ప్రజల వద్దకే పాలన తెచ్చాం : పొంగులేటి

  •     గత సీఎంను కలవడానికి మంత్రులకే దిక్కులేదు  
  •     తుమ్మలతో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ఖమ్మం, వెలుగు :  రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలనను ప్రజల వద్దకు తీసుకొచ్చామని రెవెన్యూ, హౌజింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులకే దిక్కులేదని, ఇక సామాన్యులు కలిసే అవకాశం ఎక్కడ అని ఎద్దేవా చేశారు.

బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పొంగులేటి ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ పేద ప్రజల కష్టాలు తీర్చేలా ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.- అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

తమ ప్రభుత్వం వచ్చాక మూడు నెలల్లోనే 31 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెప్పారు. గత ప్రభుత్వ వైఫల్యంతో టీఎస్పీఎస్సీ ద్వారా నియమించాల్సిన 2 లక్షల ఉద్యోగాలు పేరుకుపోయి ఉన్నాయన్నారు. 2008 డీఎస్సీలో అర్హులైన వారికి గత ప్రభుత్వం మొండి చేయి చూపిందని, వారందరికీ అతి త్వరలో ఆర్డర్ ఇవ్వబోతున్నామని చెప్పారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మం నగరానికి వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా పాలేరు రిజర్వాయర్ నుంచి నీటి సరఫరా చేయనునట్లు తెలిపారు.

సాగర్ లో నీళ్లు లేనందున కర్నాటక నుంచి నీటి విడుదల కు సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ఖమ్మంలో ప్రభుత్వ భూములు పరిరక్షణ కు అధికారులకు ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆక్రమణకు గురైన వక్ఫ్ భూదాన్ భూములు స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెనుకబడిన కులాలు సమగ్ర అభివృద్ధి చెందాలనే కార్పొరేషన్ ల ఏర్పాటు చేశామని తెలిపారు. భద్రాద్రి శ్రీ రామచంద్రుని ఆశీస్సులుతో 40 ఏళ్లుగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం దక్కిందన్నారు.

అంతకుముందు ఖమ్మంలో రూ. 2.80 కోట్లతో నిర్మించనున్న గ్రంథాలయ భవనం, రూ. 55 కోట్ల ఖర్చుతో ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం వద్ద ఆర్ అండ్ బీ రోడ్ల విస్తరణ పనులకు, రూ.17 కోట్లతో ఖమ్మం నుంచి పాపటపల్లి రోడ్ల విస్తరణ పనులకు, జూబ్లీపుర పాత డీఈవో ఆఫీసులో రూ. 1.43 కోట్లతో నిర్మించనున్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.  

ఖమ్మం అర్బన్ మండలం బల్లెపల్లి, రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం గ్రామంలో ప్రభుత్వ వైద్య కళాశాల శాశ్వత భవనాల నిర్మాణం కోసం గుర్తించిన స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. తిరుమలాయపాలెం మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రులు పంపిణీ చేశారు. 
 
జలగంనగర్ స్కూల్ మోడల్​గా మారుస్తాం

ఖమ్మం రూరల్ : జలగంనగర్​ ప్రభుత్వ పాఠశాలను మోడల్​ స్కూల్​గా మారుస్తామని మంత్రులు పొంగులేటి, తుమ్మల తెలిపారు. బుధవారం స్కూల్​లో జరిగిన వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశానికివారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.