ఖమ్మం, వెలుగు: వైరా నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. పార్టీ మారే ఆలోచనలో ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆత్మీయ సమావేశాల్లో భాగంగా రేపు వైరాలో మీటింగ్ ను ఏర్పాటు చేశారు. దీన్ని సక్సెస్ చేసి బల నిరూపణ చేయాలని పొంగులేటి వర్గం భావిస్తుండగా, పార్టీ కేడర్ జారి పోకుండా బీఆర్ఎస్ నేతలు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నాయకులకు, కార్యకర్తలకు పార్టీలో ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తూ మోటివేట్ చేస్తున్నారు. ఇప్పటికే వైరా నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని ఎమ్మెల్యే రాములు నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించగా, దానికి మంత్రి పువ్వాడ అజయ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ అటెండయ్యారు. ఇక పొంగులేటి వర్గం లీడర్లు వైరాలో బైక్ ర్యాలీ నిర్వహించగా, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీ నాయకులతో మీటింగ్స్ పెడుతున్నారు. ఎవరికి వారు వ్యూహ, ప్రతివ్యూహాల్లో మునగడంతో జిల్లాలో ఇప్పుడు వైరా పాలిటిక్స్ చర్చనీయాంశంగా మారాయి.
వారం రోజులుగా..
వారం రోజులుగా వైరాలో పాలిటిక్స్ రసవత్తరంగా మారాయి. ఆత్మీయ సమావేశానికి సంబంధించి పొంగులేటి వర్గం డేట్ ఫిక్స్ చేయగానే, బీఆర్ఎస్ అలర్ట్ అయింది. పొంగులేటి వెంట తిరుగుతున్న నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్ సహా పలువురు నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న 25 మందిపై చర్యలు తీసుకుంది. తన అనుచరులను కాదు, దమ్ముంటే తనను సస్పెండ్ చేయండి అంటూ పొంగులేటి సవాల్ చేయగా, దమ్ముంటే పార్టీ నుంచి బయటకు వెళ్లి మాట్లాడాలని మంత్రి అజయ్ కౌంటర్ వేశారు. మున్సిపల్ చైర్మన్ పొంగులేటి వర్గంలోకి వెళ్లడంతో ఆయన్ను పదవి నుంచి తప్పించడంపై బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. అవిశ్వాసం పెడితే ఎలా ఉంటుందని ఆలోచిస్తూనే, ఆయనే రాజీనామా చేసి వెళ్లాలని ఒత్తిడి తెస్తోంది. పార్టీ కౌన్సిలర్లు ప్రత్యర్థి వర్గంలోకి వెళ్లకుండా వాళ్లతో టచ్ లో ఉంటోంది.
పొంగులేటి పట్టు..
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో తాను అనుకున్న వాళ్లను గెలిపించడం ద్వారా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పట్టు సాధించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ఎంపీగా పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గెలవగా, అదే సమయంలో పార్టీ తరపున గెలిపించుకున్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో మదన్‌లాల్ కూడా ఒకరు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో మదన్‌లాల్ ముందుగానే అప్పటి టీఆర్ఎస్ లో చేరగా, ఆ తర్వాత పొంగులేటి కూడా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తాను గెలిపిస్తే, తనకంటే ముందుగానే పార్టీ మారారన్న కోపంతోనే 2018 ఎన్నికల్లో మదన్ లాల్ ను పొంగులేటి టార్గెట్ చేశారన్న ప్రచారముంది. అప్పటి ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీచేసిన రాములు నాయక్‌కు అన్ని విధాలుగా పొంగులేటి సపోర్ట్ చేసి, పట్టుబట్టి మదన్‌లాల్ ను ఓడించారు. తర్వాత రాములు నాయక్‌ను సీఎం కేసీఆర్ దగ్గరకు తీసుకెళ్లి బీఆర్ఎస్ లో చేర్పించారు. తర్వాత మూడేండ్లు నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులన్నీ పొంగులేటి వర్గానికి కేటాయించారు. గతేడాది నుంచి క్రమంగా పొంగులేటి వర్గానికి రాములు నాయక్ దూరమయ్యారు. పార్టీ మారే ఆలోచనలో ఉన్న మాజీ ఎంపీని కాదని, బీఆర్ఎస్లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో సీపీఐ తరపున వైరా నుంచి పోటీ చేసిన బానోత్ విజయాబాయి రీసెంట్ గా పొంగులేటి వర్గంలో చేరగా, ఆమెను వచ్చే ఎన్నికల్లో తమ అభ్యర్థిగా ప్రకటించారు.
కౌన్సిలర్లకు బంపర్ ఆఫర్..
పార్టీ హైకమాండ్ నుంచి సపోర్ట్ ఉండడంతో ఎమ్మెల్యే రాములు నాయక్ మున్సిపాలిటీ చేజారకుండా ప్లాన్ చేస్తున్నారు. పొంగులేటి క్యాంప్‌లోకి మున్సిపల్ చైర్మన్ జైపాల్ వెళ్లినా, ఇతర కౌన్సిలర్లు వెళ్లకుండా చూసుకుంటున్నారు. దీంతో ఇదే అదనుగా తాము ఎన్నికల ఖర్చులు కూడా సంపాదించుకోలేదని కొందరు కౌన్సిలర్లు పార్టీ ముఖ్యుల దృష్టికి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. తాము పార్టీలోనే కంటిన్యూ కావాలంటే, కనీసం రూ.50 నుంచి రూ.60 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం. వైరా మున్సిపాలిటీలో 20 మంది కౌన్సిలర్లు ఉండగా, చైర్మన్, ఇద్దరు కాంగ్రెస్ సభ్యులను మినహాయిస్తే మిగిలిన 17 మంది బీఆర్ఎస్లోనే ఉన్నారు. ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సమావేశం సందర్భంగా సీఎం కేసీఆర్ వైరా మున్సిపాలిటీకి రూ.30 కోట్ల నిధులు ఇస్తున్నట్లు ప్రకటించారు. వీటి పనులను పూర్తిగా కౌన్సిలర్లకే ఇస్తామని, ఒక్కొక్కరికి కనీసం రూ.కోటిన్నర వర్క్స్ వస్తాయంటూ పార్టీ లీడర్లు నచ్చజెబుతున్నట్టు సమాచారం. తాజాగా వైరా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో పార్టీ కౌన్సిలర్లతో ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు, రాష్ట్ర ఇన్‌కం ట్యాక్స్ కమిషనర్ జీవన్‌లాల్ రహస్యంగా సమావేశమైనట్టు సమాచారం. ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి, వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంటూ పార్టీలోనే ఉండేలా కన్విన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఒక రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారిగా ఉండి, పార్టీ కార్యక్రమాల్లో జీవన్‌లాల్ జోక్యం చేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.