ఏపీ, తెలంగాణకు డేంజర్ బెల్స్.. కృష్ణానదిలో రోజురోజుకు పెరుగుతోన్న కాలుష్యం..!

ఏపీ, తెలంగాణకు డేంజర్ బెల్స్.. కృష్ణానదిలో రోజురోజుకు పెరుగుతోన్న కాలుష్యం..!
  • నాగార్జునసాగర్​లోకి విచ్చలవిడిగా ఫార్మా వ్యర్థాలు
  • తెలంగాణ, ఏపీల్లోని విద్యుత్​ ప్లాంట్లు, ఫార్మా ఇండస్ట్రీలతో కాలుష్యం
  • రోజూ సగటున 40 వేల క్యూబిక్​ మీటర్ల వ్యర్థాలు నదిలోకి
  • నది పరివాహకంలో 427 పరిశ్రమలు.. 31%  కాలుష్యం కెమికల్​ ఫ్యాక్టరీల నుంచే
  • శ్రీశైలం, సాగర్​ సహా 15 ప్రాజెక్టుల్లో ఏటా 2.3 శాతం మేర పూడిక చేరిక
  • కొట్టుకుపోతున్న నేలలు.. బ్రిడ్జిలు, రోడ్లకు ప్రమాదం ఏర్పడే చాన్స్​
  • నిట్ వరంగల్​ స్టడీలో వెల్లడి.. కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో అధ్యయనం
  • కేంద్రానికి ప్రిలిమినరీ రిపోర్ట్​ పంపిన పరిశోధకులు

హైదరాబాద్, వెలుగు: కృష్ణా నది కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నది. పరిశ్రమలు, మానవ కార్యకలాపాలతో నది నీళ్లు కలుషితమవుతున్నాయి. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో నది చాలా వరకు కలుషితమైంది. ఫార్మా, రసాయన వ్యర్థాలు, ఇంధనం నది నీళ్లను పాడు చేస్తున్నాయి. కృష్ణా బేసిన్‎లోని నాగార్జునసాగర్​ ప్రాజెక్టుపై మన రాష్ట్రంలోని వివిధ ఫార్మా ఇండస్ట్రీలు, రసాయన పరిశ్రమలు తయారు చేసే సింథటిక్​కెమికల్స్, భారజలాలతో  నది కలుషితమవుతున్నది. ఇటు ఏపీలోని విజయవాడ థర్మల్​ పవర్​స్టేషన్​నుంచి విడుదలయ్యే వ్యర్థాలతోనూ కృష్ణా నది నీళ్లు కరాబవుతున్నాయి. నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ఆఫ్​ టెక్నాలజీ (నిట్​), వరంగల్​ చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 

కృష్ణా నది శుద్ధి కోసం కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో నిట్,  వరంగల్​ఈ స్టడీ చేస్తున్నది. దీనికి సంబంధించిన ప్రాథమిక రిపోర్ట్‎ను కేంద్ర జలశక్తి శాఖకు ఇటీవల పరిశోధకులు సమర్పించారు. ఆ ప్రిలిమినరీ రిపోర్టులో ఈ విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి. రసాయనాలు ఎక్కువగా నదీ జలాల్లో కలుస్తుండడంతో నీటిలోని బయలాజికల్​ఆక్సిజన్​డిమాండ్ (బీవోడీ)​ భారీగా తగ్గిపోతున్నదని రిపోర్ట్‎లో రీసెర్చర్లు ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్‎లో 427 పరిశ్రమలు ఉండగా.. అందులో కెమికల్, మెటలర్జికల్, ఇంజినీరింగ్, ఫుడ్​ ప్రాసెసింగ్​ ఇండస్ట్రీలు ఉన్నాయని పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో డీజిల్​మోటార్ల వాడకం ఎక్కువగా ఉంటున్నదని, ఫలితంగా బీవోడీ స్థాయిలు లీటర్‎కు 20 మిల్లీ గ్రాముల వరకు చేరుకుంటున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. 

