- సంగారెడ్డిలో ప్రమాదకరంగా మారుతున్న ఫ్యాక్టరీ వ్యర్థాలు
- చెరువులు, కుంటల్లో జల కాలుష్యం
- చనిపోతున్న చేపలు, మూగజీవాలు
- వ్యవసాయ భూముల్లోకి ఫ్యాక్టరీ వ్యర్థ జలాలు
- నిబంధనలు పట్టించుకోని ఫ్యాక్టరీలపై నో యాక్షన్
సంగారెడ్డి/జిన్నారం, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో ఫ్యాక్టరీల నుంచి కాలుష్యం పెరుగుతోంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు పరిశ్రమల పరిసరాల్లో వ్యర్థ జలాలు పారుతున్నాయి. చెరువులు, కుంటల్లోకి కెమికల్ వాటర్ వచ్చి చేరడం వల్ల నీరు కలుషితమై మూగ జీవాలకు ప్రాణాంతకంగా మారుతోంది. వ్యవసాయ భూములు, తాగు నీరు, పశుగ్రాసం కాలుష్య కాసారాల బారిన పడడంతో ప్రమాదం పెరుగుతోంది.
పెరుగుతున్న కాలుష్యం..
హైదరాబాద్ శివారులో పటాన్ చెరు, జిన్నారం, బొంతపల్లి, కాజిపల్లి, ఐడీఏ బొల్లారం, గడ్డపోతారం, గుమ్మడిదల, బండ్లగూడ, హత్నూర, ఇస్నాపూర్, ముత్తంగి, పాశమైలారం ప్రాంతాల్లోని ఇండస్ట్రియల్ ఏరియాల్లో జల కాలుష్యం ముప్పుగా మారుతోంది. ఈ ఏరియాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, చెరువుల్లో చేపల పెంపకం వంటి ప్రధాన ఉపాధి మార్గాలు దెబ్బ తింటున్నాయి.
ఫ్యాక్టరీల నుంచి వెలువడుతున్న కాలుష్య వ్యర్థాలు చెరువులకు, మూగజీవాలకు హాని చేస్తున్నాయి. కెమికల్స్ కలిసిన వ్యర్థాలు చెరువుల్లోకి, కుంటల్లోకి వచ్చి చేరుతుండడంతో ఆ నీటిని తాగిన మూగజీవాలు మృత్యువాత పడుతున్నాయి. దెబ్బ తింటున్న ఉపాధిఇండస్ట్రియల్ ఏరియా ప్రాంతంలోని ప్రజలు శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ప్రజలు ఏదో ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. కొందరైతే ఊరును విడిచిపెట్టి పట్టణాలకు వెళ్లిపోయారు.
ఇటీవల కురిసిన కొద్దిపాటి వర్షాలకే ప్యాక్టరీ వ్యర్థాలు చెరువులు, కుంటల్లో కలిసిపోయాయి. ఇదే పరిస్థితి దశాబ్ద కాలంగా ఉండటంతో.. ఇక్కడి పంటల సాగు గణనీయంగా తగ్గింది. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ సాగు 7.30 లక్షలకు పైగా జరుగుతుండగా, పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంత సమీపంలో 30 వేల ఎకరాలు కూడా దాటడం లేదు. గతంలో ఇక్కడ లక్ష పైచిలుకు ఎకరాల్లో సాగు జరిగేదని వ్యవసాయ అధికారుల లెక్కలు ఉన్నాయి.
కాలుష్యం వల్ల సారం కోల్పోయి ఆ భూములు సాగుకు పనికి రావడం లేదని రైతులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికే చాలామంది రైతులు వ్యవసాయం విడిచి ఇతర పనులు చూసుకుంటున్నారు. చేపల పెంపకం కూడా తగ్గిపోయింది. ప్రతి ఏడాది పొల్యూషన్ వల్ల చెరువుల్లో చేపలు చనిపోతున్నాయి. దీంతోమత్స్యకారుల ఉపాధికి తీవ్ర నష్టం ఏర్పడుతోంది. కనీసం వాన కాలంలోనైనా పంటలు పండిద్దామంటే ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థ జలాలు పొలాలను చుట్టేస్తున్నాయి.
నిబంధనలు ఇలా...
పరిశ్రమల యాజమాన్యాలు రూల్స్ పాటించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీల ఉత్పత్తుల వివరాలు, వ్యర్థాలను పీసీబీ అధికారులు గుర్తించాల్సి ఉంది. ఆ వ్యర్థాలను శుద్ధి కేంద్రాలకు తరలించాలి. ఈటీపీలో ప్రతి ఫ్యాక్టరీ సభ్యత్వం ఉందా లేదా అనేది పర్యవేక్షించాల్సి ఉంటుంది. వర్షపు నీటిని ప్రతి ఫ్యాక్టరీ భారీ సంపులు ఏర్పాటు చేసి నిల్వ చేసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు, హరిత న్యాయస్థానం సూచించాయి.
వానలు పడేటప్పుడు రసాయన వ్యర్థాలను నీటిలో వదలమని ఫ్యాక్టరీ యాజమాన్యాలు పీసీబీకి లిఖితపూర్వకంగా హామీ పత్రం రాసి ఇవ్వాలి. అవుట్ లేట్ల మూసివేత తోపాటు పీసీబీ నిరంతర నిఘా పెట్టాల్సి ఉంది. కానీ ఈ నిబంధనలు ఫ్యాక్టరీ యాజమాన్యాలు పాటించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. పీసీబీ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బతుకులు ఆగమవుతున్నాయని కూడా అంటున్నారు. జల కాలుష్య సమస్య ఉన్న చోట్ల స్పెషల్ ఆఫీసర్లు ఉండాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఉపాధి పోతోంది..
ఇండస్ట్రియల్ ఏరియాలో మత్స్య పరిశ్రమ పూర్తిగా పడిపోయింది. పరిశ్రమల నుంచి వ్యర్థ జలాలు చెరువుల్లోకి వదలడం వల్ల చేపలు చనిపోతున్నాయి. అధికారులకు ఫిర్యాదు చేసినా సమస్య తీరలేదు. మత్స్యకారుల ఉపాధిని దృష్టిలో పెట్టుకొని అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. లేకపోతే మత్స్యకారులు కూడా కనుమరుగయ్యే ప్రమాదముంది. ఇప్పటికైనా స్పెషల్ ఆఫీసర్లను నియమించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.- నారబోయిన శ్రీనివాస్, మత్స్యకార సంఘం నేత, గడ్డపోతారం, జిన్నారం.