చెరువే తెలంగాణ అస్తిత్వం

చెరువే తెలంగాణ అస్తిత్వం

గ్రామ స్వరాజ్యానికి చెరువే పునాది. ఇది మరిచి మన చెరువును మనమే చెరబట్టి ప్రకృతి ప్రకోపానికి బలవుతున్నాం.  హైదరాబాద్‌‌‌‌ నగర పరిధిలో చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ముందుకు సాగుతున్న హైడ్రా.. ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌, బఫర్​ జోన్​ పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగిస్తోంది. ఇప్పటికే భవనాలు కూల్చివేయడంతో పాటుగా..  అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపైనా క్రిమినల్​ కేసులు నమోదు చేయించింది హైడ్రా. ఇది చెరువుల పునరుద్ధరణకు తద్వారా వరదల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి  ఓ మంచి సందర్భం. ఎన్ని ఒత్తిళ్ళు ఎదురైనా మార్పు దిశగా రేవంత్ ప్రభుత్వం వేసిన ఓ సానుకూల ముందడుగు  ఇది.

  ఇది రాష్ట్ర రాజధానికే పరిమితం కాకుండా.. తెలంగాణ అంతా అమలుచేస్తే కాకతీయుల కాలంనాటి పరిస్థితులు మళ్లీ వస్తాయని చెప్పడంలో  అతిశయోక్తి లేదు. చెరువులను కాపాడుకోవడం, నాలాలను కబ్జాల బారినుంచి  కాపాడుకోవడంలో ప్రభుత్వాలతోపాటు ప్రజల బాధ్యత ఎంత? అనే దానిపై టీవీ నుంచి ఊరి రచ్చబండ వరకు చర్చ జరగాల్సిన కీలక సందర్భమిది. అదే సమయంలో ఈ చర్యల్లో భాగంగా నష్టపోయిన పేద ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వానిదే.


ఒకప్పుడు చెరువు నిండా నీళ్లు ఉన్నప్పుడు.. ఊరు ఆర్థికంగా శక్తిమంతంగా ఉండేది. చెరువు కింద పొలం సాగు చేసుకునే రైతులతోపాటు గ్రామంలోని అన్ని సామాజిక వర్గాలు దానిపై ఆధారపడి బతికేవారు. చెరువుల్లో కొర్రమట్ట, బొచ్చెలు, రవ్వలు, చందమామ, బంగారు తీగలు, ఇంగ్లీకం, బొమ్మెలాంటి తీరొక్క చేపలతో మత్స్య సంపద తులతూగేది.  కొంగలు, పుల్లకోడి, బుడుబుంగలు ఇలా ఎన్నో పశు పక్షులకు నివాస కేంద్రం చెరువు. ఎండాకాలంలో చెరువు ఎండిపోతే.. చెరువు పూడిక మట్టి కూడా పంట పొలాలను సారవంతం చేసే ఎరువులా ఉపయోగపడేది. చెరువుల్లో నీళ్లు ఉంటే.. చుట్టూ పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది.  చెరువుల విలువ వేల కోట్ల సంపద అని అనేక అధ్యయనాల్లో రుజువైంది. తమిళనాడులో స్టేట్​ వెట్ ల్యాండ్​ అథారిటీ దాదాపు 20 చోట్ల చెరువుల ఎకలాజికల్​ విలువను గణిస్తే  రూ.50 వేల కోట్లు అని తేలింది. 

ఇంపైన చోటు కంపుకొడుతోంది!

చెరువు కేవలం నీటి వనరు మాత్రమే కాదు.. ఒక సామాజిక జీవన విధానం కూడా. ఆక్రమణలు, అక్రమ కట్టడాలతో చెరువులు ఎప్పుడైతే దెబ్బతినడం మొదలైందో.. గ్రామాలూ అప్పుడే కళ తప్పాయి. ఇప్పుడు చెరువు అంటే.. గ్రామంలోని ఇండ్ల నుంచి వచ్చే మురుగునీరుకు ఆశ్రయం ఇచ్చే కుంట, రోజు వారీ చెత్తా చెదారం పోసే డంప్​ యార్డు. పలుకుబడి ఉన్న ప్రతి నేత కబ్జా చేసుకునే ఖాళీ స్థలాలుగా చెరువులు మారిపోయాయి. పార్టీలు మారుతున్నాయి,  ప్రభుత్వాలు మారుతున్నాయి.  కానీ,  అక్రమార్కుల చెర నుంచి చెరువులు వీడటం లేదు. 