రోజూ నదిలోని 35 వేల నుంచి 40 వేల క్యుబిక్ మీటర్ల వరకు వ్యర్థాలు ఒక్క కర్నూలు జిల్లా నుంచే నదిలోకి వచ్చి చేరుతున్నాయని తెలిపారు. కర్నూలులోని రాయలసీమ పేపర్​మిల్స్​లిమిటెడ్​, విజయపురి నార్త్‎లోని (నాగార్జునసాగర్) ఏపీ డ్రగ్స్​అండ్​ఫార్మాస్యుటికల్​ఇండస్ట్రీస్, రాశి సింథటిక్​అండ్​కెమికల్స్, ఏపీ విజయవాడలోని విజయవాడ థర్మల్​పవర్​స్టేషన్, ఉయ్యూరులోని కేసీపీ షుగర్​మిల్స్ నుంచి కెమికల్స్​ఎక్కువగా నదిలోకి చేరుతున్నాయని రిపోర్ట్​లో రీసెర్చర్లు పేర్కొన్నారు. కాలుష్యం వల్ల నదిలోని చేపలజాతులు అంతరించి పోయే ప్రమాదం ఏర్పడుతున్నదని తెలిపారు. టోర్​ నెయిలి అనే జాతికి చెందిన చేపలు దాదాపుగా అంతరించిపోయాయని వెల్లడించారు.   

ఎక్కువ పొల్యూషన్ వాటి నుంచే

కృష్ణా నది కాలుష్యానికి కారణమవుతున్న ఫ్యాక్టరీల్లో సింహభాగం కెమికల్, మెటలర్జికల్​ ఇండస్ట్రీలే ఉంటున్నాయని రిపోర్ట్​ తేల్చింది. నదిలో చేరుతున్న కాలుష్య కారకాల్లో ఆ పరిశ్రమల నుంచి విడుదలవుతున్న వాటి వాటానే 31.38 శాతం మేర ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఆ తర్వాత ఫుడ్​ ప్రాసెసింగ్​ఇండస్ట్రీస్​ నుంచి 23.74 శాతం, ఇంజినీరింగ్​ఇండస్ట్రీస్​ నుంచి 22, ఇతర పరిశ్రమల నుంచి 13.51, వస్త్ర పరిశ్రమల నుంచి 8.06, మైనింగ్​ఇండస్ట్రీస్​ నుంచి 1.31 శాతం మేర కాలుష్య కారకాలు విడుదలవుతున్నాయి. 

ఇంతటి కాలుష్యంతో రోజుకు 3.30 లక్షల కిలోల బీవోడీ అవసరమయ్యే ముప్పు పొంచి ఉన్నదని రిపోర్ట్​లో హెచ్చరించారు. రసాయన ఎరువుల వాడకంతోనూ కృష్ణా నది తీవ్రంగా కలుషితమవుతున్నదని రీసెర్చర్లు రిపోర్ట్​లో ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని వాయి, సాంగ్లి, పండర్​పూర్​ ఘాట్ల వద్ద కూడా కాలుష్య ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు రిపోర్ట్​లో పేర్కొన్నారు. 

అర్బన్​ వేస్టేజ్​, మురుగు, వాహనాల నుంచి విడుదలయ్యే కాలుష్య కారకాలు, డీజిల్, పుణ్య స్నానాలతో నది కలుషితమవుతున్నట్టు తేల్చారు. కర్నాటకలోని కహోల్, బాగల్​కోట్ లోనూ అవే కారణాలతో నది కలుషితం అవుతున్నట్టు రిపోర్ట్​ వెల్లడించింది. ఏపీలోని కర్నూలు, మంత్రాలయం వద్ద నది కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్నదని హెచ్చరించింది. 

పూడిక పేరుకపోతున్నది..

శ్రీశైలం, నాగార్జునసాగర్‎తో పాటు కృష్ణా బేసిన్​లోని 15 ప్రధాన ప్రాజెక్టుల్లో ఏటా సగటున 2.3 శాతం మేర పూడిక వచ్చి చేరుతున్నదని రిపోర్ట్​ తేల్చింది. దీంతో నీటి లభ్యత కూడా తగ్గిపోతున్నదని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. నేల కొట్టుకుపోవడం, అడవులను నరికేయడం, వ్యవసాయ కార్యకలాపాలతో పూడిక ఎక్కువ అవుతున్నదని పేర్కొన్నారు.

నదుల్లో అక్రమ ఇసుక తవ్వకాల వల్ల నది నేల క్రమక్షయానికి గురవుతున్నదని తెలిపారు. దాని వల్ల నదిపై నిర్మించిన బ్రిడ్జిలు, రోడ్లు, ఇతర నిర్మాణాలకు ప్రమాదం ఏర్పడే ముప్పు పొంచి ఉన్నదని తెలిపారు. దాంతోపాటు నదీ తీరంలోని పచ్చని చెట్లకూ ప్రమాదం ఉంటుందని అన్నారు. తెలంగాణలో ఈ సమస్య తీవ్రంగా ఉన్నదని రిపోర్ట్​లో రీసెర్చర్లు పేర్కొన్నారు.