విశ్లేషణ: ఢిల్లీ పొల్యూషన్​కు కారణమెవరు?

వేల ఏండ్ల నుంచి ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా బతికిన మానవాళికి.. ఇప్పుడు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మొసమర్రుతలేదు. దేశ రాజధాని ఢిల్లీలో అయితే ఓ పక్క పొల్యూషన్‌‌.. ఇంకో పక్క పొగమంచుతో ఊపిరాడని పరిస్థితుల్లో విలవిలలాడుతోంది. జనాభా పెరుగుదల, వాహనాలు, ఫ్యాక్టరీల పొగ కలుషితమవుతున్న నీరు ఢిల్లీ సిటీని ఆగమాగం చేస్తున్నాయి. పరిస్థితులు ఇంకింత దుర్భరంగా మారకముందే మేల్కొని పర్యావరణాన్ని కాపాడుకోవడం తక్షణ కర్తవ్యంగా భావించాలి. కేంద్ర, రాష్ట్ర సర్కార్లు వెంటనే అవసరమైన చర్యలు చేపట్టాలి.

కొన్ని దశాబ్దాల కింది వరకు స్వచ్ఛమైన నీరు, గాలితో ఆరోగ్యకరమైన, ప్రశాంత జీవితం గడిపిన మానవాళి.. ఇయ్యాల సివిలైజేషన్, డెవలప్ మెంట్ ముసుగులో ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోంది. మనుషులకే కాదు సకల ప్రాణి కోటికి ప్రమాదకరమైన కెమికల్స్, బయో వేస్టేజ్, ఇండస్ట్రియల్‌‌​వేస్టేజ్, ఇతర వ్యర్థాలతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ప్రకృతిని కాలుష్య కాసారంగా మారుస్తూ మానవ మనుగడకే పెనుసవాలును విసురుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. ఇండస్ట్రియలైజేషన్‌‌, అర్బనైజేషన్‌‌తో ఢిల్లీ, ముంబై లాంటి మహా నగరాలకు బతుకుదెరువు కోసం రోజు కూలీలు, ఉద్యోగ, ఉపాధి కోసం మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి ప్రజలు లక్షల మంది వలస వెళ్తున్నారు. దీంతో నగరాలపై జనాభా ఒత్తిడి పెరిగి ఆవాస సమస్యతోపాటు తాగడానికి పీల్చుకోవడానికి స్వచ్ఛమైన నీరు, గాలి దొరుకుతలేదు. డబ్బులు కట్టి ఆక్సిజన్ కొనుక్కొంటే తప్ప ఆరోగ్యంగా బతకలేని దారుణమైన స్టేజ్​కు వేగంగా వెళ్తున్నాం. ఇది మెట్రో సిటీలలో మనుషులు జీవించడాన్నే ప్రశ్నార్థకంగా మార్చుతుంది.


ఢిల్లీ పొల్యూషన్​కు కారణమెవరు? 
ఇబ్బడి ముబ్బడి ఇండస్ట్రియలైజేషన్‌‌, అర్బనైజేషన్, పారిశ్రామిక వ్యర్థాలతోపాటు, ఢిల్లీ రోడ్లపై తిరుగుతున్న 1.18 కోట్ల వాహనాలు విడుదల చేస్తున్న కార్బన్​డై ఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్‌‌ తదితర విషవాయువులతో సిటీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మేనేజ్​మెంట్ల లాబీయింగ్​తో ఉండీ లేనట్లుగా మారిన ఎఫ్లూయెంట్ ట్రీట్​మెంట్ ప్లాంట్లు పారిశ్రామిక వ్యర్థాల ను శుద్ధిచేయకుండానే బయటకు పంపుతున్నాయి. కార్పొరేట్ల గుప్పిట చిక్కుకున్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పొల్యూషన్​ తగ్గించడంలో పూర్తిగా ఫెయిల్ అయింది. ఫలితంగా సిటీలో నీటి, గాలి, శబ్ద కాలుష్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు పక్క రాష్ట్రాలైన పంజాబ్, హర్యానాలో వరి, గోధుమ పంట వ్యర్థాలను కాలబెట్టడంతో  పొగ మేఘాలు ఢిల్లీ ని కమ్మేస్తున్నాయి.


