పడుతున్నారు. టెస్ట్ ట్యూబ్ బేబి పరిశోధనల పరిణామాలు మీద తీవ్ర ఆందోళన ఉన్నది. చైనాలో ఒక డాక్టర్ సరైన అనుమతులు లేకుండా పరిశోధన శాలలో పిల్లలను పుట్టించడం సంచలనం రేపింది. జంతువుల మీద ఈ రకం పరిశోధనలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. ఈ మధ్య డిజైనర్ బేబిల గురించి మార్కెటింగ్ జరుగుతున్నది. ‘మంచి ఫలితం’ కొరకు ముగ్గురు వ్యక్తుల డీఎన్ఏ వాడుతున్నారు.
ఒక మహిళ గర్భం ధరించడానికి, స్పెర్మ్, అండంగర్భాశయం అవసరం. ఇద్దరు మహిళలు, లేదా ఒకే మహిళ లేదా ఒకే పురుషుడి నుంచి పునరుత్పత్తి మీద పరిశోధనలు జరుగుతున్నాయి. మున్ముందు, జాతులను, జంతువులను, మనుష్యులను కలిపి ‘ఉత్పత్తి’ చేసిన ప్రాణులు సహజంగా ఉండే డీఎన్ఏ ను కలుషితం చేస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఇటువంటి పరిశోధనలు నైతిక అంశాలే కాక ఆర్థిక, సామాజిక, పర్యావరణ సంబంధ అంశాలను స్పృశిస్తాయి. శాస్త్రీయ పరిశోధనలు, కాలుష్యం, జీవన శైలి వల్ల, ఈ మానవ జన్యుక్రమ వైవిధ్యం ప్రమాదంలో పడుతోంది.
కాలుష్య నివారణే పరిష్కారం
మనం నివసిస్తున్న ప్రపంచం మన జన్యు అభివృద్ధిపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. పరిస్థితులు చల్లగా లేదా వేడిగా మారినప్పుడు, మనలాంటి జాతులు ఆ మార్పులకు శారీరకంగా అలవాటు పడవలసి ఉంటుంది. ఆ మార్పులు మనం పునరుత్పత్తి చేసే విధానాన్ని, మనం ఎట్లా ఉంటాము లేదా మన శరీరాలు పనిచేసే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. మన డీఎన్ఏ లో ప్రమాదకరమైన, శాశ్వత మార్పులను నివారించడానికి ఉత్తమ మార్గం కాలుష్య నివారణ, భూమి ఉష్ణోగ్రతలను నియంత్రించటం, వాతావరణ మార్పులను తగ్గించడం.
కొన్ని రకాల మానవ జాతులు అంతరించొచ్చు
ఇప్పటికే ప్రపంచ జనాభాలో అనేక సామాజిక మార్పులు కనపడుతున్నాయి. అనేక దేశాలలో మహిళలు పిల్లలను కనడం మానేశారు. అంటే ఒక రకం మానవ జన్యుక్రమం తగ్గిపోయినట్టే లేదా పూర్తిగా సమసిపోవచ్చు. ఒక కుటుంబానికి ఒకే సంతతి నిబంధన దశాబ్దాలుగా చైనా కఠినంగా అమలు చేసి, జనాభాలో వచ్చిన మార్పుల దృష్ట్యా ఇటీవల వెనక్కు తగ్గింది. యువత సంఖ్య తగ్గి ముదుసలులు ఎక్కువ అవుతున్నారు. ఇంకొక వైపు అనేక మంది పిల్లలను కనలేకపోతున్నారు. ఆడ పిల్లల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. పుట్టక ముందే ఆడపిల్లలను చంపేస్తున్నారు. మహిళల సంఖ్య తగ్గిపోతున్నది. కాలుష్యం వల్ల మగవాళ్లలో వీర్యం ఉత్పత్తి సామర్థ్యం తగ్గిపోతున్నది.
ఈ పరిణామాల వల్ల కొన్ని రకాల మానవ జాతులు అంతరించిపోవచ్చు. సామాజికంగా, జీవన క్రమంలో అనేక రీతుల్లో మానవ శరీరాన్ని మనమే మార్చుకుంటున్నాము. మానవ జాతి మీద ఈ రకంగా సంక్రమిస్తున్న మార్పుల మీద లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అనేక రకాల వృక్షాలు, పక్షులు, ఇంకా అనేక జీవచరాలను కోల్పోయినాము. జీవ వైవిధ్యం వేగంగా తగ్గిపోతున్నది. మానవులలో ఉన్న వైవిధ్యం తగ్గి, మానవ జన్యు క్రమం కలుషితం అయితే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవాలి.
సంతతిపై జన్యు ప్రభావం
జన్యు పర్యావరణ కారకాలు దేనికదే స్వతంత్రంగా అనారోగ్యం కలిగించినప్పటికీ, వీటి మధ్య పరస్పర చర్యలు కూడా మానవ ఆరోగ్యంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయి. ఇవన్నీ కూడా మానవ శరీరంలో ఉన్న జన్యు వ్యవస్థ మీద ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రభావం రెండు మూడు తరాల వరకు ఉంటుంది. శాశ్వతం కూడా కావచ్చు. మహిళల శరీరాలలో పేరుకుపోతున్న రకరకాల కాలుష్యాలు వారి సంతతికి చేరుతున్నాయి. సంతతి ఆరోగ్య పరిస్థితిని శాసిస్తున్నాయి.
ఈ పరిస్థితులలో, జన్యుమార్పిడి పరిశోధనలు ఒక కొత్త రకమైన సమస్యలు సృష్టిస్తున్నాయి. పంటలలో కొత్త రకం జన్యుమార్పిడి వంగడాలు ఒక కారణం కాగా, పశువులు, జంతువులు, ఇతర జీవాల మీద జరుగుతున్న జన్యుమార్పిడి పరిశోధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. చికిత్సకు ఉపయోగించే మందులు కూడా జన్యు మార్పిడి పద్దతులలో తయారు చేస్తున్నారు. జీన్ థెరపి వల్ల మన శరీరంలో వచ్చే మార్పుల మీద తగిన పరిశోధనలు లేవు. ఇటీవల వచ్చిన కరోన టీకాలు ఈ కోవకు చెందినవే. వీటి వల్ల కొనసాగుతున్న ఆకస్మిక మరణాల మీద ఆలోచింప చేస్తున్నాయి.
- డా. దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్