తెలంగాణలో ఫార్మా తదితర పరిశ్రమల వల్ల కాలుష్యం గత 40 ఏండ్లుగా పెరుగుతూనే ఉన్నది. ప్రతిరోజూ ఈ పరిశ్రమలు విడుదల చేస్తున్న వ్యర్థ జలాలు, ప్రమాదకర వాయువులు, ఘన వ్యర్థాలు పరిమాణంలో, లక్షణాలపరంగా, భౌతికంగా విస్తృతం అవుతున్నాయి. కాలుష్యం భూగర్భ జలాలలో, ఉపరితల జల వనరులలో పేరుకుపోయింది. ఎంతగా పేరుకుపోయాయి అంటే ఆ వ్యర్థాలలో ఉన్న ముడి రసాయనాల నుంచి కొందరు మందు గోళీలు తయారు చేశారు. ఏండ్లుగా హుస్సేన్‌సాగర్ తదితర చెరువులలో పొరలు పొరలుగా ఈ వ్యర్థాలు చేరుతున్నాయి. ప్రజల ఆహారంలో వీటి ఆనవాళ్ళు ఉంటున్నాయి. ప్రమాదకర లోహాలు గత 30 ఏండ్ల నుంచి గడ్డి ద్వారా, పాలు, పంటల ద్వారా, ఇంకా ఇతర మార్గాలలో తెలంగాణ రాష్ట్రవాసుల శరీరాలలోకి చేరుతున్నాయి. కలుషితాల బారిన పడిన మహిళల ద్వారా వారి సంతానంపై వీటి ప్రభావం కనపడుతున్నది.
రాజకీయవేత్తలు, కొందరు అర్థశాస్త్ర ప్రవీణులు దీనిని అభివృద్ధిలో భాగంగా చూడమంటున్నారు. రసాయన శాస్త్రవేత్తలు రసాయనాల మీద పని చేస్తున్నా రసాయనాల కాలుష్యం గురించి కిమ్మనడం లేదు. తెలంగాణా పల్లెలను పట్టి పీడిస్తున్న రసాయనాల కాలుష్యం తీవ్రత గురించి కించిత్తు ప్రస్తావన చేయడం లేదు. ప్రభుత్వం పర్యావరణ చట్టాలు అమలు చేయకుండా అనేక దారులు వెతుకుతున్నది. నేతలు తమ వ్యక్తిగత సంపద పెంచుకుంటున్నారు. “కాలుష్యం మనకు.. లాభాలు వారికి” ప్రపంచ కుబేరులలో కొందరు పెట్టుబడిదారులుగా తెలంగాణలో తిష్టవేయడానికి ఇదే ప్రధాన కారణం.
సుప్రీంకోర్టు ఆదేశించినా...
1989లో పటాన్చెరు పర్యావరణ ఉద్యమం కారణంగా 10కి పైన ఫార్మా పరిశ్రమలు మూతబడ్డాయి. కాలుష్యాన్ని సహేతుకమైన వ్యవధిలో నియంత్రిస్తామనే హామీపై తొందరగానే వాటిని తిరిగి ప్రారంభించారు. నియంత్రణ మాత్రం జరగలేదు. కాలుష్యం అప్పటి నుంచి ఇప్పటి వరకు నిరాటంకంగా కొనసాగుతోంది. 1991 సంవత్సరంలో సుప్రీంకోర్టుకు నివేదించిన దరిమిలా కాలుష్య నష్టాన్ని అంచనా వేయమని జాతీయ పర్యావరణ సంస్థ, నాగ్‌పూర్‌ని ఆదేశించింది. 1984 నుంచి 1991 వరకు, దాదాపు 7 సంవత్సరాలకు రూ.32 కోట్ల నష్టాన్ని అంచనా వేసింది. ఈ మొత్తాన్ని ప్రజలకు కట్టమని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు అది కూడా చెల్లించలేదు. బదులుగా, పంట నష్టానికి ఎకరాకు సంవత్సరానికి రూ.1,000, భూమిని బీడుగా వదిలేసినందుకు సంవత్సరానికి రూ. 1,200 నిర్ణయించబడింది. వ్యవసాయానికి, పశువులకు, ప్రజల ఆరోగ్యానికి హాని చేసిన పరిశ్రమలు తమ ‘కాలుష్య పాపానికి పరిహారం’ చెల్లించాలని చట్టం ఒప్పుకున్నా, సుప్రీంకోర్టు ఆదేశించినా చేయలేదు. ఇక్కడి పరిశ్రమల అధిపతులకు ఇప్పుడు వేల కోట్ల ఆస్తులున్నాయి. కానీ, వారు ఇప్పటికీ పశ్చాత్తాప పడటంలేదు. ప్రాయశ్చితం చేసుకోవడం లేదు.
