
- శిఖం భూములు, ఎఫ్ టీఎల్ పరిధిలో వెంచర్లు, కాలనీలు
- ఆక్రమణకు గురవుతున్న చెరువులు
- బీఆర్ఎస్ వరంగల్ జిల్లా ఆఫీస్ కోసం పుల్లాయికుంట పూడ్చివేత
- పట్టించుకోని ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు : గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు, కుంటలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ నేతల అండతో కొందరు రియల్టర్లు, బిల్డర్లు అడ్డగోలుగా చెరువులు, శిఖం భూములను ఆక్రమిస్తూ వెంచర్లు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చెరువులను సర్వే చేసి హద్దులు నిర్ణయించాల్సిన ఆఫీసర్లు అక్రమార్కులకే సపోర్ట్ చేస్తుండడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
కనిపించని బఫర్ జోన్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 ఎకరాల్లోపు విస్తీర్ణం ఉన్న చెరువులకు 9 మీటర్లు, 25 ఎకరాల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న చెరువులకు 30 మీటర్ల వరకు బఫర్ జోన్ ఉండాలి. ఆ ప్లేస్ లలో ఎలాంటి నిర్మాణాలకు పర్మిషన్ ఇవ్వకూడదు. కానీ ఈ నిబంధనలు వరంగల్ నగరంలో ఎక్కడా అమలు కావడం లేదు. రియల్టర్లు, బిల్డర్లు చెరువులను మొరంతో పూడ్చి వేస్తూ ఇండ్లు కట్టి అమ్మకానికి పెడుతున్నారు. ఇప్పటికే నగరంలోని భద్రకాళి చెరువు, మట్టెవాడ కోట చెరువు, ఉర్సు రంగ సముద్రం, కాజీపేట బంధం చెరువు, హసన్ పర్తి పెద్ద చెరువు, చిన్నంగి చెరువు, మడికొండ పెద్ద చెరువు, భీమారం శ్యామల చెరువు, దేవన్నపేట బంధం చెరువు ఆక్రమణకు గురయ్యాయి. రంగశాయిపేట బెస్తం చెరువు, గోపాలపూర్ ఊర చెరువులు నామరూపాల్లేకుండా పోయాయి. 20 ఎకరాలకు పైగా ఉండాల్సిన గోపాలపూర్ ఊర చెరువు ఆక్రమణల కారణంగా ప్రస్తుతం 10 ఎకరాలకే పరిమితమైంది.
పట్టించుకోని ఆఫీసర్లు.. ఆగని ఆక్రమణలు
అక్రమార్కులు చెరువులను యథేచ్ఛగా కబ్జా చేస్తున్నా ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతో కబ్జాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కాజీపేట మండలం మడికొండలోని కొత్తకుంటను కొద్ది రోజుల కిందట బీఆర్ఎస్ కు చెందిన ఓ కార్పొరేటర్ చదును చేసే ప్రయత్నం చేయగా.. అక్కడి మత్స్యకారులు అడ్డుకున్నారు. 4 రోజుల కిందట హసన్ పర్తి లోని కుంటను కొందరు సాఫ్ చేసేందుకు ప్రయత్నించగా స్థానికులు గమనించి కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. నెల రోజుల క్రితం ఓ వ్యక్తి శ్యామల చెరువును ఆక్రమించగా స్థానికులు ఆఫీసర్లకు కంప్లైంట్ చేశారు. వంగపహాడ్ బాబాయ్ చెరువు, ఊర చెరువు, చింతల చెరువు పరిధిలో ఆక్రమణలు వెలుగులోకి వస్తున్నాయి.
తెగిన గొలుసుకట్టు
ప్రజల సాగు, తాగునీటి అవసరాల కోసం కాకతీయులు అప్పట్లో నగరం చుట్టూ సుమారు 202 గొలుసుకట్టు చెరువులు, కుంటలు నిర్మించారు. ప్రస్తుతం సిటీ విస్తరించడం, కబ్జాలు పెరిగిపోవడం వల్ల సుమారు 52 చెరువులు, కుంటలు పూర్తిగా కనుమరుగయ్యాయి. దీంతో గొలుసుకట్టు తెగిపోయి 2020 ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు నగరం మొత్తం నీటమునిగింది. దీంతో ఆఫీసర్లు రెండు, మూడు సార్లు చెరువుల సంరక్షణ కమిటీ మీటింగ్ పెట్టి హడావుడి చేశారు. ఆ తర్వాత ఏడాది నుంచి చెరువుల పరిరక్షణ విషయాన్నే పక్కన పడేశారు. అంతేగాకుండా చెరువులు, కుంటలకు ఎలాంటి హద్దులు నిర్ణయించలేదు. ఇప్పటికైనా ఆఫీసర్లు స్పందించి చెరువులను రక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ కోసం చెరువును పూడ్చిన్రు
బీఆర్‌ఎస్ పార్టీ వరంగల్ జిల్లా ఆఫీస్ నిర్మాణానికి ఇటీవల మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే ఈ బిల్డింగ్ నిర్మించేందుకు రంగశాయిపేటలోని పుల్లాయికుంటను కొంత మేరకు పూడ్చి వేశారు. చెరువు కబ్జాలను అడ్డుకోవాల్సిన అధికార పార్టీ లీడర్లే చెరువును పూడ్చి పార్టీ ఆఫీస్ కట్టడం, ఇందుకు మంత్రి కేటీఆర్ స్వయంగా శంకుస్థాపన చేయడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.