హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సిటీలో రెండు రోజుల క్రితం గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ఇండస్ట్రియల్ ఏరియాలతో పాటు పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)150కి మించి నమోదైంది. అయితే, ఆదివారం మాత్రం మళ్లీ మామూలు స్థితికి వచ్చింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విడుదల చేసిన నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వివరాల ప్రకారం సనత్‌నగర్, సోమాజిగూడ, ఇక్రిసాట్, ఐడీఏ పాశమైలారం వంటి ప్రాంతాల్లో శుక్రవారం ఏక్యూఐ150 నుంచి 198 మధ్య నమోదైంది.
అత్యధికంగా సోమాజిగూడలో పీఎం 2.5 స్థాయిలు 198గా ఉండగా.. ఏక్యూఐ కూడా అదే స్థాయిలో రికార్డయింది. పటాన్‌చెరులోని ఇక్రిసాట్ వద్ద పీఎం 2.5 కాలుష్య కారకాల స్థాయి186.. ఏక్యూఐ 167గా నమోదయ్యాయి. సనత్ నగర్లో 168గా పీఎం 2.5 స్థాయిలు రికార్డు కాగా.. ఏక్యూఐ 123గా ఉంది. ఐడీఏ పాశమైలారంలో పీఎం 2.5 స్థాయిలు 178.. ఏక్యూఐ164, మలక్‌పేటలో పీఎం 2.5 స్థాయిలు 118.. ఏక్యూఐ104, ఐఐటీ కందిలో 96 చొప్పున ఏక్యూఐ స్థాయిలు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పీఎం (కాలుష్య కారకాలు) 2.5 స్థాయిలు అదే తీవ్రతతో నమోదవడం గమనార్హం.
అయితే, సంక్రాంతి పండుగ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం నుంచే సిటీ జనాలు పెద్ద ఎత్తున సొంతూర్లకు బయలుదేరారు. వేలాది కార్లు రోడ్లపైకి రావడంతో పలు ప్రాంతాల్లో కాలుష్య స్థాయిలు బాగా పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. ఇక, సిటీ జనాలు శుక్ర, శనివారాల్లో సొంతూర్లకు తరలివెళ్లడంతో ఆదివారం నగరంలో కాలుష్యం కాస్త తగ్గింది.
ఇక్రిశాట్లో పీఎం 2.5 స్థాయిలు గరిష్ఠంగా 183 మైక్రోగ్రాముల మేర.. ఏక్యూఐ 138గా రికార్డయింది. ఐడీఏ పాశమైలారంలో పీఎం 2.5 స్థాయిలు 187గా ఉండగా.. ఏక్యూఐ 134గా నమోదైంది. బొల్లారంలో 113, సెంట్రల్ వర్సిటీ వద్ద 94, సోమాజిగూడలో 75, సనత్‌నగర్‌లో 73, రామచంద్రాపురంలో 86, ఈసీఐఎల్‌లో 88 ఏక్యూఐ రికార్డ్ అయినట్టు సీపీసీబీ వెల్లడించింది. మరో నాలుగు రోజులు సెలవులు ఉండడంతో కాలుష్యం మరింత తగ్గవచ్చని తెలిపింది.