సెమీ ఫైనల్లో సత్తా చాటే పార్టీ ఏది?

మేఘాలయలోని మాసిన్‌రామ్‌లో వర్షంలా ఈ ఏడాదంతా దేశంలోని ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాజకీయ పార్టీలకు, నాయకులకు విశ్రాంతి ఉండదు ఇక. మార్చిలో మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్‌ రాష్ట్రాల ఎన్నికలు ఉంటే, మే నెలలో కర్నాటక, డిసెంబర్ లో తెలంగాణ, చత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ తొమ్మిది రాష్ట్రాల ఎన్నికలు 2024 లోక్​సభ ఎన్నికలకు ఒక రకంగా సెమీ ఫైనల్సే. కాబట్టి ప్రస్తుతం ఈ 9 రాష్ట్రాల్లో పాలనలో ఉన్న పార్టీలు అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంటాయా? ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీల ప్రభావం ఎలా ఉండబోతున్నది. జాతీయ పార్టీలు ఐదు పెద్ద రాష్ట్రాల్లో ఏ పార్టీ ఎన్ని గెలుచుకోగలదనేది ఆసక్తికరంగా మారింది. 

నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర

ఈశాన్య రాష్ట్రాలపై భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ఈ 3 రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీకి కొంత ప్రయోజనం ఉంటుంది. త్రిపురలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొనేందుకు బీజేపీ ముఖ్యమంత్రులను మార్చాల్సి వచ్చింది. ఇతర ఈశాన్య రాష్ట్రాల మాదిరిగా కాకుండా త్రిపురలో బెంగాలీ జనాభా ఎక్కువ. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలు, మమతా బెనర్జీ బరిలో నిలిస్తే.. హోరాహోరీ పోరు ఉంటుంది. రాజకీయాలు ఎక్కువగా ఉన్న చిన్న రాష్ట్రమైన త్రిపురలో బీజేపీ తిరిగి అధికారం నిలబెట్టుకుంటుందా? అనేది చూడాలి.

కర్నాటక: కర్నాటకలో మే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్​లాంటి జాతీయ పార్టీలు సహా ప్రాంతీయ పార్టీలు వాటి వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీజేపీ మొట్టమొదటిసారిగా దక్షిణాదిలో అధికారంలోకి వచ్చింది కర్నాటకలోనే. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై అక్కడ వ్యతిరేకత ఉంది. బలమైన స్థానిక నాయకులు ఉన్న ఇతర బీజేపీ రాష్ట్రాల్లో మాదిరిగా కాకుండా, కర్నాటక నాయకత్వ లోపంతో బాధపడుతున్నది. ఈ సమస్యను అధిగమించేందుకు బీజేపీ పలువురు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉంది. 25 ఏండ్లుగా అదే నాయకులు ఉన్నందున కర్నాటక కాంగ్రెస్ కూడా అధికార వ్యతిరేకతతో బాధపడుతున్నది. కొత్త వారిని అనుమతించకుండా, పాత నాయకులు వారి గుత్తాధిపత్యాన్నే కొనసాగిస్తున్నారు. వీరుగాక దేవెగౌడ, కుమారస్వామి ఉన్నారు. మొత్తానికి ఈసారి అక్కడ హోరాహోరీ పోటీ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే తనకు లాభం చేకూరుతుందని బీజేపీ భావిస్తోంది.

రాజస్థాన్: ప్రస్తుతం రాజస్థాన్​లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, మరోసారి అధికారం చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. కానీ ఇక్కడ సీఎం గెహ్లాట్​ప్రభుత్వం అన్ని రకాలుగా విఫలమైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు సహా రాష్ట్ర సర్కారు స్కీంలు కూడా పూర్తి స్థాయిలో పేదలకు చేరడం లేదు. శాంతి భద్రతల సమస్యలు బాగా ఉన్నాయి. ఇదీగాక రాజకీయ అస్థిరత లాంటి బలహీనతలు గెహ్లాట్​సర్కారుపై వ్యతిరేకతను పెంచాయి. గాంధీ కుటుంబం రాజస్థాన్‌ను ఉపయోగించుకుందనే భావన కూడా ఉంది. ఇక్కడ బీజేపీ గట్టిగా దృష్టి పెడితే.. గెలిచేందుకు అన్ని అవకాశాలు ఉన్నాయి. 

మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ లో శివరాజ్‌సింగ్ చౌహాన్‌ వంటి నాయకుడు సీఎంగా ఉండటం బీజేపీ అదృష్టం. చౌహాన్ చాలా తెలివిగల, చురుకైన రాజకీయ నాయకుడు. కాంగ్రెస్ పక్షాన కమల్ నాథ్ గొప్ప రాజకీయ నాయకుడు. అయితే కాంగ్రెస్ కొత్త రక్తాన్ని అనుమతించడం లేదు. దిగ్విజయ్ సింగ్ వంటి గత 40 ఏండ్ల పాత ముఖాలదే ఆధిపత్యం కొనసాగుతున్నది. ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉండబోతున్నది. 