కబ్జాలకు కారణాలేంటి?

చెరువుల కబ్జాకు అనేక కారణాలు ఉన్నాయి.  అధికార యంత్రాంగం ఉదాసీనత, చెరువుల సరిహద్దులు నిర్దేశించకపోవడం, పట్టణ, నగరాల సమీపంలో భూములకు భారీ డిమాండ్‌‌‌‌ ఉండటం, లీడర్లు తమ పలుకుబడిని వాడుకొని చెరువులను ఆక్రమించి తప్పుడు డాక్యుమెంట్లతో భూములను విక్రయించడం, రెవెన్యూ, నీటిపారుదల, పురపాలక శాఖల మధ్య సమన్వయ లోపం, చట్టంలోని లొసుగుల్ని కొందరు ఆసరాగా చేసుకోవడం, ఆక్రమణలు గుర్తించినా తొలగించకపోవడం, చెరువు మధ్యలో నిర్మించిన నివాసాలకూ విద్యుత్‌‌‌‌, నీటి వసతి కల్పించడం, కొంతమంది ప్రజాప్రతినిధులే  పలుచోట్ల చెరువుల్ని ఆక్రమించి వెంచర్లు వేయడం, వరదొచ్చి మునిగినప్పుడే తప్ప మిగతా సమయాల్లో అధికారులు ఆక్రమణలపై  దృష్టిసారించకపోవడం.. వంటి కారణాలు చెరువులను విధ్వంసం చేస్తున్నాయి.

ఆక్రమణలను కట్టడి చేయని మిషన్​ కాకతీయ 

చెరువుల రక్షణకు వాటి చుట్టూ కందకం తవ్వించి ఫెన్సింగ్, బోర్డులు ఏర్పాటు చేయాలని గతంలో హైకోర్టు ఆదేశించింది. కానీ అలాంటి చర్యలేమీ రాష్ట్రంలో జరగలేదు. గత ప్రభుత్వం చెరువుల పునరుద్దరణ పేరుతో పూడికతీత గట్లను బలోపేతం చేసే చర్యలు చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమం చెరువుల  కబ్జాలు, ఆక్రమణలను మాత్రం అరికట్టలేకపోగా పూడిక పేరుతో పలుకుబడి కలిగిన నేతల కబ్జాలకు మిషన్ కాకతీయ పథకం ఆసరాగా మారింది. రాష్ట్రంలోని మెజార్టీ గ్రామాల్లో చెరువుల, కుంటల శిఖం, ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ స్థలాలు అక్రమార్కుల చేతుల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల నిర్మాణాలు జరిగాయి. ఆదిలోనే వాటికి అడ్డుకట్ట వేయాల్సిన యంత్రాంగం ‘మాములు’గా తీసుకుంది. అక్రమార్కుల కబ్జాల పర్వంతో వర్షాకాలంలో ప్రజలు వరదలతో అవస్థలు ఎదుర్కొంటున్నారు. 

సమాజం బాధ్యతెంత?

తెలంగాణ చరిత్రలో  కాకతీయులది ఓ ప్రత్యేక యుగం. ఇందుకు కారణం.. ఊరికో పెద్ద చెరువు,  బడి,  గుడి ఉండాలని నిర్ణయించి పకడ్బందీగా అమలు చేసిన ఘనత కాకతీయులది. అంతటితో ఆగకుండా.. వర్షాలు ఎక్కువగా వచ్చినపుడు గ్రామాల్లోకి నీరు రాకుండా.. ఒక చెరువులోని నీరు మరో చెరువుకు వెళ్లేలా.. గొలుసుకట్టు చెరువుల నిర్మాణం చేసింది .. కాకతీయుల పాలనాదక్షతకు నిదర్శనం. వారు నిర్మించిన రామప్పలాంటి చెరువులు నేటికీ ఎంతో విలువైనవి.  గ్రామీణ జీవితానికి చెరువే ఆధారం.  చెరువుల పునర్నిర్మాణం అన్నది మహాసంకల్పం.  దీన్ని కేవలం ప్రభుత్వ పనిగా చూడకుండా పౌర సమాజం కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి. 

