
పటాన్‌చెరు, వెలుగు: ఒకప్పుడు కాలుష్యానికి చిరునామాగా ఉండే పటాన్ చెరును గేటెడ్ కమ్యూనిటీలు, అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం పట్టణంలోని జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉత్సవాల్లో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలని, తొమ్మిదేళ్ల ప్రగతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
పటాన్‌చెరులో ఒకప్పుడు కరెంట్ లేక పరిశ్రమలు వారానికి మూడు రోజులే నడిచేవని గుర్తు చేశారు. ప్రస్తుతం 24 గంటల పాటు విద్యుత్ వస్తుండడంతో లక్షల మంది కార్మికులకు ఉపాధికి ఢోకా లేకుండా పోయిందన్నారు. కార్మికుల కోసం రూ. 300 కోట్లతో నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని త్వరలోనే సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. 20 రోజులపాటు నిర్వహించే ప్రతి కార్యక్రమంలో తాను పాల్గొంటానని చెప్పారు.