ఇథనాల్​ పరిశ్రమలపై..ప్రజల్లో కాలుష్య భయాలు

ఇథనాల్​ పరిశ్రమలపై..ప్రజల్లో కాలుష్య భయాలు

ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా అభివృద్ధి సాధించాలంటే దానికి ఆర్థికంగా బలమైన ఊతాన్ని ఇచ్చేవి  పరిశ్రమలు. వాటి వల్ల దేశ ఎకానమీ ఎంతగానో అభివృద్ధి చెందుతుంది. పరిశ్రమలు ఏర్పాటైన ప్రాంతాల్లోని యువతకి ఉపాధి కూడా లభిస్తుంది.అక్కడ రవాణా సౌకర్యాలు మెరుగుపడి ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి.ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే.ఆర్థికంగా ఎంత లాభం ఉన్నా  మరోవైపు పర్యావరణపరంగా, సామాజికపరంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో భారతదేశ వ్యాప్తంగా ఇథనాల్ ప్రాముఖ్యత అనేది పెరిగింది. మనం ప్రస్తుత రోజుల్లో ప్రముఖంగా వాహనాల్లో పెట్రోల్ డీజిల్​ను ఇంధనంగా ఉపయోగిస్తున్నాము. అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచన ప్రకారం. విదేశాల నుంచి పెట్రోల్ దిగుమతుల్ని తగ్గించుకోవడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని పొదుపు చేసుకోవడానికి పెట్రోల్​ను ఇథనాల్​తో బ్లెండ్ చేయడం వల్ల ఇంధనానికి అయ్యే ఖర్చును తగ్గించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తుంది. దీనివల్ల ఇంధనం తక్కువ ధరకు లభ్యం అవడమే కాకుండా వాటి వల్ల వచ్చే కర్బన ఉద్గారాల శాతం కూడా తక్కువగా ఉంటుంది. దీనికోసం 2025 నాటికి ఈ 20 అనే థీమ్ తో 20% ఇథనాల్ని పెట్రోల్ తో కలిపి వాడుకోవాలని భావిస్తుంది.

ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమైంది కూడా. ఇది ఎంతో ఉపయోగకారి అయినప్పటికీ, దీన్ని తయారు చేసే ప్రక్రియలో మాత్రం ఫ్యాక్టరీల నుంచి వెలువడే ఉద్గారాలు పర్యావరణానికి ఎంతో హానిగా మారుతున్నాయని  ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసే ప్రదేశాల్లో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉద్గారాలు వెలువడడం నిజమా కాదా అని ప్రభుత్వం శాస్త్రీయంగా పరిశోధన చేయించి, ప్రజలకు వివరించి చెప్పాలి. 

నిర్మల్ జిల్లా రైతుల ఆందోళనలు

నిర్మల్ జిల్లా దిలావార్ పూర్ మండలం, గుండంల్లి గ్రామాల మద్య నాలుగు లక్షల లీటర్ల ఉత్పత్తి కెపాసిటీ గల ఇథనాల్ ఫ్యాక్టరీని నిర్మించాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి  అక్కడి రైతులుచుట్టుపక్కల గ్రామ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ఈ ఆందోళలు తీవ్ర రూపం దాల్చి హింస చెలరేగింది. ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి 2023 ఫిబ్రవరి నెలలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దీనికి ఏప్రిల్, మే నెలల మధ్య  ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా లభించాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా టీఎస్ ఐపాస్ ద్వారా జులై నెలలో దీనికి అనుమతులు  ఇచ్చింది.

ఫ్యాక్టరీ ప్రతినిధులు గ్రామ పంచాయతీకి ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే రైతుల నుంచి దాదాపు 40 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసి ఫ్యాక్టరీ నిర్మాణం ప్రారంభించారు.ఈ ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరిగితే ఫ్యాక్టరీ చుట్టుపక్కల రైతులు తమ పంటపొలాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీల నుంచి, విడుదలయ్యే కలుషిత వాయువులు, నీరు వల్ల తమ జీవితాలు ఆగం అవుతాయని చుట్టు పక్కల  పది గ్రామాల ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

రైతుల ఆవేదన ఏమిటి? 

ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తున్న ప్రాంతానికి దగ్గర్లోనే ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రవహిస్తుంది. ఫ్యాక్టరీ యాజమాన్యం వారు మూడున్నర కిలోమీటర్ల దూరంలో ఎస్సార్ఎస్పీ కెనాల్ ఉందని చెబుతున్నారు. కానీ, వాస్తవానికి కేవలం ఒకటిన్నర కిలోమీటర్లలోపే ఉంది. ఈ ఫ్యాక్టరీని 4 లక్షల లీటర్ల ఇథనాల్ తయారీ కెపాసిటీతో నిర్మించ తలపెట్టారు. కానీ, ఉత్పత్తి సామర్థ్యం ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని రైతులు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఫ్యాక్టరీలో ఇథనాల్ ఉత్పత్తి కావాలంటే భారీగా  నీరు అవసరం అవుతుంది. ఇథనాల్ తయారీపోనూ మిగిలిన నీరు అంతా వ్యర్థంగా మారుతుంది. ఈ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతం నుంచి పక్కనే ఒక కాల్వ ఉంటుంది.ఈ కాల్వ డైరక్టుగా  వెళ్లి ఎస్సార్​ఎస్పీలో కలుస్తుంది.

ఈ కాల్వ ద్వారానే కలుషిత నీటిని ఎస్సార్ఎస్పీలో కలుపుతారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఒక వేళ ఎస్సార్ఎస్పీ లో వ్యర్థ నీరు కలిస్తే 16 లక్షల ఎకరాలకు నీటిని అందిచే  శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీరు కలుషితం అవుతుంది. దాంట్లోని చేపలు చనిపోతాయి. ఇంకా మరెన్నో ఘోరాలు జరిగే అవకావశం లేకపోలేదు. కాళేశ్వరం-27 ప్యాకేజీ కింద నిర్మల్ నియోజకవర్గానికి 50 వేల ఎకరాలకు సాగు నీరు అందించేందుకు ప్రతిపాదనలు సిద్దంచేస్తున్నారు. ఈ ప్యాకేజీ నీరు రైతులకు నీరు అందించే ముసుగులో ఆ నీటిని ఫ్యాక్టరీ అవసరాలకు మళ్లిస్తారనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

ఫ్యాక్టరీ యాజమాన్యం ఏమంటుంది?

ఫ్యాక్టరీ యాజమాన్యం మాత్రం ఫ్యాక్టరీ నుంచి జీరో డిశ్చార్జి ఉంటుందని, కలుషిత నీటిని ఎస్సార్​ఎస్పీలో కలవనీయం అని చెబుతున్నారు. ఒకవేళ ఏమైనా కొంచెం వ్యర్థ నీరు మిగిలినా దాన్ని భూగర్బంలోకి ఇంకింపజేస్తామని అంటున్నారు. కానీ ఇలా చేయడం వల్ల భూగర్బ జలాలు నాశనం అయి తమ పంటల దిగుబడి తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు చుట్టుపక్కల రైతులు. అంతేకాక చుట్టు పక్కల గ్రామాల త్రాగు నీరు పొల్యూట్ అవుతుందని వారి ఆరోపణ. కొద్ది రోజుల ముందే చుట్టుపక్కల గ్రామ ప్రజలు, రైతులు గతంలో నారయణపేట జిల్లా మరికల్ మండలం

చిత్తనూరు గ్రామంలో నాలుగు బాయిలర్లతో ఏర్పాటు చేసిన ఇథనాల్ పరిశ్రమను సందర్శించారు.అ క్కడ ప్రస్తుతం కేవలం ఒక బాయిలర్ మాత్రమే ఇథనాల్ ఉత్పత్తి చేస్తుంది. అక్కడ ఫ్యాక్టరీ నుంచి వెలుబడే కాలుష్య ప్రభావం దాదాపు 10 నుంచి 15 కిలోమీటర్ల వరకు ఉన్న గ్రామాలను ప్రభావితం చేస్తుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తీవ్రంగా ఉద్యమం

దిలావార్ పూర్, గుండంపల్లి గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. మండల బంద్​కు పిలుపునిచ్చారు  సంబంధించిన సుమారు పదివేల మంది ప్రజలు స్వచ్ఛందంగా ధర్నా, వంటా వార్పు కార్యక్రమం చేపట్టారు.ఈ ఆందోళన సమయంలో మొన్న జరిగిన హింస లో 60 మంది రైతులపై హత్యాయత్నం కేసులు  పోలీసులు నమోదు చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేదాకా ఆందోళనలు సాగిస్తామంటున్నారు రైతులు.

కాలుష్య ప్రమాదమే ఉంటే, అలాంటి పరిశ్రమలను జనావాసాలకు దూరంగా తరలించాలి. ప్రజల్లో ఉన్న భయాలను తొలగించాలంటే, ఇథనాల్​ పరిశ్రమల వల్ల నిజంగానే కాలుష్యం ఏర్పడుతుందా లేదా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

- నేరడిగొండ సచిన్, ఉస్మానియా యూనివర్సిటీ