ఏటా లక్షల మంది దుర్మరణం
సంప్రదాయం, సెంటిమెంట్ పేరుతో దీపావళి నాడు ఢిల్లీ పటాకులు కాల్చి గాలిని మరింత పాడుచేయడం బాధాకరం. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంచనాల ప్రకారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 దాటి అత్యంత ప్రమాదకర స్థితికి వెళ్లింది. ‘ఎనర్జీ పాలసీ ఇనిస్టిట్యూట్ ఎట్ ది యూనివర్శిటీ ఆఫ్ షికాగో’ స్టడీ ప్రకారం ఢిల్లీలో  రోజురోజుకు పెరిగిపోతున్న గాలి కాలుష్యం వల్ల శ్వాసకోశ, ఊపిరితిత్తుల రోగాల బారినపడి ఏటా పది లక్షల మంది మరణిస్తున్నారు. సిటీ ప్రజల జీవితకాలం తొమ్మిదేండ్లు తగ్గిపోవడమే కాకుండా ఉత్తర భారత దేశంలో 48 కోట్ల మంది అనారోగ్యాలకు గురవుతున్నారని వెల్లడించింది. ఈ పొల్యూషన్​ ఎఫెక్ట్​తో తల్లి కడుపులో ఉన్న బిడ్డల డీఎన్​ఏ పై దుష్ప్రభావం పడడంతో పాటు గర్భస్రావాలు కూడా జరుగుతున్నాయనే విషయాలు దిగ్భ్రాంతి కలిగిస్తున్నాయి.


సుప్రీం కోర్టు ఆగ్రహంతో..
పొల్యూషన్​ ప్రమాదకర స్థాయికి చేరుకునేంతవరకు మొద్దు నిద్రపోయిన ప్రభుత్వాలు.. సుప్రీం కోర్టు సూమోటోగా కేసు తీసుకొని ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి, కొన్ని రోజులు లాక్ డౌన్ ప్రకటించడం, కాలుష్యాన్ని నివారించడానికి సరి, బేసి నంబర్ల ప్రాతిపదికన ట్రాఫిక్ కంట్రోల్​ చేయడం, ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజీలు మూసివేయడం లాంటి చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీలో కాలుష్యం తగ్గించడం కోసమే ఏర్పాటు చేసిన ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఆఫీసర్లు సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చే వరకు పొల్యూషన్​ కంట్రోల్ పట్ల నిమ్మకు నీరెత్తడం ఆందోళన కలిగించే అంశం. పొల్యూషన్ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం 2019 లో ‘నేషనల్ క్లీన్ ఏయిర్ ప్రోగ్రాం’ ప్రారంభించి గాలిలోని ప్రమాదకర పదార్థాలను శుద్ధిచేసి ఢిల్లీ ప్రజల జీవితకాలాన్ని మూడున్నరేండ్లు పెంచాలని టార్గెట్​ పెట్టుకోవడం గమనార్హం. ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థితికి చేరుకోవడం ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను మసకబార్చే అంశం. అక్కడ వివిధ దేశాల రాయబార కార్యాలయాలు, విద్య, వైద్య, బిజినెస్, పలు టెక్నాలజీ, రిసెర్చ్​సెంటర్లు ఉన్నాయి. వాటిలో పనిచేసే సిబ్బంది పొల్యూషన్ ప్రభావంతో రోగాల బారిన పడుతుంటే అది మన దేశ గౌరవానికి నష్టం కలిగిస్తుంది. 

ప్రభుత్వాలు ఏం చేయాలి?
ఢిల్లీని దేశ ప్రజలకే కాకుండా ప్రపంచంలోని అన్ని దేశాల వారు ఉండేందుకు అనుకూలమైన సిటీగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోఆర్డినేషన్​తో పారిశ్రామిక, పర్యావరణ పరిరక్షణ చట్టాలు అమలు చేయాలి. వ్యర్థాలను శుద్ధి చేసే ఎఫ్లూయంట్ ట్రీట్​మెంట్‌‌ ప్లాంట్ల సంపూర్ణ వినియోగంతో పొల్యూషన్ కట్టడి చేయాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలతో సంబంధం లేకుండ చిత్తశుద్ధితో పొల్యూషన్​కు కారణమైతున్న వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. పొల్యూషన్ కంట్రోల్ విభాగం నిద్రనుంచి మేల్కోని చట్టాలను పక్కాగా అమలు చేయాలి. దీంతో ఢిల్లీని మనదేశ ప్రజలతోపాటు, ప్రపంచంలోని అందరూ నివసించడానికి సరైన ప్రాంతంగా మార్చడానికి కృషి చేసినట్లవుతుంది. - నీలం సంపత్ , సామాజిక కార్యకర్త