- ఆక్రమణకు గురైన గోపాలపూర్ఊర చెరువు
- 23 ఎకరాలకు మిగిలింది పదే!
- రూ.వంద కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం
- తాజాగా ఎఫ్టీఎల్ పరిధిలోనే మరోసారి నాలా కన్వర్షన్
- స్థానికులు ఫిర్యాదు చేసినా పట్టించుకోని ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు : కాకతీయులు ఓరుగల్లులో నిర్మించిన గొలుసుకట్టు చెరువుల్లో మరొకటి కనుమరుగు కానుందా అంటే అవుననే సంకేతాలే కనిపిస్తున్నాయి. గ్రేటర్ వరంగల్ చుట్టూ కాకతీయులు నిర్మించిన చెరువుల్లో దాదాపు 42 ఇదివరకే కనుమరుగయ్యాయి. ఇప్పుడు సిటీ మధ్యలోని గోపాలపూర్ఊర చెరువు వంతు వచ్చింది. ఇప్పటికే ఈ చెరువు సగం వరకు అన్యాక్రాంతమైంది. తాజాగా మరో బాగోతం బయటకు వచ్చింది. చెరువు మధ్యలో ఉన్న కొంత భూమిని నాలా కన్వర్షన్ చేసిన విషయం వెలుగుచూసింది. ఓ ప్రజాప్రతినిధి అండతో ఆఫీసర్లకు లంచమిచ్చి కొందరు అక్రమార్కులు నాలా కన్వర్షన్ చేయించారనే ఆరోపణలున్నాయి. కాగా సిటీలోని ఇక్కడి భూమికి విపరీతమైన డిమాండ్ ఉండడంతో అధికార పార్టీకి చెందిన ఓ నేత ఈ చెరువును పూర్తిగా ప్లాట్లుగా మార్చే ప్రయత్నాలు చేస్తునారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ చెరువు బ్యూటిఫికేషన్ కు అడుగులు పడడంలేదు.
చెరువుకు హద్దులను నిర్ణయించకపోవడంతోనే..
కాకతీయులు ఓరుగల్లు సిటీ పరిధిలోని మడికొండ, సోమిడి, వడ్డేపల్లి నుంచి గోపాలపూర్, గోపాలపూర్ ఊరచెరువు, సమ్మయ్య నగర్సౌడు చెరువు ఇలా నాగారం అవతలి వరకు గొలుసుకట్టుగా ఉండేవి. వీటిలో ఇప్పటికే సమ్మయ్యనగర్ సౌడు చెరువు కనుమరుగైందని నిపుణులు చెబుతుండగా దానికి పైనున్న గోపాలపూర్ఊర చెరువుకు కూడా అదే ముప్పు పొంచి ఉంది.1954 సేత్వార్రికార్డ్ప్రకారం ఈ చెరువు సర్వే నంబర్ 89లో దాదాపు 23.10 ఎకరాల భూమి ఉండేది. ప్రస్తుత రికార్డుల ప్రకారం 20.01 ఎకరాలు ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ చెరువుకు హద్దులను నిర్ణయించకపోవడంతో సగం భూమి అన్యాక్రాంతమైంది. చుట్టుపక్కల కాలనీలు పుట్టుకొచ్చాయి. గజం విలువ రూ.25నుంచి రూ.30వేల వరకు పలుకుతుండగా ఇప్పటికే పదెకరాలకుపైగా కబ్జాకు గురైనట్లు తెలుస్తోంది. ఈ లెక్కన రూ.100 కోట్లకుపైగా విలువైన భూమి కబ్జాకు గురైనట్లు స్పష్టమవుతోంది.
ఎవరికి నచ్చినట్లు వారి హామీలు..
కేయూ–-ఫాతిమానగర్ మార్గంలో వంద ఫీట్ల రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ చెరువును డెవలప్చేయాలని స్థానికులు ముప్పయేళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఒక్కో లీడర్ఒక్కో రకంగా అభివృద్ధి చేస్తామని హామీలిచ్చి శిలాఫలకాలు వేశారు. కానీ ఆచరణలో మాత్రం పెట్టలేదు. ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఉమ్మడి రాష్ట్రంలో వర్ధన్నపేట ఎమ్మెల్యేగా, ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఉమ్మడి ఏపీలో సాంఘిక సంక్షేమశాఖ మంత్రిగా1998లో ‘సరోవర విహార మాలిక’గా డెవలప్చేస్తామన్నారు. అనంతరం గ్రేటర్కమిషనర్ గా నీతూకుమారి ప్రసాద్ శిల్పారామంగా డెవలప్ చేస్తామని హామీ ఇచ్చారు. అవేవి పట్టాలెక్కలేదు. తెలంగాణ ఏర్పడ్డాక వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్మినీ ట్యాంక్ బండ్ చేస్తామన్నారు. 2021 ఫిబ్రవరి 6న గోపాలపూర్ఊరచెరువు మినీ ట్యాంక్‌బండ్ బ్యూటిఫికేషన్ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.వందల కోట్ల విలువైన ఇక్కడి భూములపై అధికార పార్టీకి చెందిన కొందరు కన్నేసినట్లు తెలిసింది. ఓ నేత అండతో చెరువును కనుమరుగు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చెరువు మధ్యలోనే నిర్మాణాలు..
సర్వే నంబర్ 89లో ఉన్న చెరువు మధ్యలో కొంతమంది అక్రమార్కులు తప్పుడు పత్రాలతో కబ్జాలకు పాల్పడుతున్నారని గోపాలపూర్ ఊర చెరువు పరిరక్షణ సమితి సభ్యులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి సర్వే నంబర్ 89లో ఆఫీసర్ల లెక్కల ప్రకారం 20.01 ఎకరాలు ఉన్నా.. సర్వే నంబర్90లోని ప్రభుత్వ భూమికి కొందరు తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించినట్లు తెలిసింది. తర్వాత నాలా కన్వర్షన్ తీసుకుని, చెరువు శిఖం భూమిలో కన్స్ట్రక్షన్స్చేపట్టారు. స్థానికులు గత నెలలో కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశారు. అయినా ఇంతవరకు యాక్షన్లేదు.
భూములు కబ్జా అయినయి...
రూ.కోట్ల విలువైన గోపాలపూర్ ఊర చెరువు భూములు కబ్జా అయినయి. కబ్జాలను అరికట్టి, చెరువును డెవలప్ చేయాల్సిందిగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు విన్నవించాం. అయినా ఇంత వరకు ఏ యాక్షన్ లేదు. ఇకనైనా సర్వే చేసి, హద్దులు నిర్ణయించి చెరువు బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలి.
- తుపాకుల దశరథం, గోపాలపూర్చెరువు పరిరక్షణ సమితి అధ్యక్షుడు
కొన్నేండ్లుగా కొట్లాడుతున్నం..
సిటీ మధ్యలో ఉన్న చెరువు మొత్తం కబ్జాకు గురవుతోందని చాలాసార్లు ఫిర్యాదు చేసినం. కొన్నేండ్లుగా చెరువును పరిరక్షించాల్సిందిగా కొట్లాడుతూనే ఉన్నం. చెరువు ఆక్రమణతోనే చుట్టుపక్కల కాలనీలు మునుగుతున్నయ్. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.
- నల్లాని శ్రీనివాస్, స్థానికుడు