కరెంటు రిక్షాతో కాలుష్యానికి షాక్​!

మన దగ్గర ఇప్పుడు రిక్షాలు బాగా తగ్గిపోయాయేమో గానీ ఉత్తరాదిలో మాత్రం అవి అడుగడుగునా కనిపిస్తాయి. ఐదు కిలోమీటర్ల లోపు జర్నీకి జనం ఎక్కువగా వాటినే ఎక్కుతారు. ‘ఒంట్లోని సత్తువే రిక్షాకి పెట్రోల్’​ అనుకుంటూ తొక్కుతూ ముందుకు సాగిపోయే కార్మికులు ఆ రాష్ట్రాల్లో ఎందరో. వారి కాయ కష్టాన్ని, గాల్లోని కాలుష్యాన్ని తగ్గించటానికి బీహార్​, యూపీల్లో ఓ ఎన్జీవో ఈ–రిక్షాల వాడకాన్ని ఎంకరేజ్​ చేస్తోంది. ‘కరెంట్​తో నడిచే​ ఈ వెహికిల్స్​ వల్ల కలిగే లాభాలెన్నో’ అంటూ వివరిస్తోంది.

సిటీల్లో బతకటమంటే కాలుష్యపరంగా జీవిత ఖైదు అనుభవిస్తున్నట్లే లెక్క. ట్రాఫిక్, పొల్యూషన్​ పెరగటంతో నగరాలు నరకాలుగా మారుతున్నాయి. ఎయిర్​ క్వాలిటీ రోజురోజుకీ దిగజారుతోంది. దీనికి కారణాలనేకం. డీజిల్, పెట్రోల్​ వెహికిల్స్ ​పొగ ప్రజారోగ్యంపై పగ పడుతోంది. ఈ ఎమిషన్స్​కి ఎండ్​ కార్డ్​ వేయటానికి ‘ఎస్​ఎంవీ గ్రీన్ సొల్యూషన్స్​’ సంస్థ కంకణం కట్టుకుంది. దేశంలో ఎక్కువ జనాభా గల బీహార్, ఉత్తరప్రదేశ్​లలో సేవలందిస్తోంది.

నవీన్​ కృష్ణ అనే వ్యక్తి 2015లో స్థాపించిన ఈ సోషల్​ వెంచర్​ ఆ రెండు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో ఈ–రిక్షాల వాడకాన్ని పెంచటానికి కృషి చేస్తోంది. కరెంట్​తో నడిచే​ ఈ వాహనాలను కొనుక్కోవటం, వాడుకోవటం వంటి విషయాల్లో డ్రైవర్లకు సలహాలు, సూచనలు ఇస్తోంది. రిక్షా తొక్కితేనే ఇల్లు గడిచే పేదరికంలో ఉన్నోళ్లు తమకు తాముగా ఎలక్ట్రిక్​ వెహికిల్స్​కి అప్​గ్రేడ్​ అవటం చాలా కష్టం. ఈ క్రమంలో ఎదురవుతున్న సమస్యలను ఎస్​ఎంబీ ఎన్జీవో గుర్తించి పరిష్కారం చూపుతోంది.

మార్జిన్​ మనీయే ఆ సంస్థకు ఇన్​కం సోర్స్​

‘రెడీ టు డ్రైవ్​ ఈ–రిక్షా’లను ప్రొక్యూర్​ చేసే ఏజెన్సీలతో ఈ సంస్థ టైఅప్​ అయింది. తద్వారా.. ఈ–రిక్షాల్ని తయారుచేసే సంస్థలను, వాటిని కొనుక్కోవటానికి లోన్లు ఇచ్చే ఫైనాన్షియల్​ కంపెనీలను, తక్కువ ఆదాయ వర్గాలను, బ్యాటరీ ప్రొవైడర్లను, డాక్యుమెంటేషన్​ వర్క్​ ఆఫీసర్లను ఒక వేదికపైకి తెస్తోంది. ఈ–రిక్షాలను కొనుక్కోవటానికి చేతిలో డబ్బుల్లేనివారికి ఆర్థిక సంస్థల నుంచి ఈఎంఐ లోన్లు ఇప్పిస్తోంది. కొత్త టెక్నాలజీ వాడకం దిశగా రిక్షాపుల్లర్లలో నమ్మకాన్ని పెంచుతోంది.

వెహికిల్​ ఏజెన్సీలు, ఫైనాన్షియల్​ కంపెనీలు ఇచ్చే మార్జిన్​ మనీతో సంస్థను నడుపుతోంది. ఈ ఇన్నోవేషన్​ద్వారా ప్రస్తుతానికి 55 మందికి జాబులు ఇవ్వగలిగింది. భవిష్యత్​లో మరిన్ని సిటీలకు తన సేవలను విస్తరించాలనుకుంటోంది. దీంతో మరింత మందికి ఉద్యోగాలొస్తాయి. వారణాసితోపాటు ఇతర సిటీల్లో 2030 నాటికి అన్నీ కరెంట్​తో నడిచే ఆటో రిక్షాలే ఉండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఆ లక్ష్యాన్ని చేరుకోవటానికి ఈ స్వచ్ఛంద సంస్థ ‘తాను సైతం’ అంటోంది.