పీసీబీపై కాలుష్య నిర్ధారణ బాధ్యత
కొత్తగా పరిశ్రమల కాలుష్యం ఎదుర్కొంటున్న గ్రామాలు, గ్రామస్తులు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మొట్టమొదటగా పరిశ్రమపెట్టే ముందు కాలుష్యం లేనే లేదు అని బుకాయిస్తారు. 1980, 90 దశాబ్దాలలో గ్రామీణ ప్రజలకు దీనిని ఎట్లా ఎదుర్కోవాలో తెలిసేది కాదు. క్రమంగా, కాలుష్యం నిర్ధారించే బాధ్యత రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి మీద చట్టప్రకారం ఉంచబడింది. ప్రజలు తాము ఎదుర్కొంటున్న కాలుష్యం మీద కాలుష్య నియంత్రణ మండలికి నివేదిస్తే, కాలుష్యం నిగ్గు తేల్చే పని ఆ సిబ్బంది మీద ఉంటుంది. దాని వలన ఫలితం ఉందా అంటే కొంతమేరకు ఉందనే చెప్పాలి. కాకపోతే, ఏవో రెండు పరీక్షలు చేసి ప్రజలను మభ్యపెట్టే ప్రయోగశాల నివేదికలు తయారుచేసి ఇవ్వడం కూడా జరుగుతోంది. కాలుష్యం లేదు, లేదా చెప్పుకోదగినంత లేదు అని ఈ నివేదికలు ‘ముడుపుల అనంతరం వస్తాయి. అయితే, అవినీతి అందరూ చేయరనేది కూడా వాస్తవం.
ప్రజల ఒత్తిడి పెరగాలి
ప్రజలు కాలుష్య నియంత్రణ మండలి మీద ఒత్తిడి పెట్టి తమ సమస్య గురించి లోతైన పరిశోధనకు మండలి ద్వారా పూనుకోవాలి. 1989లో పటాన్చెరు ప్రజలు కష్టపడి ఆందోళనచేసి, కోర్టుకెళ్ళి ఒత్తిడి చేస్తే, అప్పుడు కొన్ని కంపెనీలు మూసివేశారు. కాలుష్యం శుద్ధి కేంద్రం ఏర్పాటుకు సమయం కోరి మళ్లీ తెరిపించుకున్నారు. శుద్ధి చేయడం లేదు అని కోర్టుకు వెళితే కాలుష్య నియంత్రణ మండలి నివేదిక అడిగింది. ఆ తప్పుల తడక నివేదిక ఆధారంగా కోర్టులు మళ్లీ కొంత సమయం ఇవ్వడం జరిగింది. ‘మూసివేత’ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రజలే ఒత్తిడి చేస్తేగాని పని కాదు.
ఎక్కడపడితే అక్కడ వ్యర్థ జలాలు
ఉమ్మడి కాలుష్య శుద్ధి కేంద్రం తెర మీదికి తెచ్చారు. కంపెనీ పెట్టేటప్పుడు మా ఉత్పత్తులు వేరు అని చెప్పేవారు, వ్యర్థ జలాలు మాత్రం ఉమ్మడిగా శుద్ధి చేస్తామని అశాస్త్రీయ ప్రతిపాదన పెడితే అప్పటి అధికారులు ఆమోదించారు. అభ్యంతరం తీవ్రస్థాయిలో చేస్తే ప్రతి పరిశ్రమ శుద్ధి చేసిన వ్యర్థ జలాలే పంపించాలి అని నిబంధన వచ్చింది. ఆ నిబంధన అమలులో అనేక లోపాలున్నాయి. పరిశ్రమలు మొత్తం వ్యర్థ జలాలు ట్యాంకర్లలో పంపవు. పంపిన ట్యాంకర్లు అన్నీ కూడా ఈ కేంద్రానికి చేరవు. దీనికి విరుగుడు అక్కడొక పుస్తకం, ఇక్కడొక పుస్తకం పెట్టారు. అవినీతి వల్ల ఆ పుస్తకాలలో వివరాలు కూడా తారుమారు చేస్తారు. వ్యర్థ జలాలు ఎక్కడపడితే అక్కడ పారబోయడానికి ఆస్కారం ఏర్పడింది.
