- రంగ్లాల్ కుంటను ఆక్రమించారని తాఖీదు
- 15 రోజుల్లో కూల్చకపోతే తొలగిస్తామని హెచ్చరిక
- జయభేరి ఆక్రమించిన కుంట స్థలంలో షెడ్డు, పార్కింగ్ స్థలం
- రెండు రోజుల్లో తామే కూల్చివేస్తామన్న జయభేరి అధినేత మురళీమోహన్
గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్‌లో అక్రమణలతో కుచించుకుపోయిన చెరువులు, కుంటలకు హైడ్రా రాకతో పునరుజ్జీవం పోసుకుంటున్నాయి. నీటితో కలకలలాడిన చెరువులు, కుంటలు గత కొన్నేండ్లుగా కబ్జాలకు గురై కుచించుకుపోయాయి. ఐటీ కారిడార్‌లోని రంగ్లాల్ కుంట కబ్జాలతో కనుమరుగవ్వగా ఇటీవల హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ కుంటను పరిశీలించారు. కుంట శిఖం స్థలాన్ని ఆక్రమించిన జయభేరి సంస్థకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో ఆక్రమణలను తొలగించకపోతే తామే కూల్చివేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.
శేరిలింగంపల్లి మండలం నానక్‌రాంగూడ సర్వే నంబర్ 106లో 2.28 ఎకరాల్లో విస్తరించి ఉన్న రంగ్లాల్ కుంట బఫర్‌జోన్‌ను కలుపుకొని 5.36 ఎకరాల్లో ఉంది. ఒకప్పుడు చుట్టూ ఉన్న పంటపొలాలకు ఈ చెరువు సాగునీటిని అందించింది. ఆ తర్వాత చెరువు చుట్టూ పలు నిర్మాణ సంస్థలు మట్టిని నింపి ఆక్రమించసాగాయి.
వరదనీరు లోపలికి రాకుండా, బయటకు వెళ్లకుండా అలుగు, తూము సైతం కబ్జాకు గురయ్యాయి. రంగ్లాల్కుంటపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శుక్రవారం ఇరిగేషన్, రెవెన్యూ అధికారులతో కలిసి కుంటను పరిశీలించారు. కుంటను అనుకొని జయభేరి నిర్మాణ సంస్థ చెరువు శిఖం స్థలంలో మట్టిని నింపి, రేకులతో ఫెన్షింగ్ ఏర్పాటు చేసి ఆక్రమించారు.
ఈ ఆక్రమించిన స్థలంలో పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేశారు. చెరువు స్థలాన్ని ఆక్రమించిన జయభేరి సంస్థకు హైడ్రా అధికారులు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల్లో ఆక్రమించిన స్థలంలో కట్టడాలను కూల్చివేయాలని, లేకపోతే తాము కూల్చివేస్తామని నోటీసుల్లో హెచ్చరించారు. నోటీసులపై స్పందించిన జయభేరి అధినేత మురళీమోహన్ చెరువు స్థలంలో ఆక్రమించిన చేపట్టిన నిర్మాణాలను రెండు రోజుల్లో తామే కూల్చివేస్తామని ప్రకటించారు.
ఇదే చెరువు మరోవైపు తూము, నాలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయనున్నట్లు తెలుస్తుంది.