ముంచుకొస్తున్న ముప్పు.. హీట్ వేవ్స్, పొల్యూషన్​తో.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం

ముంచుకొస్తున్న ముప్పు.. హీట్ వేవ్స్, పొల్యూషన్​తో.. పిల్లల ఆరోగ్యంపై ప్రభావం
  • యునిసెఫ్ చిల్డ్ర న్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ విడుదల  
  • 163 దేశాల్లో 26వ ప్లేస్​లో భారత్ 
  • ప్రపంచవ్యాప్తంగా 17 కోట్లు.. మన దేశంలో 5 కోట్ల మంది పిల్లలపై పొల్యూషన్ ప్రభావం

న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా హీట్ వేవ్స్, ఎయిర్ పొల్యూషన్ వల్ల పిల్లల ఆరోగ్యం, చదువులపై తీవ్ర ప్రభావం పడుతోందని యునైటెడ్ నేషన్స్ చిల్డ్ర న్స్ ఫండ్ (యునిసెఫ్) ఆందోళన వ్యక్తం చేసింది. భారత్​లో గత ఏడాది ఏకంగా 5.48 కోట్ల మంది పిల్లలపై ఈ రెండు అంశాలు పెను ప్రభావం చూపాయని వెల్లడించింది. 

ప్రపంచవ్యాప్తంగా చూస్తే గత ఏడాది17.10 కోట్ల మంది స్టూడెంట్లపై ప్రభావం పడిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల ఆరోగ్యం, చదువులపై హీట్ వేవ్స్, ఎయిర్ పొల్యూషన్, ప్రకృతి విపత్తుల ప్రభావాన్ని అధ్యయనం చేసిన ఈ సంస్థ  తాజాగా 2024 ఏడాదికిగాను ‘యునిసెఫ్ చిల్డ్రన్స్ క్లైమేట్ రిస్క్ ఇండెక్స్’ నివేదికను విడుదల చేసింది. ఇందులో 163 దేశాలకు గాను భారత్ 26వ స్థానంలో ఉన్నట్టు పేర్కొంది. 

ప్రధానంగా భారత్​లో పిల్లలు పర్యావరణ ప్రతికూలతల వల్ల అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని నివేదిక తెలిపింది. అనారోగ్యం, స్కూలుకు గైర్హాజరు పెరగడంతో ఓవరాల్​గా చదువులో మెరుగైన ఫలితాలు రావడంలేదని పేర్కొంది. వీటికి తోడు వరదలు, కొండచరియలు విరిగిపడటం, సైక్లోన్ల వంటి విపత్తులు కూడా పిల్లల ఆరోగ్యం, చదువులపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయని వెల్లడించింది. 

ALSO READ | ధర్మం అంటే ఇదేనా : 27 ముస్లిం హోటల్స్ లైసెన్స్ రద్దు చేసిన గుజరాత్ ఆర్టీసీ

వీటివల్ల పిల్లల శారీరక ఆరోగ్యం దెబ్బతింటోందని, అలాగే తరచూ స్కూళ్లు మూతపడుతూ చదువులూ సరిగ్గా సాగడంలేదని వివరించింది. అందుకే పిల్లలకు క్లైమేట్ చేంజ్, ప్రకృతి విపత్తులపై అవగాహన కల్పించి, వారిని సవాళ్లను ఎదుర్కొనేలా రెడీ చేయడంపై తాము దృష్టి పెట్టామని యునిసెఫ్ తెలిపింది. 

ఇందులో భాగంగా స్కూల్ ఎడ్యుకేషన్ లో క్లైమేట్ చేంజ్ అంశంపై పాఠాలను చేర్చేందుకు భారత ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని పేర్కొంది. ఈ ప్రయత్నాల వల్ల ఇప్పటికే నేషనల్ కరికులం ఫ్రేంవర్క్ లో క్లైమేట్ చేంజ్ ఎడ్యుకేషన్ వంటి అంశాలను చేర్చినట్టు వివరించింది. అలాగే ప్రభుత్వ సహకారంతో 12 రాష్ట్రాల్లో స్కూల్ సేఫ్టీ ప్రోగ్రాంలను కూడా నిర్వహిస్తున్నట్టు తెలిపింది.