పొల్యూషన్​లో ప్రపంచ స్థాయికి మన సిటీలు

‘పర్టిక్యులేట్​ మ్యాటర్’​(పీఎం)–2.5ని యూనిట్​గా తీసుకొని పరిశీలిస్తే ప్రపంచంలోని ఆరు సిటీల్లో పొల్యూషన్​ విపరీతంగా ఉన్నట్లు రీసెంట్​ సర్వేలో తేలింది. ఈ ఆరు సిటీల్లో బీహార్​వే మూడు ఉన్నాయి. యూపీలోని వారణాసి ఈ లిస్టులో 14వ ర్యాంక్​ పొందింది. దేశంలోని మొత్తం ఎమిషన్స్​లో 7.5 శాతం వరకు ట్రాన్స్​పోర్ట్​, ఆటోమోటివ్​ సెక్టార్​ నుంచే వస్తున్నట్లు బెంగళూరులోని ‘ఎనర్జీ అండ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్’కి చెందిన సుగంధా పాల్​ అనే రీసెర్చ్​ అసోసియేట్,​ అర్బన్​ ట్రాన్స్​పోర్ట్​ ప్లానర్​ చెప్పారు.

2017–18లో 68 లక్షలు ఉన్న త్రీ–వీలర్ల సంఖ్య 2030 నాటికి దాదాపు రెండు కోట్లకు, 2050 నాటికి ఆరున్నర కోట్లుకు పైగా చేరుతుందనేది ‘ఎనర్జీ అండ్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్’ అంచనా. ఈ నేపథ్యంలో రానున్న కాలం ఈ–రిక్షాలదేనని పాల్​ తెలిపారు. ఇప్పుడున్న త్రీ–వీలర్లలో 30 శాతాన్ని 2030 నాటికి కరెంట్​ వెహికిల్స్​తో రీప్లేస్​ చేస్తే గాల్లోకి విడుదలయ్యే కార్బన్​డైఆక్సైడ్​ను 7 శాతం తగ్గించొచ్చని, 2050 నాటికి సెంట్​ పర్సెంట్​ విద్యుత్​ వాహనాలే ఉంటే ఎమిషన్స్​ 18 శాతం పడిపోతాయని వివరించారు.

బతుకుదెరువు, వాతావరణం మధ్య బ్యాలెన్స్​

ప్రస్తుతం మన దేశంలో 23.8 లక్షల ఎలక్ట్రిక్​ త్రీ–వీలర్లు స్టాక్​ ఉన్నాయి. ఎస్​ఎంవీ గ్రీన్ సొల్యూషన్స్ సంస్థ ఇప్పటిదాక 1038 ఈ–రిక్షాలను పేద డ్రైవర్లకు ఇప్పించగలిగింది. అందులో 550 రిక్షాలు వారణాసిలో తిరుగుతున్నాయి. దీంతో ఈ నాలుగేళ్లలో 2,076 టన్నుల కార్బన్​డైఆక్సైడ్​ ఎమిషన్స్​ని తగ్గించగలింది. ఒక వైపు ఎయిర్​ పొల్యూషన్​ని కంట్రోల్​ చేస్తూ, మరో వైపు పేదలు పైకొచ్చేలా సాయమందిస్తూ ఈ సంస్థ సమాజ సేవకు అంకితమవుతోంది. ఈ సర్వీసులకు రీసెంట్​గా అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ‘ఇంటర్నేషనల్​ సస్టెయినబుల్​ మొబిలిటీ’ కేటగిరీలో 2019 సంవత్సరానికి అష్డెన్​ అవార్డ్​ పొందింది. దీనిపై ఎన్జీవో ఫౌండర్​ నవీన్​ కృష్ణ సంతోషం వ్యక్తం చేశారు. ‘డ్రైవర్లు ఈ–రిక్షాలు కొనటానికి పొల్యూషన్​తోపాటు మరో కారణమూ ఉంది. వారణాసిలో కొత్తగా కొనే పెట్రోల్​, డీజిల్​ ఆటో రిక్షాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇవ్వట్లేదు. రెన్యువల్​ చేయట్లేదు. ఈ–రిక్షాలతోనూ నెలకు రూ.12 వేలు ఆదాయం వస్తోంది. పైగా వాటిని మెయింటనెన్స్​ చేయటం చాలా తేలిక​’ అని ఆయన వివరించారు.

3 గంటల ఛార్జింగ్​తో 100 కిలోమీటర్లు

లెడ్​ యాసిడ్​ బ్యాటరీలకు ఫుల్​ ఛార్జింగ్​ ఎక్కించాలంటే 8–10 గంటలు పడుతుంది. లిథియం–అయాన్​ బ్యాటరీలకు 3 గంటలు చాలు. 100 కిలో మీటర్లు ప్రయాణం చేయొచ్చు. కాకపోతే వాటి రేటు చాలా ఎక్కువ. లెడ్​ యాసిడ్​ బ్యాటరీల కన్నా నాలుగింతలు. ఛార్జింగ్​ పెట్టించాలంటే గ్యారేజీకి లేదా ఛార్జింగ్​ స్టేషన్​కి వెళ్లాలి. ఛార్జింగ్​ ఎక్కుతున్నంతసేపు వాహనాన్ని నడిపే ఛాన్స్​ ఉండదు. డబ్బూ సంపాదించలేం. ఈ లోటు తీర్చటానికి వారణాసిలో రెండు బ్యాటరీ స్వాపింగ్​ స్టేషన్లను ఏర్పాటుచేశాం. ఇక్కడ ఒకేసారి 15 బ్యాటరీలకు ఛార్జింగ్​ పెట్టొచ్చు. ఛార్జింగ్​ అయిపోయిన బ్యాటరీలను ఇచ్చేసి ఆల్రెడీ ఛార్జింగ్​ పెట్టి ఉంచినవాటిని తీసుకెళ్లొచ్చు. దీనికి రూ.200 చెల్లిస్తే సరిపోతుంది. టైం వేస్టూ కాదు. ఈ–రిక్షాలు గంటకు మ్యాగ్జిమం 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.

– నవీన్​ కృష్ణ,‘ఎస్​ఎంవీ గ్రీన్ సొల్యూషన్స్’ ఫౌండర్​