నారింజ రంగు మారుతోంది .. కలుషిత జలాలతో ప్రాజెక్ట్ కు పొంచి ఉన్న ముప్పు

నారింజ రంగు మారుతోంది .. కలుషిత జలాలతో ప్రాజెక్ట్ కు పొంచి ఉన్న ముప్పు
  • అందులోకి సమీప ఫ్యాక్టరీల కెమికల్ వ్యర్థాలు
  • పూర్తి ఆయకట్టుకు సాగునీరందించలేని పరిస్థితి 
  • నీటిని టెస్ట్ చేసి కాలుష్య వ్యర్థాలను నిర్మూలించాలని రైతులడిమాండ్ 

సంగారెడ్డి, వెలుగు: జహీరాబాద్ ప్రాంతానికి సాగునీరందించే  నారింజ ప్రాజెక్ట్ డేంజర్ గా మారుతోంది.  ప్రాజెక్ట్ లోకి వ్యర్థాలు చేరుతుండగా నీరు కలుషితమవుతుంది. దాదాపు 8 వేల ఎకరాల ఆయకట్టుకు భవిష్యత్ లో నీరందని పరిస్థితి ఏర్పడనుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం కొత్తూర్ (బి) పరిధిలో 650 ఎకరాల్లో 1965–-70 లో  నారింజ వాగుపై చిన్న నీటి ప్రాజెక్టును నిర్మించారు. జహీరాబాద్ ఏరియా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుండగా ప్రాజెక్ట్ చుట్టుపక్కల ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి. 

వాటిలో ఎక్కువగా కెమికల్ ఫ్యాక్టరీలే  ఉండగా.. అవి వదిలే కలుషిత నీరు, వ్యర్థాలు ప్రాజెక్టులో చేరుతుండగా నీరు రంగు మారుతోంది.  పశువులు సైతం నీటిని తాగలేని స్థితిలోకి చేరింది. ప్రాజెక్ట్ పరిస్థితిపై స్థానికులు సంగారెడ్డి కలెక్టరేట్ గ్రీవెన్స్ సెల్ లో పలుమార్లు ఫిర్యాదులు చేశారు. అయినా.. ఫ్యాక్టరీస్  ఇన్ స్పెక్టర్స్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. కాలుష్య నీటిని సాగుకు ఎలా వాడుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఆయకట్టును పునరుద్ధరించి ప్రాజెక్టులో నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు జిల్లా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని రైతులు  కోరుతున్నారు.   

ప్రాజెక్ట్ ఎండితే.. జహీరాబాద్ ఏరియాకు నీటి ఎద్దడే.. 

జిల్లాలోని కోహీర్ మండలంతో పాటు వివిధ మండలాల మీదుగా నారింజ వాగు ప్రవహిస్తుంది. వాగు పారితే వ్యవసాయ బావుల్లో నీరు పుష్కలంగా ఉంటుంది. వర్షాధారంపైనే ఆధారపడిన ప్రాజెక్టు ఎండితే జహీరాబాద్ ఏరియా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది.  నారింజ వాగు  కోహీర్ మండలం బిలాల్ పూర్ శివారులోని మునేశ్వరాలయం వద్ద పుట్టగా.. వానలు పడ్డప్పుడు నీరంతా పాయలుగా చీలి.. పగిడి గుమ్మల్, కోహీర్, ఇవేల్లి, రాజనేల్లి,  గురుజువాడ, మధిర గ్రామాల మీదుగా జహీరాబాద్ మండలం రాయిపల్లి (డి) శివారులోకి ప్రవహిసుంది. 

అక్కడి నుంచి హుగ్గెల్లి, రంజోల్, పస్తాపూర్, అల్గోల్, దిడ్గి, కొత్తుర్(బి) ద్వారా నారింజ ప్రాజెక్టులోకి వాననీరు చేరుతుంది . ప్రాజెక్టు సామర్థ్యం 0.8 టీఎంసీలు. కానీ ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడంతో వాననీరు కొత్తూరు(బి), బుర్ధిపాడ్, బుచనెల్లి, చిరాక్ పల్లి మీదుగా ప్రవహిస్తూ కర్నాటకలోని కారింజ ప్రాజెక్టులోకి వెళ్లిపోతుంది. దీంతో నారింజ ప్రాజెక్టులోని నీరు ఆ రాష్ట్ర రైతులకే ఎక్కువగా ఉపయోగంగా ఉంది.  

నీటి శాంపిల్స్ సేకరణపై పీసీబీ నిర్లక్ష్యం

నారింజ ప్రాజెక్టు నీరు కలుషితమవుతుండగా శాంపిల్స్ సేకరణలో పీసీబీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీటి శాంపుల్స్ తీసుకుని టెస్ట్ లు చేస్తే నారింజ ప్రాజెక్ట్ నీటి రంగు మార్పునకు కారణాలు తెలుసుకోవచ్చని పేర్కొంటున్నారు.  రెండేండ్లకు ముందు ప్రతి సీజన్ లో ప్రాజెక్టు నుంచి సుమారు 8 వేల ఎకరాలకు సాగునీటిని అందేంది. ప్రాజెక్టులో పూడికతీయక సామర్థ్యం తగ్గింది.

  గేట్ల రిపేర్లు,  పునరుద్ధరణ లేక ఆయకట్టుకు నీరు అందడం లేదు. సాగునీటికి ఇబ్బందులు ఉండగా ముందుగా నారింజ ప్రాజెక్ట్ లో కాలుష్యం పెరగకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉంది. ప్రాజెక్ట్ లో నీటి కాలుష్యాన్ని నివారించేందుకు పీసీబీ అధికారులు వెంటనే టెస్ట్ లు చేసి అందుకు కారణమైన పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.