నల్లమల అడవిలో మైలారం మైనింగ్ బంద్

నల్లమల అడవిలో మైలారం మైనింగ్ బంద్

మైలారం(నాగర్​ కర్నూల్), వెలుగు: నల్లమల అటవీ ప్రాంతంలోని బల్మూరు మండలం మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై మైనింగ్​ తవ్వకాలకు అనుమతి లేదని పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​ తేల్చిచెప్పింది. మైనింగ్​ ఆపరేషన్​కు అనుమతులు ఇచ్చే పీసీబీ, సీఎఫ్​వో కమిటీ మైలారంలో మైనింగ్​కు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేసింది. మైనింగ్​లో అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడినట్లు గుర్తించింది. అనుమతులు లేకున్నా లీజుదారు చేపడుతున్న తవ్వకాలు 1974 ప్రివెన్షన్  అండ్​ కంట్రోల్​ ఆఫ్​ పొల్యూషన్​ యాక్ట్​లోని వాటర్, ఎయిర్​ యాక్ట్​ 44,37 కింద  శిక్షార్హమైన నేరమని పేర్కొంది. పీసీబీ ఆదేశాలతో మైలారంలో మైనింగ్​ తవ్వకాలకు బ్రేక్​ పడడంతో గ్రామస్తుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

అన్నీ ఉల్లంఘనలే..

మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్టపై 250 మీటర్ల దూరంలో మైనింగ్​ తవ్వకాలకు మైన్స్, జియాలజీ సంస్థ లీజు​ పర్మిషన్​ ఇస్తే ఆవాసాలకు 50 మీటర్ల దూరంలోనే మైనింగ్​ పనులు చేపడుతున్నట్లు తేలింది. తవ్వకాలకు ఎలాంటి అభ్యంతరం లేదని గ్రామసభలో తీర్మానం చేసినట్లు తప్పుడు పత్రాలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని గతంలో ఫిర్యాదు చేశామని,  దానిపై ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసులేదని గ్రామస్తులు చెబుతున్నారు. అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​కు దగ్గరలో ఉన్న మైలారం ఏరియాని ఫారెస్ట్​ ఏకో సెన్సిటివ్​ జోన్​ పరిధి కిందకు వస్తుందో? లేదో? తేల్చే విషయాన్ని సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. ఇక మైనింగ్ తో గుట్టకు అవతలి వైపు ఉన్న చెరువు కలుషితమైపోతుందేమోనని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.

ఉల్లంఘనలపై కమిటీ వేయాలి..

టాస్క్​ఫోర్స్​ కమిటీ నివేదిక అనంతరం రెవెన్యూ, సర్వే, మైన్స్​ అండ్​ జియాలజీ, ఎన్విరాన్​మెంటల్​ అండ్​ పీసీబీ డిపార్ట్​మెంట్​ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి మైలారం మైనింగ్​పై వచ్చిన ఫిర్యాదులు, గ్రామస్తుల అభ్యంతరాలు, ఉల్లంఘనపై విచారణ చేపట్టాలని స్టేట్​ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​ ఆఫీసర్లు కలెక్టర్​ బదావత్​ సంతోష్​ను కోరారు. టీజీపీసీబీ ఆదేశాలతో అడిషనల్​ కలెక్టర్, మైనింగ్, సర్వే, రెవెన్యూ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ సర్వే పూర్తి చేశారు.

ఎకో సెన్సిటివ్​ జోన్​ పరిధి తేల్చరా?

నల్లమల అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్​ టైగర్​ రిజర్వ్​ సరిహద్దుల్లో ఉన్న మైలారం గ్రామంలో ఆరేండ్లుగా మైనింగ్​ కొనసాగుతూనే ఉంది. అటవీ ప్రాంత సరిహద్దుల నుంచి ఎకో సెన్సిటివ్​ జోన్ హద్దులు ఖరారు చేయలేదు. నల్లమలకు అనుకుని ఉన్న ఐదు జిల్లాల కలెక్టర్లు సమావేశమై ఎకో సెన్సిటివ్​ జోన్​ బార్డర్స్​ ఫిక్స్​ చేయాల్సి ఉంది. అది జరగకపోవడంతో అడవితో పాటు గుట్టలు కబ్జాకు గురయ్యే ప్రమాదం ఉంది.

నిబంధనలు పాటించని ఆఫీసర్లు..

మైనింగ్, రెవెన్యూ అధికారుల సహకారంతో మైలారం గుట్టపై తవ్వకాలకు లైన్​ క్లియర్​ అయ్యిందనే ఆరోపణలున్నాయి. నల్లమలలోని టైగర్​ రిజర్వ్​కు 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న మైలారం గ్రామంలో 400 ఇండ్లు,1,500 జనాభా ఉంది.  గ్రామ చెరువుపై  మూడు గ్రామాలకు చెందిన 1,500 వందల మత్స్యకార కుటుంబాలు ఆధారపడుతున్నాయి. గుట్టపై పశువులు, మేకలు, గొర్రెలకు గాసం లభిస్తుంది. మైలారం ఊరికి, అడవికి మధ్య అడ్డంగా 50 మీటర్ల దూరంలో 115 ఎకరాల్లో పెద్ద గుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్ట చెట్లు, అడవి జంతువులు, వన్యప్రాణులు. వివిధ జాతుల పక్షులకు  ఆవాసంగా మారింది. గుట్టపై పురాతన శ్రీ నర్సింహస్వామి, శివాలయం, గ్రామ దేవతల గుడులు ఉన్నాయి. 

కేంద్ర ప్రభుత్వ నిధులతో పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం, డంపింగ్​ యార్డ్​ నిర్మించారు. గుట్ట కింది భాగంలో పేదలు ఇండ్లు కట్టుకున్నారు. మైలారం, బల్మూరు, కొండనాగుల గ్రామాలకు చెందిన రైతులు, పశువుల కాపర్లు తమ పశువులు, జీవాలను గుట్టపై  మేపుకుంటారు. గుట్ట కింద ఉన్న చెరువు నుంచి మూడు ఊర్లకు చెందిన 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుంది. రూ.4,500 కోట్ల అంచనాతో అప్పర్​ప్లాట్​లో 2 లక్షల ఎకరాలకు సాగు నీరందించే ఉమా మహేశ్వరం లిఫ్ట్​లో మైలారం గుట్టకు ఆనుకుని ఉన్న చెరువును ప్రధాన రిజర్వాయర్​గా మార్చేందుకు డీపీఆర్  రూపొందించారు. 

2018 నుంచే పైరవీ..

మైలారం గ్రామానికి ఆనుకుని ఉన్న గుట్ట 115 ఎకరాల్లో విస్తరించి ఉంది. గుట్టపై సర్వే నెం.120/1లో 24.28 హెక్టార్లలో 20 ఏండ్ల పాటు క్వార్ట్జ్, పల్స్​పర్​ తవ్వకాలకు 2018లో మైనింగ్​ శాఖ అనుమతి ఇచ్చింది. దీనిని వ్యతిరేకించిన గ్రామస్తులు మెషీన్లను అడ్డుకుని తిప్పి పంపించారు. రెండు సార్లు మైనింగ్​ లీజ్​ గడువును పొడిగించిన అధికారులు 2018లో గ్రామస్తుల అభ్యంతరాలపై నివేదిక ఇచ్చారు. అప్పటి నుంచి పైరవీ చేస్తుండగా, 2024లో మైనింగ్​ అధికారులు పర్మిషన్​ ఇచ్చారు. దీనిపై పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్ అభ్యంతరాలు తెలపడంతో పాటు అనుమతులపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పనులు బంద్​ చేశారు.​