కాలుష్య పరిశ్రమలే అభివృద్ధా?
ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తరువాత కాలుష్యం మీద ప్రభుత్వం ఏనాడూ సమీక్షించలేదు. పరిశ్రమల కాలుష్యం ఉన్నట్టే పాలకులు భావించడం లేదు. దాని ఊసే ఎత్తరు. పరిశ్రమల అభివృద్ధి, తెలంగాణను ఫార్మా హబ్ చేస్తామని ప్రకటించే ప్రజా ప్రతినిధులు తెలంగాణ ప్రజల మీద ఫార్మా కాలుష్యం గురించి కనీసం ప్రస్తావించరు. కాలుష్య పరిశ్రమలే అభివృద్ధి అనే భావనను పాలకులు వీడాలి.
మభ్యపెట్టే మాటలు
పటాన్చెరు ఉమ్మడి శుద్ధి కేంద్రం నుంచి ఒక పైపులైన్ ద్వారా వ్యర్థ జలాలు హైదరాబాద్‌లో మూసీ నదిలో ఉన్న అంబర్‌పేట జలశుద్ధి కేంద్రానికి తరలించే ఏర్పాటు చేశారు. మంజీరా నదిలో కలిసే వ్యర్థ జలాలను మూసీ నదిలోకి తీసుకువచ్చి నదీ జలాల అనుసంధానం అప్పుడే సాధించారు. కాకపోతే, ఇది వ్యర్థ జలాల అనుసంధానం. వేల కోట్ల వ్యర్థ జలాలను పరిశ్రమలోనే ఆవిరి చేసి, మిగిలిన ఘన వ్యర్థాలను జిన్నారం దగ్గర ఉన్న ఘన వ్యర్థాల శ్మశానానికి (burial ground) పంపి, పాతిపెట్టి, కాలుష్యం అరికట్టాం, అంతం చేశామని మభ్యపెట్టే మాటలు ఇప్పటికీ నడుస్తున్నాయి. వీటన్నింటి మధ్యలో వాయు కాలుష్యం, ఘన వ్యర్థాల కాలుష్యం మరుగున పడిపోయింది.
పారిశ్రామిక వ్యర్థాలు ఎక్కడికి పోతున్నాయి?
తెలంగాణలో ఉత్పన్నమవుతున్న ప్రమాదకర పారిశ్రామిక ఘన వ్యర్థాలు ఎక్కడికి పోతున్నాయి? 2018లో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 42 ఘన వ్యర్థాల నిలువ ప్రదేశాలు (TSDF) ఉంటే తెలంగాణలో ఒక్కటే ఉంది. ఇక్కడ రాష్ట్రవ్యాప్త పారిశ్రామిక ఘన వ్యర్థాలు పాతిపెడతారు. లేదా కాలపెడతారు. దశాబ్దాలుగా వేల టన్నుల ఘన వ్యర్థాలు ఒకే చోట పాతిపెడుతున్నామని చెబుతున్నారు. ఇన్ని ఏండ్లలో లక్షల టన్నులు అయ్యి ఉండవచ్చు. దిండిగల్ గ్రామ పరిధిలో ఉన్న ఘన వ్యర్థాల పాతర కేవలం 200 ఎకరాలు ఉన్నది. వేల టన్నుల ఘన వ్యర్థాలు ఇక్కడ నిక్షిప్తం చేస్తున్నారు.
- డా. దొంతి నరసింహారెడ్డి