ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా జైలుకు వెళ్తే..కవిత ఎందుకు వెళ్లలేదు..?

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపు సభలో మాజీ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి చేరుతారని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు ఠాక్రే ప్రకటించారు.  సీఎల్పీ నేత భట్టి పాదయాత్ర ముగింపు సభలో ఆయన్ను రాహుల్ గాంధీ ఘనంగా సన్మానం చేస్తారని వెల్లడించారు. జూన్ 28 బుధవారం కోదాడ నియోజకవర్గం మామిల్లగూడెంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో ఠాక్రే సమావేశమయ్యారు. 

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేశారని మాణిక్ రావు ఠాక్రే అన్నారు. భట్టి చేపట్టిన పాదయాత్రకు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు. కాంగ్రెస్ భావజాలాన్ని అన్ని వర్గాల్లోకి భట్టి తన పాదయాత్ర ద్వారా తీసుకువెళ్లడంలో విజయవంతమయ్యారని ప్రశంసించారు. మార్చి 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో మొదలైన పాదయాత్ర 105 రోజుల్లో 36 నియోజకవర్గాలు, 600 గ్రామాలకు పైగా చుట్టేసి 1221 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నదని వివరించారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హాథ్ సే హాథ్ జోడో యాత్ర, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క భగభగ మండే ఎర్రటి ఎండలను సైతం లెక్కచేయకుండా పాదయాత్రను చేశారని తెలిపారు. ఈ యాత్రలు కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవానికి దోహదపడతాయని పేర్కొన్నారు.

ఆదిలాబాద్ నుంచి కోదాడ వరకు కొనసాగిన పాదయాత్రలో ఏఐసీసీ, పీసీసీ నాయకులు పాల్గొన్నారని ఠాక్రే వెల్లడించారు. మరో మూడు రోజుల్లో పాదయాత్ర ముగియనున్న నేపథ్యంలో ఖమ్మంలో జూలై 02న నిర్వహించే తెలంగాణ జనగర్జన సభ ఏర్పాట్లు, పాదయాత్ర ముగింపు నిర్వహణను పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ దగ్గరుండి కోఆర్డినేషన్ చేస్తారని చెప్పారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ఖమ్మంలోకి ప్రవేశించగానే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన కార్యకర్తలు ఎదురొచ్చి ఘనంగా స్వాగతం పలుకుతారని చెప్పారు. 

ప్రజల బాగుకోసం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణలో సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడింది కానీ.. జనం  మాత్రం బాగుపడలేదని మాణిక్ రావు ఠాక్రే  విమర్శించారు. ప్రజల సంపదను కేసీఆర్ లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మహారాష్ట్రకు 600 వాహనాలతో వెళ్లడం వెనక దాగివున్న ఉద్దేశం ఏంటి అని కేసీఆర్ ను ప్రశ్నించారు. వేల కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి కేసీఆర్ కు ఎవరు ఇస్తున్నారని  నిలదీశారు. కేసీఆర్ ఖర్చు పెడుతున్న ప్రతి పైసా ప్రజలది కాదా అని అన్నారు. 

వచ్చే ఎన్నికల్లో బీజేపీకి లాభం చేకూర్చే విధంగా కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. లిక్కర్ స్కాంలో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇప్పటికి జైల్లోనే ఉన్నారని, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను సైతం విచారణ చేశారని గుర్తు చేశారు.  అదే స్కాంలో నిందితురాలుగా ఉన్న కేసీఆర్ కుమార్తె కవితను ఇవ్వాలో, రేపు అరెస్టు చేస్తామని హడావిడి చేసిన దర్యాప్తు సంస్థలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయిని ప్రశ్నించారు. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, కేసీఆర్ కూతురు కవిత ఇద్దరు ఒక కేసులో నిందితులైనప్పుడు కవితను ఎందుకు అరెస్టు చేయడం లేదో ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ తొమ్మిదిన్నర సంవత్సరాలలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకుండా మోసం చేశారని మండిపడ్డారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయలేదని అన్నారు. ఎన్నికల హామీలను విస్మరించిన కేసీఆర్ ను ప్రజలు నమ్మడం లేదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ఠాక్రే వెల్లడించారు.