- రిపేర్ పనులు పూర్తిచేస్తామని రెండేండ్ల కిందట వరదల సమయంలో కేటీఆర్ హమీ
- సగానికి పైగా వాటిలో కనీసం ఎఫ్టీఎల్ హద్దులను గుర్తించని అధికారులు
హైదరాబాద్, వెలుగు : భారీ వర్షాలు కురుస్తుండటంతో గ్రేటర్‌లోని చెరువులు నిండాయి. చాలా ఏరియాల్లో బ్యాక్ వాటర్‌తో కాలనీలు నీట మునిగాయి. నీరు బయటకు వెళ్లేందుకు అలుగులు, తూములు సరిగా లేకపోవడం, కొన్నిచోట్ల కాలువలు పూర్తిగా కనుమరుగు కావడంతో కాలనీలు, ఇండ్లలోకి నీరు వచ్చి చేరింది. మళ్లీ వర్షాలు కురిస్తే పొంగిపొర్లడం ఖాయమని స్థానికులు చెబుతున్నారు. చెరువుల నిర్వహణను జీహెచ్ఎంసీ అసలు పట్టించుకోవడంలేదు. రెండేండ్ల కిందట గ్రేటర్లో కురిసిన అతి భారీ వర్షాల సమయంలో చెరువులు పొంగడంతోనే అనేక కాలనీలు నీట మునిగాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఏర్పడింది. ఎఫ్ టీఎల్(ఫుల్ వాటర్ ట్యాంక్ లెవెల్)కు రెండు, మూడు ఫీట్ల నీటిని మెయింటెన్ చేస్తామని, వాటి హద్దులను గుర్తించి ఫెన్సింగ్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్పినప్పటికీ అలా జరగడం లేదు. అవసరమైన చోట మోటార్లను ఏర్పాటు చేస్తామనప్పటికీ ఆ విషయాన్ని కూడా పట్టించుకోవడం లేదు. హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో లేక్ ప్రొటెక్షన్ కమిటీ అన్నిచెరువుల ఎఫ్ టీఎల్ పై సర్వే చేసింది. గ్రేటర్లో మొత్తం 185 చెరువులు ఉండగా, ఇందులో157 చెరువుల ఎఫ్ టీఎల్ హద్దులను గుర్తించేందుకు నోటిఫికేషన్ వేశారు. కానీ ఇందులో 52 చెరువులకు సంబంధించి మాత్రమే ఫైనల్ నోటిఫికేషన్ పూర్తయ్యింది. ఫైనల్అయిన చెరువులకు మత్రమే అధికారులు ఫెన్సింగ్ఏర్పాటు చేశారు. మిగతా చెరువులకు ఫెన్సింగ్ఏర్పాటు చేసేందుకు స్థానికుల నుంచి అభ్యంతరాలు వచ్చాయంటూ వదిలిపెట్టారు.
రూ.481 కోట్లు ఖర్చు
గ్రేటర్లో ఉన్న చెరువుల చుట్టూ కంచె ఏర్పాటు, మురుగునీటి మళ్లింపు, వాకింగ్ ట్రాక్, ఎలక్ట్రికల్ లైటింగ్, తదితర ప్రజా సౌకర్యాల పనుల కోసం జీహెచ్ఎంసీ ఇప్పటికే రూ.481 కోట్లు ఖర్చు చేసింది. ఇందులో గతేడాది అత్యవసర రిపేర్ల కోసం రూ.9.42 కోట్లు, అలాగే మరో రూ.94.17 కోట్లతో 63 చెరువుల వద్ద వివిధ పనులు చేపట్టింది. రూ.282 కోట్ల మిషన్ కాకతీయ నిధులతో 19 చెరువుల వద్ద పనులు చేపట్టారు. ఇటీవల రూ.95.54 కోట్లతో 61 చెరువులకు వెళ్లే రోడ్డు మార్గాలను బాగు చేసేందుకు బల్దియా ఖర్చు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఇలా వందలాది కోట్లు ఖర్చు పెడుతున్న కూడా పరిస్థితి మాత్రం మారడం లేదు. ప్రధాన రహదారులపై ఉన్న ఒకటి, రెండు మినహా ఏ చెరువుకు వెళ్లినా సరైన ఫెసిలిటీస్ కనిపించడం లేదని స్థానికులు చెప్తున్నారు. తమ ప్రాంతంలోని చెరువులను కాపాడాలంటూ బల్దియాకు రెగ్యులర్‌గా కంప్లయింట్లు వస్తున్నాయి.