చత్తీస్‌గఢ్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ చౌహాన్ లాగే చత్తీస్​గఢ్​ సీఎం భూపేష్ బాఘేల్ కూడా తెలివైన, చురుకైన సీఎం. కాబట్టి చత్తీస్‌గఢ్‌లో మళ్లీ గెలిచే అవకాశం కాంగ్రెస్‌కు ఉంది. రమణ్​సింగ్​ నేతృత్వంలో బీజేపీ చత్తీస్‌గఢ్‌ను15 ఏండ్ల పాటు పాలించింది. ప్రత్యామ్నాయ నాయకత్వం ఎక్కడా కనిపించలేదు. ప్రస్తుతం ఆరోగ్య మంత్రి టి.ఎస్.సింగ్ డియో నేతృత్వంలోని కాంగ్రెస్ అసంతృప్తులు తిరుగుబాటు చేస్తారా లేదా అనేది బీజేపీకి ఉన్న ఏకైక ఆశ.

మిజోరం: మిజోరంలో ప్రాంతీయ పార్టీలు, బీజేపీ ప్రధాన పోటీదారులుగా ఉన్నాయి. ఇలాంటి చిన్న రాష్ట్రాల్లో విజయాలు ఊహించడం కష్టం. రాజకీయ పరిణామాలు అత్యంత వేగంగా మారిపోతుంటాయి.

తెలంగాణ: తెలంగాణ చిన్న రాష్ట్రమైనప్పటికీ, హైదరాబాద్‌కు ఉన్న ఆర్థిక శక్తి దృష్ట్యా, ఎప్పుడూ పెద్ద రాష్ట్రాల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. ఒడిశా లాగే తెలంగాణలో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్​ప్రాంతీయ పార్టీ- అయిన కేసీఆర్– బీఆర్‌ఎస్‌తో పోటీ పడుతున్నాయి. తెలంగాణలో బీజేపీ ఊహించని స్థాయిలో ఎదుగుతూ గిరిజనులు, దళితులు, బీసీలను ఆకర్షిస్తున్నది. కాంగ్రెస్‌ పార్టీకి మంచి క్యాడర్, కార్యకర్తల బలం ఉన్నది, కానీ జాతీయ నాయకత్వం దెబ్బతింది. టీఆర్‌ఎస్‌కు సొంతంగా మెజారిటీ రాకపోతే, బీజేపీ, కాంగ్రెస్‌లు పైచేయి సాధిస్తాయి. ఇక్కడ రాజకీయాలు మారడానికి ఇంకా సమయం ఉంది.

డబ్బు - సంపన్న రాష్ట్రాలు

కర్నాటక, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు ఇప్పుడు భారత రాజకీయాల్లో కామధేనువులు. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి కాసుల వర్షం కురిపించే రాష్ట్రం. ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణల్లో కాంగ్రెస్ బయటికి రావడంతో అది కర్నాటక, చత్తీస్‌గఢ్‌లపై ఆధారపడి ఉంది. కాంగ్రెస్ హయాంలో ఆంధ్రాలో ధనవంతులైన వ్యాపారవేత్తలకు టిక్కెట్లు, పదవులు ఎలా వచ్చాయో ప్రతి తెలుగువాడికి తెలుసు. ఇప్పుడు ఆంధ్రా, తెలంగాణలో ధనిక దురాశ రాజకీయ నాయకులు కనుమరుగైపోయారు. ప్రతి కాంగ్రెస్ ఢిల్లీ నాయకుడూ ఆంధ్రాను దోచుకోవడానికి ఇన్​చార్జిగా ఉండాలని కోరుకున్నారు. ఇప్పుడు వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో అలాంటి పరిస్థితి లేదు. కానీ చత్తీస్‌గఢ్, కర్నాటకలు ఇప్పుడు డబ్బు రాజకీయాల “తెలుగు వ్యాధి” బారిన పడ్డాయి. కర్నాటక, చత్తీస్‌గఢ్‌లను కాంగ్రెస్ గెలుచుకుంటే, 2024లో బీజేపీకి, మోడీకి పెను సవాలు విసురుతుంది. అందుకే ఆ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్​ను కాదని విజయం సాధించడం లేదా కనీసం కాంగ్రెస్‌ను గెలవకుండా ఆపడం బీజేపీ తొలి లక్ష్యం.

ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు

కర్నాటక, చత్తీస్‌గఢ్‌, తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ వంటి అయిదు పెద్ద, ముఖ్యమైన రాష్ట్రాలకు జరుగుతున్న ఈ ఏడాది ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. ప్రాంతీయ నాయకుడు కేసీఆర్ పాలనలో ఉన్న తెలంగాణ తప్ప, మిగిలిన 4 రాష్ట్రాల్లో బీజేపీ,- కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్నాయి. కాంగ్రెస్ 5 రాష్ట్రాల్లో కనీసం రెండైనా గెలవాలి. అందులో అవకాశం ఉన్న చత్తీస్‌గఢ్, కర్నాటకలను గెలుచుకోగలిగితే మేలు. బీజేపీ కనీసం రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లలోనైనా గెలవాలి. కర్నాటకలో కాంగ్రెస్‌కు కనీస మెజారిటీ రాకుండా చూసుకోవాలి. అప్పుడే వాటి ప్రాతినిధ్యం సార్వత్రిక ఎన్నికల్లోనూ కనిపిస్తుంది.
- డా. పెంటపాటి పుల్లారావు,
పొలిటికల్​ ఎనలిస్ట్