ఖమ్మం, వెలుగు : పదేళ్లలో దోచుకున్న రూ.లక్ష కోట్లతో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. రేవంత్ రెడ్డిని, తనను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డుతున్నాడని, ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేకు రూ.200 కోట్లు పంపించారన్నారు. తిరుమలాయపాలెం మండలంలోని పలుగ్రామాల్లో మంగళవారం పొంగులేటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ‘బీఆర్ఎస్ పంపిణీ చేస్తున్న డబ్బులు మీవే. మీ దగ్గర దోచుకున్న డబ్బుల్లోనే కొంత తిరిగి మీకు ఇస్తున్నారు. వాటిని తీసుకుని మీ మనస్సులో ఉన్న హస్తం గుర్తుకు ఓటేయండి’ అని పొంగులేటి కోరారు.
పదవులు ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉన్న శీనన్న కావాలా, పదవి ఉండి కూడా ఏమీ చేయలేని వారు కావాలా మీరే నిర్ణయించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ రాజ్యంతోనే అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. కొంతమంది నాయకులు తిరుమలాయపాలెం మండలాన్ని దత్తత తీసుకోవాలని కోరుతున్నారని, కానీ అందరికీ మాట ఇస్తున్నా ఒక్క తిరుమలాయపాలమే కాదు పాలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలను దత్తతగా తీసుకుని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తానని హామీ ఇచ్చారు. అంతకు ముందు పొంగులేటి సమక్షంలో జనసేన పార్టీ పాలేరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ సురభి సూరజ్ కిరణ్తో పాటు జనసేన కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు.
ఇక పొంగులేటి ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కూసుమంచి మండల బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు ఇంటూరి నారాయణ కాంగ్రెస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, మద్దినేని బేబి స్వర్ణకుమారి, మద్ది శ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ బెల్లం శ్రీను, ఎంపీపీ మంగీలాల్, రామసహాయం నరేశ్ రెడ్డి పాల్గొన్నారు.