3వేల మందితో పొంగులేటి మీటింగ్..ఖమ్మంలో టెన్షన్

ఖమ్మం జిల్లా రాజకీయాలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. ఇవాళ్టి నుంచి ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి నిర్వహించనున్న ఆత్మీయ సమ్మేళనాలపై అందరి దృష్టి నెలకొంది. పినపాకలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంతో ఆయన కార్యకర్తలు, అభిమానులతో సమావేశం కానున్నారు. పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో 3 వేల మందితో ఈ మీటింగ్ నిర్వహిస్తున్నారు. సమావేశంలో పొంగులేటి ఏం మాట్లాడతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. 

వాస్తవానికి పొంగులేటి శ్రీనివాస రెడ్డి బీజేపీలోకి వెళ్లనున్నారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్లుగానే బీఆర్ఎస్ జెండాలు, ఫ్లెక్సీలు లేకుండా ఆయన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్లలో పార్టీ దక్కిన గౌరవమేంటి.. ముందు ముందు ఎలాంటి గౌరవం దక్కుతుందని పొంగులేటి అసంతృప్తి వ్యక్తం చేసిన నాటి నుంచి ఆయన పార్టీకి కొంత దూరంగానే ఉంటున్నారు.  ఇదే సమయంలో తన వెంట ఉన్న ఏడుగురు నాయకులకు టికెట్లు ఇప్పస్తానని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో పొంగులేటి ఎలాంటి నిర్ణయంతీసుకుంటారన్నది ఖమ్మం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇదిలా ఉంటే పొంగులేటి దూరమవుతున్న సమయంలో బీఆర్ఎస్ హైకమాండ్  మాజీ మంత్రి తుమ్మలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సోమవారం జరిగిన ఖమ్మం జిల్లా నేతల సమావేశంలో పార్టీని వీడే వారిని వీడనివ్వండి, ఉన్నవారిని కాపాడుకుంటామంటూ సీఎం కేసీఆర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నారు. ఖమ్మంలో అన్ని సీట్లు గెలుస్తామని ధీమాతో ఉన్న ముఖ్యమంత్రి ఈ నెల 18న నిర్వహించనున్న బీఆర్ఎస్ సభతో తమ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద ఖమ్మం జిల్లాలో జరుగుతున్న రాజకీయపరిణామాలపై మరో వారం పది రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశముంది.