- శిఖం భూముల్లో అక్రమ నిర్మాణాలు
- చెరువులకు తెగిపోతున్న ‘గొలుసుకట్టు బంధాలు’
- కబ్జాదారుల చెరలో వందలాది ఎకరాలు
- లేఅవుట్ చేసి గ్రీన్డ్యాండ్గా మున్సిపాలిటీకి అప్పగించిన వైనం
మానుకోట జిల్లా కేంద్రంలోని చెరువులు, కుంటల భూములు మాయమయ్యాయి. కోట్ల విలువైన శిఖం భూములు యథేచ్ఛగా కబ్జాకు గురై, నిర్మాణాలు జరిగాయి. గొలుసుకట్టు చెరువులు ఆక్రమణలకు గురవడంతో వరద వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది.
మహబూబాబాద్, వెలుగు: గత పదేండ్లల్లో పెద్ద ఎత్తున మహబూబాబాద్జిల్లా కేంద్రంలో చెరువుల భూములు కబ్జా అయినట్లు స్థానికంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో హైడ్రా పేరిట అక్రమ నిర్మాణాలను తొలగిస్తుండడంతో అక్రమార్కుల్లో దడ మొదలయ్యిందని తెలుస్తున్నది. కాగా, హైడ్రా వంటి కార్యక్రమాలను జిల్లాల్లోనూ చేపట్టి కబ్జాకు గురైన చెరువుల భూములను రక్షించాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా కేంద్రంలో కబ్జాకు గురైన చెరువులు..
నిజాం చెరువు: మహబూబాబాద్ పట్టణంలోని ఈ చెరువు 642 సర్వేనెంబరులో 29.19 ఎకరాల విస్తీర్ణంలో శిఖం భూమి, 161 ఎకరాల ఆయకట్ట ఉంది. మొత్తం 70 ఎకరాలకు పైగా ఎఫ్టీఎల్ ఉండగా, ఇదే ల్యాండ్‌లో కొన్ని పట్టానెంబర్లతో శిఖం భూమిని అక్రమించుకుని ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.
బంధం చెరువు: 307 సర్వే నెంబర్లో ఉన్న బంధం చెరువు 32.24 ఎకరాల విస్తీర్ణం, ఇందులో 14.19 ఎకరాలు అన్యక్రాంతమైంది. ఎఫ్‌టీఎల్ పరిధిలో పట్టా భూమి13.30 ఎకరాల్లో ఉంది. కాగా, 302 నుంచి 314 వరకు, 324, 325, 328, 331, 342, 345, 347లో గల పట్టా భూములు 307/2, 307/1 సర్వేనెంబర్ ఉన్న శిఖం భూమి పక్కన ఉంది. దీంతో అక్రమార్కుల కన్ను శిఖం భూమిపై పడింది. అక్రమించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 3.15 ఎకరాల్లో ఇండ్ల నిర్మాణాలు జరిగాయి.
కంబాల చెరువు : జిల్లా కేంద్రంలో ఉన్న కంబాలచెరువు 442 సర్వేనెంబర్‌లోని 84.07 ఎకరాల విస్తీర్ణంలో శిఖం భూమి ఉంది. కొందరు దళారులు, రియల్టర్లు 25 ఎకరాలుపైగా ఈ చెరువు శిఖం అక్రమించుకున్నారు. ఈ భూమినే లేఅవుట్ చేసి మున్సిపాలిటీకి గ్రీన్‌ల్యాండ్ గా విశేషం.
జగన్నాయకుల చెరువు : గుమ్ముడూర్ రెవెన్యూ పరిధిలోని జగన్నాయకుల చెరువు 282 సర్వేనెంబర్‌లో మొత్తం 201.11ఎకరాల విస్తీర్ణంలో శిఖం భూమి ఉంది. కోట్ల విలువైన ఈ భూమిలో 5 ఎకరాలమేర చదును చేసిన నిర్మాణాలు చేశారు. బంధం చెరువు నుంచి జగన్నాయకుల చెరువుకు వచ్చే నాలాలను మట్టిపోసి, ఆక్రమించారు. ఇటీవల ఇల్లందు రోడ్‌లోని బ్రిడ్జివద్ద నాలలో మట్టిపోసి పూడ్చివేశారు.
రాంభద్రు చెరువు : ఈ చెరువు 23 సర్వేనెంబర్‌లోని 46.10 ఎకరాల విస్తీర్ణంలో శిఖం భూమి ఉంది. ఇటీవల ఎఫ్‌టీఎల్‌లోని 5 ఎకరాల్లో కొందరు మట్టిపోసి లేవల్ చేశారు. నిజాం చెరువు నుంచి వచ్చే నాలాలను పూడ్చేసి నిర్మాణాలు మొదలు పెట్టారు.
గుండ్ల కుంట : 302 సర్వేనెంబర్‌లోని 9.27 ఎకరాల విస్తీర్ణంలో గుండ్లకుంట శిఖం భూమి ఉండగా, 65ఎకరాల ఆయకట్టు ఉంది. ఇటీవల ఈ చెరువు ఎఫ్‌టీఎల్‌లోనూ అక్రమ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. రాత్రికి రాత్రే పనులు కానిచ్చేస్తున్నారు.
పోతిరెడ్డి కుంట: మహబూబాబాద్ రెవెన్యూ పరిధిలోని 431, 551/1 సర్వేనెంబర్‌లోని 9.27 ఎకరాల శిఖం భూమి ఉంది. 25 ఎకరాలకుపైగా ఎఫ్‌టీఎల్ ఉంది. కొందరు రియల్టర్లు ఆక్రమించుకుని ప్రభుత్వ భూమికి పట్టా నెంబర్ వేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రైవేట్ వ్యక్తులు 8.30 ఎకరాల శిఖం, ప్రభుత్వ భూమికి హద్దులు ఏర్పాటు చేసుకుని కంచె ఏర్పాటు చేశారు. ఎఫ్‌టీఎల్‌లో మట్టిపోసి పూడ్చారు.
కృష్ణసాయి కుంట : పట్టణం పరిధిలో ఈ చెరువు 552లో 28.36 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ఈ చెరువు ఎఫ్‌టీఎల్, నాలాలను పూడ్చేసి నిర్మాణాలు చేపట్టడంతో వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతుంది.
దామోరకుంట : 551 సర్వేనెంబర్‌లో 18.36 ఎకరాలలో ఈ చెరువు శిఖం భూమి ఉంది. ఎఫ్‌టీఎల్‌లో ఇండ్లు నిర్మాణాలు చేపట్టారు. కాలువను పూడ్చివేసి, ఇండ్లు నిర్మించారు.
చెరువుల ఆక్రమణలపై సీఎంకు ఫిర్యాదు చేస్తా..
మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో చెరువులు, కుంటలు మొత్తంగా కబ్జాకు గురయ్యాయి. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో అక్రమ నిర్మాణాలు ఎక్కువయ్యాయి. చెరువులు ఆక్రమించడంతో వరద నీరు వెళ్లేందుకు ఇబ్బందిగా మారింది. ఆక్రమణలపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, ప్రభుత్వ భూములను రక్షించేందుకు కృషి చేస్తా.
పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎంపీ