వామ్మో.. ఢిల్లీ గాలి .. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని

  • వామ్మో.. ఢిల్లీ గాలి .. 
  • ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా దేశ రాజధాని
  • ఐక్యూ ఎయిర్’ లిస్ట్ లో మళ్లీ మొదటి స్థానంలోకి..
  • కమ్మేసిన విషపూరిత పొగమంచు.. జనం ఉక్కిరిబిక్కిరి
  • స్కూళ్లకు సెలవులు ఈ నెల 10 వరకూ పొడిగింపు
  • ట్రక్కులకు నో ఎంట్రీ.. కన్​స్ట్రక్షన్ పనులకు బ్రేక్ 
  • వరల్డ్ టాప్ 6 పొల్యూటెడ్ సిటీల్లో కోల్​కతా, ముంబై 

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీని మళ్లీ కాలుష్య భూతం కమ్మేసింది. సిటీ అంతటా విషపూరితమైన పొగమంచు దట్టంగా కమ్మేయడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఢిల్లీలో ఆదివారం గాలి నాణ్యత మరింతగా దిగజారిపోయి సివియర్ ప్లస్ స్థాయికి పడిపోయింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ మళ్లీ మొదటిస్థానంలోకి వచ్చింది. స్విట్జర్లాండ్ కు చెందిన ఐక్యూఎయిర్ సంస్థ రూపొందించిన తాజా లిస్ట్ లో టాప్ 10 పొల్యూటెడ్ సిటీల్లో ఢిల్లీ ఫస్ట్ ప్లేస్ లోకి రాగా.. కోల్ కతా, ముంబై నగరాలు టాప్ 6లోకి చేరాయి. 

ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఎప్పటికప్పుడు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) స్థాయిలను బట్టి ఆయా నగరాలతో ఐక్యూఎయిర్ సంస్థ తన వెబ్ సైట్ లో లిస్టును పొందుపరుస్తోంది. ఈ లిస్ట్ లో పేర్కొన్న ప్రకారం.. ఆదివారం ఉదయం 7.30 గంటల సమయానికి ఢిల్లీలో ఏక్యూఐ 483గా నమోదైంది. ఢిల్లీ తర్వాత పాకిస్తాన్ లోని లాహోర్ సిటీ రెండో స్థానంలో, కోల్ కతా మూడో స్థానంలో నిలిచాయి. బంగ్లాదేశ్ లోని ఢాకా, పాకిస్తాన్ లోని కరాచి నాలుగు, ఐదో స్థానాల్లో ఉండగా, ముంబై ఆరో స్థానంలో నిలిచింది. లాహోర్ లో 371, కోల్ కతాలో 206, ఢాకాలో 189, కరాచిలో 162, ముంబైలో 162 ఏక్యూఐ లెవల్స్ నమోదయ్యాయి. అయితే, ఆదివారం రాత్రి 7.35 గంటలకల్లా ఢిల్లీలో ఏక్యూఐ 427కు, లాహోర్ లో 218కి ఏక్యూఐ తగ్గినా మొదటి రెండు స్థానాల్లోనే నిలిచాయి. కోల్ కతాలో ఏక్యూఐ 172కు తగ్గడంతో మూడో స్థానం నుంచి ఐదో స్థానానికి చేరింది.  

డబ్ల్యూహెచ్ఓ గైడ్ లైన్స్ కన్నా100 రెట్లు ఎక్కువ 

ఢిల్లీలో వరుసగా ఆరో రోజున పొల్యూషన్ లెవల్స్ పెరిగాయి. శనివారం సాయంత్రం 415 ఏక్యూఐ నమోదు కాగా, ఆదివారం ఉదయం కల్లా అది 460కి పెరిగింది. దీంతో పొల్యూషన్ స్థాయిలు ‘సివియర్ ప్లస్’ కేటగిరీకి చేరాయని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం ఢిల్లీలోని గాలిలో పీఎం 2.5 (పర్టిక్యులేట్ మ్యాటర్ 2.5) సైజు కాలుష్య కణాల గాఢత ఒక క్యూబిక్ మీటర్ కు 523 మిల్లీ గ్రాములకు పెరిగిందని అధికారులు వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) గైడ్ లైన్స్ లో పేర్కొన్న పీఎం 2.5 సాధారణ స్థాయిల కంటే ఇది 104.6 రెట్లు ఎక్కువని తెలిపారు. పీఎం 2.5 కాలుష్య కణాలు మనిషి వెంట్రుక కంటే 30 రెట్లు సన్నగా ఉంటాయని, ఇవి ఊపిరితిత్తుల్లోకి, వాటి నుంచి రక్తంలోకి సైతం చేరే ప్రమాదం ఉందని ఎక్స్ పర్ట్ లు చెప్తున్నారు. దీర్ఘకాలంలో వీటివల్ల గుండెజబ్బులు, శ్వాస సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.  

