పొల్యూషన్.. పరేషాన్ చేస్తోంది

ఇటీవలి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు, రానున్న ముప్పులను హైదరాబాద్ ప్రజలకు గుర్తుచేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కాలుష్యం వల్ల వాతావరణంలో, వర్షపాతంలో అనూహ్య పరిణామాలు ఉంటాయని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు. గాలి కాలుష్యం మనుషుల జీవన విధానం వల్ల, మన చర్యల వల్ల పెరుగుతున్నది. పట్టణ ప్రాంతాల్లో, అందులోనూ అతి పెద్ద నగరాల్లో వాతావరణ కాలుష్యం అంతకంతకూ పెరిగిపోతోంది. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల కొన్ని వారాలు కాలుష్యం తగ్గినా, అది ఇప్పుడు ఇదివరకటి కంటే ఎక్కువైపోయింది.

హైదరాబాద్ లో ఒకప్పుడు ఇండస్ట్రియల్​ ఏరియాలకే పరిమితమైన కాలుష్యం, ఇప్పుడు నగరం అంతటా పాకిపోయింది. గాలి, నీరు, భూమి, భూగర్భ జలాలు కాలుష్యమయం అవుతున్నాయి. ఒక సైంటిఫిక్​ సొల్యూషన్​తో కాలుష్యం సమస్య మొత్తం పరిష్కారం అవుతుందనే భ్రమను రాజకీయ నాయకులు, అధికారులు కల్పిస్తున్నారు. సిటీలో ధ్వని, నీరు, భూమి కాలుష్యంతోపాటు వాయు కాలుష్యం పెరుగుతున్నది. భూమి ఉష్ణోగ్రత పెరగడానికి గల కారణాల్లో వాయు కాలుష్యం పాత్రే ఎక్కువ. అయినా, దాని పట్ల శ్రద్ధ కనిపించడం లేదు. కొద్ది రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ లో వాయు కాలుష్యం తగ్గించడానికి రూ.117 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులు, ఇంతకు మునుపు ఇచ్చిన నిధులను వాయు కాలుష్యం ఎంత ఉందో చెప్పే వాటిపై ఖర్చు పెట్టారు తప్పితే, కాలుష్యాన్ని తగ్గించే చర్యలు, ఆలోచనలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదు.

రవాణా రంగం పాత్రే ఎక్కువ

గాలిలో విష వాయువులు పెరగటానికి రవాణా రంగానిదే ఎక్కువ పాత్ర. పొగ గొట్టం నుంచే కాక, వాహనం నడిపేటప్పుడు వివిధ భాగాల రాపిడికి సూక్ష్మ కణాలు, దుమ్ము, ధూళి పెరుగుతున్నది. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్​లో వ్యక్తిగత వాహనాల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 2005లో ప్రతి వేయి మందికి 278.01 వాహనాలు ఉన్నాయి. 2016కు వచ్చే సరికి వాహనాల సంఖ్య 660.85కు చేరినట్లుగా ఎన్విరాన్‌మెంటల్‌ ప్రొటెక్షన్‌ అండ్‌ ట్రైనింగ్‌ రీసెర్చ్‌ ఇన్​స్టిట్యూట్‌(ఈపీటీఆర్‌ఐ) తేల్చింది. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 2014 మార్చి నాటికి 21.75 లక్షల వాహనాలుండగా.. 2018 మార్చి నాటికి అది 29.09 లక్షలకు చేరుకుంది. ఇందులో ద్విచక్ర వాహనాలే ఎక్కువ. 2014లో 15.89 లక్షల ద్విచక్ర వాహనాలు ఉండగా, 2018 నాటికి అవి 21.35 లక్షలకు చేరుకున్నాయి. ఇక గ్రేటర్‌వ్యాప్తంగా తీసుకుంటే అధికారిక లెక్కల ప్రకారమే వాహనాల సంఖ్య 50 లక్షల మార్కును దాటింది. ఇతర జిల్లాలకు చెందిన వాహనాలతో కలుపుకుంటే ఆ సంఖ్య 60 లక్షల నుంచి 70 లక్షల వరకు ఉంటుందని అంచనా.

సామాజిక, ఆర్థిక వ్యవస్థలపై ప్రభావం

పెద్ద నగరాల్లో సూక్ష్మ ధూళి కణాల శాతం వేగంగా పెరిగిపోతోంది. పీఎం 10, పీఎం 2.5 అతి సూక్ష్మ ధూళి కణాలు చాలా ప్రమాదకరమైనవి. హైదరాబాద్​లో వాహనాల సంఖ్య పెరగడంతో కొన్ని ప్రాంతాల్లో రద్దీతో పాటు గాలి కాలుష్యం కూడా పెరుగుతున్నది. ధూళి కణాలు పరిమితికి మించి నమోదవుతున్నాయి. కార్బన్‌ డయాక్సైడ్‌, మిథేన్‌, ఓజోన్‌, క్లోరో ఫ్లోరో కార్బన్లు తదితరాలు ఉండే హరిత వాయువుల విషయానికొస్తే, మొత్తం పరిమాణంలో 57 శాతం వాహనాల నుంచే వెలువడుతోంది. కార్బన్‌ మోనాక్సైడ్‌, నైట్రోజన్‌ ఆక్సైడ్​ తదితర కాలుష్య ఉద్గారాల తీవ్రత గతంతో పోలిస్తే పెరిగింది. 2025 నాటికి నగరంలో వాహన రద్దీ ఇప్పుడున్న దాని కంటే 69 శాతం పెరుగుతుందని సీపీసీబీ అధ్యయనంలో తేల్చింది. వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్యం అనారోగ్య పరిస్థితులే కాకుండా సామాజిక, ఆర్థిక వ్యవస్థల మీద దుష్ప్రభావం చూపుతుంది. పర్యావరణంలో విపరీత పరిణామాలకు దారి తీస్తున్నది. కాలుష్యాన్ని ఇముడ్చుకునే శక్తి(carrying capacity) ప్రకృతిలో తగ్గిపోతున్నది. అటువంటి శక్తి తగ్గిన కొద్దీ, మున్ముందు ఒక అగ్గిపుల్ల కాల్చినా కాలుష్య భారం తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఇప్పటికే, పక్షులు ఇతర జీవాలు ప్రమాదంలో పడ్డాయి. కొన్ని జాతులు అంతరించిపోయాయి. మానవాళి అనారోగ్యం పాలవుతున్నది. చిన్న పిల్లలకు కూడా అంతుపట్టని వ్యాధులు సంక్రమిస్తున్నాయి. రోగ నిరోధక శక్తి తగ్గిపోతున్నది.