ఎఫ్టీఎల్ గుర్తించడంలోనూ ఆలస్యమే..
157 చెరువులకు సంబంధించి నోటిఫికేషన్ వేయగా ఇందులో 52 చెరువుల నోటిఫికేషన్ ఫైనల్అయ్యింది. మిగతా 105 చెరువులకు సంబంధించి అభ్యంతరాలు వచ్చాయి. దీంతో ఆ చెరువుల ఎఫ్టీఎల్ హద్దుల ఫైనల్ ప్రక్రియ కొనసాగుతుందని, తమవే భూములంటూ కొందరి నుంచి అభ్యతంరాలు వస్తుండగా కొన్నిచోట్ల ఇప్పటికే నిర్మాణాలు పూర్తిచేసినవి కూడా ఉన్నాయి. దీంతో అధికారులు మిగతా 105 చెరువులకు సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. 2020 అక్టోబర్ లో వరదలతో నగరం విలవిలలాడింది. 500కుపైగా కాలనీలు మూడు వారాలపాటు ముంపులో చిక్కుకుని జనం ఇబ్బందులు పడ్డారు.
ప్రత్యేక కమిషనర్ ఒట్టిమాటేనా?
ప్రభుత్వ నిర్లక్ష్యంతో గ్రేటర్ పరిధిలో ఇప్పటికే 200 చెరువుల లెక్కదొరకని పరిస్థితి నెలకొందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చెరువుల అభివృద్ధి, పరిరక్షణకు బల్దియాలో ఓ స్పెషల్ కమిషనర్‌ను నియమిస్తామని 2020 సెప్టెంబర్ నెలలో మంత్రి కేటీఆర్
ప్రకటించినప్పటికీ నేటికీ ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదు.
మరో రెండ్రోజులు వానలు
సిటీలో మరో రెండ్రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. శనివారం గచ్చిబౌలి, లింగంపల్లి, హెచ్‌సీ యూ, మాదాపూర్, హఫీజ్ పేట ప్రాంతాల్లో వర్షం పడింది. అత్యధికంగా ఆర్సీపురంలో 4.3 సె.మీల వాన కురిసింది.
ఇటీవల కురిసిన వానలకు చెరువులు నిండి మునిగిన కాలనీలు ఇవే..
* సూరారం పెద్ద చెరువుకు రెండు కాలువలు ఉండగా.. ఒక కాలువ పూర్తిగా కనుమరుగైంది. చుట్టు పక్కల కాలనీల్లోకి నీళ్లు వచ్చాయి.
* బండ్లగూడ చెరువు నిండటంతో బ్యాక్ వాటర్‌తో అయ్యప్ప కాలనీ మళ్లీ నీట మునిగింది.
* గగన్ పహాడ్‌లోని మామిడి కుంట చెరువు నిండటంతో చుట్టు పక్కల పరిశ్రమలకు నీరు చేరింది. కరకట్ట ద్వారా నీటిని బయటకు పంపారు.
అవసరమైన చోట రిపేర్లు చేశాం
అవసరైన చోట చెరువులకు రిపేర్లు చేశాం. చెరువుల్లో నీటిని మెయింటెన్ చేస్తూ జనాలకు ఇబ్బంది లేకుండా అన్ని పనులు పూర్తి చేస్తాం.
- సురేశ్, చీఫ్ ఇంజనీర్, జీహెచ్ఎంసీ