ఊరు రుణం కోసమైనా..

చెరువుల పునర్నిర్మాణం చేయడం అంటే మన ఊరిని మనం బాగు చేసుకోవడమే. కన్నతల్లిలా ఊరును పెంచి పెద్ద చేసిన చెరువుకు తన బిడ్డలే సేవ చేసే మహత్తర అవకాశం అపురూపమైనది.  గ్రామ స్వరాజ్యం విలసిల్లాలంటే చెరువే పునాది. మన చెరువుల్ని సచ్చుపడేటట్లు చేసుకున్నాకే.. ఊరి ఆత్మ తల్లడిల్లుతోంది.  తెలంగాణ గ్రామీణ జీవనం మళ్లీ  కళకళలాడాలంటే ఆ చెరువును బతికించుకోవడం ఒక్కటే మన ముందున్న  ప్రత్యామ్నాయం. అందుకే చెరువులు బాగుండాలి, పల్లెలు పచ్చగా ఉండాలి, ఇందుకు ప్రభుత్వాలతోపాటు.. మనమంతా బాధ్యతగా చొరవ తీసుకోవాలి.

ఊరికో వ్యవస్థ ఉండాలి

చెరువులు, కుంటలతో నిత్యకల్యాణం పచ్చతోరణంగా కనిపించే గ్రామాలు కూడా ఎండాకాలం వస్తే నీటిచుక్క కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి తలెత్తింది. కుంచించుకుపోయిన, ఆక్రమణలకు గురైన, కబ్జాల చెరలో ఉన్న చెరువులను పునరుద్ధరించడానికి హైడ్రా తరహాలో ఒక వ్యవస్థ  గ్రామీణ స్థాయిలోనూ అవసరముంది. పెద్ద చెరువుల నుంచి మొదలు చిన్న కుంటలు, చెరువులు అన్నీ కలుపుకొని రాష్ట్రంలో 46,531 నీటి వనరులు ఉన్నాయని సర్కారీ లెక్కలు చెబుతున్నాయి. ఈ చెరువుల పునరుజ్జీవనానికి హైడ్రా లాంటి వ్యవస్థ ఏర్పాటు చేయాలి. చెరువులు, కుంటలు, నదులు, ఇతర నీటి కాలువలు వంటి వాటర్ బాడీస్ పరిరక్షించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని జాతీయ హరిత ట్రైబ్యునల్‌‌‌‌(ఎన్జీటీ) సహా భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా పలు సందర్భాల్లో స్పష్టం చేశాయి.

ఆక్రమణలతో ఆగమాగం

నగరాలు, పట్టణాల్లోనూ ఈ పరిస్థితి రావడానికి సమాజం పాత్ర ఎంత అనే చర్చ జరగాలి. చెరువులు, కందకాలున్న ప్రాంతాలను కబ్జాచేసి అమ్మే ప్లాట్లను కొనకపోవడమే ఉత్తమం. దీనికి తోడు నాలాలు, కాలువల కబ్జా కారణంగా వచ్చే నష్టాలను చూసిన తర్వాతైనా మారడం అవసరం. కబ్జాల గురించి ప్రభుత్వాలకు గుర్తుచేయాల్సిన బాధ్యత మనదే. భారీ వర్షాలతో ఇంట్లో నిండిపోయిన బురదను తొలగించేందుకు వారికయ్యే ఖర్చు, ఆ ఆవేదన,  నష్టపోయిన వస్తువుల విలువ ఏంటనేది.. బాధితులకు మాత్రమే తెలుసు. ఇలాంటి సమస్యలను మనం ‘కొని’ తెచ్చుకోవడం అవసరమా?

- పరమేశ్వర్ నాగిరెడ్డిపల్లి