రోడ్ల విస్తరణ సరికాదు..

దేశానికే ఆదర్శంగా ఉన్న ఆర్‌టీసీ బస్సు వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నాశనం చేస్తూ, ప్రజా రవాణా వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నది. రహదారుల వెడల్పు, ఫ్లై ఓవర్ల నిర్మాణం పరిష్కారంగా భావిస్తూ, వేల కోట్లు అప్పు తెచ్చి ఎస్‌ఆర్‌డీపీ పేరు మీద పెట్టుబడి పెడుతున్నది. రోడ్ల వెడల్పు తాత్కాలిక ఉపశమనం కల్పించవచ్చు కానీ, దీర్ఘకాలంలో మంచిది కాదని గత అనుభవాలు చెబుతున్నాయి. ధనికులకు, కార్లు ఉన్నవాళ్లకు ఉపయోగపడేలా పెట్టుబడులు పెట్టడం వినాశనానికి దారితీస్తుంది. అక్కరకు రాని నిర్మాణాల వల్ల అప్పులపాలవుతాం.

పెట్రో ఉత్పత్తుల వాడకం తగ్గాలి
రవాణా రంగం నుంచి వచ్చే కాలుష్యం తగ్గాలంటే వాహనాల ఇంధనంలో మార్పులు తీసుకురావాలి. డీజిల్, పెట్రోల్ కంటే విద్యుత్ వాహనాలు, ఇతర ఇంధనాల వినియోగం పెరగాలి. బొగ్గు, డీజిల్, పెట్రోల్, ఇతర ఇంధనాల వాడకాన్ని ఏ యేటికాయేడు తగ్గిం చుకునే లక్ష్యాలు పెట్టుకోవాలి. థర్మల్ విద్యుత్ కేంద్రాలను వెంటనే మూసేయాలి. వాహనాల వాడకం తగ్గిం చాలి. కొత్త వాహనాలు రోడ్ల మీదకు రాకుం డా ‘సామూహిక’రవాణా వ్యవస్థలకు శ్రీకారం చుట్టాలి. ప్రజలు కూడా తమ జీవన శైలిలో మార్పులు తీసుకురావాలి. హైదరాబాద్ లో మెట్రో రైలు కాలుష్య కారక వాహనాలను తగ్గిస్తుందని ఆశించినా, దాని నిర్మాణ పద్ధతి, ఖర్చు, ఇతర అంశాల వల్ల అది ఎవరికీ ఉపయోగపడని వ్యవస్థగా మారింది. టికెట్ ధర వల్ల డబ్బున్న వాళ్లే అందులో ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. సొంత వాహనం ఉన్నవాళ్లు మెట్రోలో వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. పేదలకు మెట్రోను వాడుకునే కొనుగోలు శక్తి లేదు. ఫలితంగా, రూ.15,000 కోట్ల పెట్టుబడి ఉపయోగం లేకపోగా, ప్రధాన మార్గాల్లో మెట్రో నిర్మాణం వల్ల ట్రాఫిక్ సమస్య, కాలుష్యం పెరుగుతున్నది.
ఎలక్ట్రిక్ వెహికల్స్ పెరగాలి
విద్యుత్ వాహనాలు ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చాయి. వీటి వలన స్థానిక వాతావరణంలో కాలుష్యం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ఈ వాహనాలతో ధ్వని
కాలుష్యం కూడా తగ్గుతుం ది. అయితే విద్యుత్ వాహనాల ధర ఎక్కువ. విద్యుత్ వాహనాలకు కావల్సిన చార్జింగ్ స్టేషన్లు లేకపోవడం ప్రధాన సమస్యలు. పెట్రోల్
పంపుల మాదిరిగా చార్జింగ్ స్టేషన్లు కూడా ఎక్కువగా ఉంటే విద్యుత్ వాహనాలకు ఉపయోగం. ఎంఎంటీఎస్ వ్యవస్థను విస్తరిస్తే తక్కువ ఖర్చుతో నగర ప్రజలకు
మంచి రవాణా సౌకర్యం కలుగుతుం ది. రైలు, బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు, రిక్షాలు, సైకిల్ వ్యవస్థలు మనగలిగేలా రహదారుల ప్రణాళిక ఉండాలి. నగర అభి-
వృద్ధి ప్రణాళికలో వీటిని భాగం చేయాలి. నడకను, పాదచారులను ప్రోత్సహించాలంటే మౌలిక వసతుల డిజైన్ లో మార్పులు రావాలి. -దొంతి నరసింహారెడ్డి, పర్యావరణవేత్త