ఢిల్లీ గాలి.. 25 - 30 సిగరెట్లకు సమానం 

గాలి కాలుష్యం తీవ్రమైతే గర్భంలోని పిండాలపైనా ఎఫెక్ట్ పడుతుందని హెల్త్ ఎక్స్ పర్ట్ లు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలోని గాలి విషపూరితంగా మారిందని, దీనిని పీలిస్తే రోజుకు 25 నుంచి 30 సిగరెట్లు తాగినంత దుష్ప్రభావం ఉంటుందని అంటున్నారు. ఎయిర్ పొల్యూషన్ తో తల నుంచి కాలి వేళ్ల దాకా మెదడు, లంగ్స్, హార్ట్ సహా ప్రతి అవయవంపైనా ప్రభావం పడుతుందని మేదాంత హాస్పిటల్ లంగ్ స్పెషలిస్ట్ డాక్టర్ అర్వింద్ కుమార్ పేర్కొన్నారు. కాలుష్యం బారిన పడిన చాలా మంది కండ్లలో ఇరిటేషన్, గొంతులో దురద వంటి లక్షణాలతో దవాఖాన్లకు వస్తున్నారని డాక్టర్లు తెలిపారు. పిల్లలు తీవ్రమైన దగ్గు, వేగవంతమైన శ్వాసతో ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. 

స్కూళ్లకు 10 దాకా సెలవులు

ఢిల్లీలో కాలుష్యం పెరిగిన నేపథ్యంలో స్కూళ్లకు సెలవులను ఈ నెల 10 దాకా పొడిగిస్తున్నట్లు విద్యా శాఖ మంత్రి ఆతిషి ఆదివారం ప్రకటించారు. ప్రైమరీ స్కూళ్లను పూర్తిగా బంద్ చేయాలని, 6 నుంచి 12వ క్లాస్ వరకు అవసరమైతే ఆన్ లైన్ లో మాత్రమే క్లాసులు చెప్పాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. పొల్యూషన్ కారణంగా శుక్ర, శనివారాలు కూడా ఢిల్లీలో స్కూళ్లకు సెలవులు ప్రకటించగా, ఆదివారం మరో ఐదు రోజులు పొడిగించామన్నారు. గవర్నమెంట్, ప్రైవేట్ ఆఫీసుల్లో సగం మంది స్టాఫ్​పని చేసేలా చూసుకోవాలని, మిగతా సగం మంది వర్క్ ఫ్రం హోం చేసేలా చూడాలని పేర్కొన్నారు. 

ట్రక్కులు, కన్ స్ట్రక్షన్ పనులపై నిషేధం

ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో వరుసగా నాలుగో రోజు కూడా ఎయిర్ క్వాలిటీ సివియర్ ప్లస్ కేటగిరీలో ఉండటంతో పొల్యూషన్ ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (సీఏక్యూఎం) స్టేజ్–4 చర్యలను ప్రకటించింది. ఢిల్లీలోకి అత్యవసర సరుకులు, సర్వీసుల కోసం వినియోగించే ట్రక్కులు, ఎల్ఎన్జీ, సీఎన్జీ, ఎలక్ట్రిక్ ట్రక్కులు తప్ప ఇతర ట్రక్కుల ఎంట్రీపై బ్యాన్ విధించింది. ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన లైట్ కమర్షియల్ వెహికల్స్ ప్రవేశాన్నీ నిషేధించింది. అలాగే హైవేలు, రోడ్లు, పైప్ లైన్ల వంటి అన్ని నిర్మాణ రంగ పనులను ఆపేయాలని ఆదేశించింది. ఇక సిటీలో పొల్యూషన్ ఎక్కువున్న ప్రాంతాల్లో నీటిని స్ప్రే చేస్తున్నారు. ఇందుకోసం 12 ఫైర్ ఇంజన్లను వినియోగిస్తున్నారు. 

ALSO READ : చేతులు కలిపిన నేతలు .. పరస్పర సహకారంతో ముందుకేళ్లాలని నిర్ణయం

కారణాలు ఇవే..  

చలికాలం కారణంగా టెంపరేచర్లు పడిపోవడం, రాత్రిపూట గాలి వేగం బాగా తగ్గిపోవడం, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో మళ్లీ పంటల వ్యర్థాలను తగలబెడుతుండటమే ఢిల్లీలో మళ్లీ కాలుష్యం పెరగడానికి కారణమని అధికారులు చెప్తున్నారు. ఆదివారం ఢిల్లీలో మినిమం టెంపరేచర్లు 15.8 డిగ్రీలుగా నమోదయ్యాయి. ఇలా ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు గాలి వేగం తగ్గడంలో గాలిలో కాలుష్యాలు ఎక్కడికక్కడ పేరుకుపోతున్నాయని అంటున్నారు. ఢిల్లీలోని కొన్ని వెదర్ స్టేషన్ల పరిధిలో ఏక్యూఏ ఏకంగా 550ని దాటిపోయిందని.. దట్టమైన బూడిద రంగు పొగమంచు కమ్మేసిందని అధికారులు వెల్లడించారు. ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో వాహనాలు, ఇండస్ట్రీల నుంచి వెలువడే పొగ కూడా పొల్యూషన్ పెరగడానికి కారణమైందని తెలిపారు.