-
డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థను బలోపేతం చేస్తం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో విపత్తులు సంభవించినప్పుడు వాటిని తట్టుకుని ప్రాణ నష్టం, ఆస్తి నష్టం తగ్గించడానికి, ఆకస్మికంగా ఎదురయ్యే పరిస్థితులను సైతం ఎదుర్కొనేలా విపత్తుల నిర్వహణ వ్యవస్థను (డిజాస్టర్ మేనేజ్మెంట్) బలోపేతం చేస్తున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. గురువారం నాడు సచివాలయంలోని వరద కార్యాచరణ ప్రణాళికపై మంత్రి పొంగులేటి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పదేండ్ల తర్వాత తొలిసారి గా వరదలపై యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నామని తెలిపారు. వరదలతో సంబంధం ఉన్న ప్రతి విభాగం రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకోవాలని అధికారులను ఆదేశించారు.
గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో వరదను తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో డిజాస్టర్ మేనేజ్మెంట్ తరఫున ఒక టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని సూచించారు. వరదలు, కాలువలు, చిన్న డ్రైనేజీల నుంచి మొదలుకుని, హైరైజ్ భవనాల వరకు ఏ పరిస్థితి ఎదురైనా దానిని అధిగమించడానికి వీలుగా అధునాతన పరికరాలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అన్నీ విభాగాలు వరద ముప్పును ఎదుర్కోవడానికి కావలసిన ప్రణాళికలను సిద్ధం చేసుకుని రావాలని త్వరలో దీనిపై మరోసారి సమావేశం నిర్వహిస్తామన్నారు.