బీఆర్​ఎస్​ నేతలే నాళాలు, చెరువుల స్థలాలు కబ్జా చేశారు: రవీంద్రనాథ్​

బీఆర్​ఎస్​ నేతలే  నాళాలు, చెరువుల స్థలాలు కబ్జా చేశారు: రవీంద్రనాథ్​

గ్రేటర్​లో నాళాల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రాను స్వాగతిస్తున్నామని  టీపీసీసీ  రాష్ట్ర కార్మిక విభాగం కార్యదర్శి వి వి రవీంద్రనాథ్ నాయుడు అన్నారు.  హైడ్రా చేపడుతున్న అక్రమ కూల్చివేతలను అడ్డుకునేందుకు మాజీ మంత్రులు కేటీఆర్ ,హరీష్ రావులు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందని ఆయన ఆరోపించారు.  ఆర్టిసి క్రాస్ రోడ్ లోని పార్టీ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జంట నగరాలలోని ప్రజలకు గతంలో తాగునీటిని అందించిన చెరువులను పునరుద్ధరించేందుకు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయమని పేర్కొన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జంట నగరాలలో అనేక చెరువుల స్థలాలు.... నాలాల స్థలాలు బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసి లేఅవుట్లు ఏర్పాటు చేసి వాటిని అమ్ముకొని కోట్ల రూపాయలు అర్జించారని తెలిపారు . హైడ్రా చట్టపరంగా అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుంటే కేటీఆర్ , హరీష్ రావులు ఎందుకు అడ్డుపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. చెరువులు నాళాలను ఆక్రమించిన వారిలో అధిక శాతం టిఆర్ఎస్ నేతలు ఉన్నందునే వారు హైడ్రాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. చెరువులలోని ఎఫ్ టి ఎల్ మరియు బఫర్ జోన్ల స్థలాలను కాపాడకపోతే భవిష్యత్తులో అనేక పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని ఆయన పేర్కొన్నారు. ఎఫ్ టి ఎల్  బఫర్ జోన్లలో ఎవరు ఆక్రమించిన, అక్రమ నిర్మాణాలు జరిపిన రాజకీయాలకు అతీతంగా కూల్చివేయాలని ఆయన సీఎం ను కోరారు. 

ALSO READ | హైడ్రాకు ప్రజల నుండి సూపర్ రెస్పాన్స్.. మంత్రి పొన్నం ప్రభాకర్

నాలాలు, వాటి పరిసర ప్రాంతాలను కబ్జా చేసి నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూడా తొలగించి వర్షాకాలంలో నీటిముంపు సమస్యలు లేకుండా చూడాలని  హైడ్రా కమిషనర్ రంగనాథ్ ను కోరారు. హైడ్రా చేపడుతున్న ఈ బృహత్తర కార్యక్రమం పై సర్వత్ర చర్చ జరుగుతుందని అందరూ స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు. సీఎం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి హైడ్రాకు మద్దతుగా తాము నిలబడతామని తెలిపారు.