- బానోత్ విజయబాయి పోటీ చేస్తారని వెల్లడి
- వైరాలో బలమైన క్యాడర్ ద్వారా ఆమెను గెలిపించుకుంటామని కామెంట్
- వచ్చే ఎన్నికల్లో అనుచరులతో కలిసి ఇండిపెండెంట్లుగా బరిలోకి?
- రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సహా
- పలువురిని సస్పెండ్ చేసిన బీఆర్ఎస్
జూలూరుపాడు, వెలుగు: బీఆర్ఎస్ హైకమాండ్‌పై ధిక్కారస్వరం వినిపిస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదివారం సంచలన ప్రకటన చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైరా నియోజకవర్గం అభ్యర్థిగా బానోత్ విజయబాయి పోటీ చేస్తారని చెప్పారు. బీఆర్ఎస్‌ను వీడుతారని వార్తలు వెలువడుతున్న సమయంలో.. అభ్యర్థిని ప్రకటించడం ఆసక్తి రేపుతోంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు ఇండిపెండెంట్లుగా బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొంగులేటి మాట్లాడారు. కొద్ది రోజుల క్రితం సీపీఐ సభ్యత్వానికి రాజీనామా చేసిన విజయబాయి.. తన వర్గంలో చేరారని తెలిపారు. రాజకీయాల్లో ప్రవేశించింది మొదలు తనకు వైరా నియోజకవర్గంతో అవినాభావ సంబంధం ఉందని, విజయబాయి చేరికతో ఆ అనుబంధం మరింత బలపడిందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ వర్గం అభ్యర్థిగా విజయబాయి పోటీలో ఉంటారని ప్రకటించారు. లెఫ్ట్ఐడియాలజీ కలిగిన సీనియర్ నేత ధర్మన్న కుమార్తె తమ వర్గంలోకి రావడం హర్షించదగిన పరిణామమన్నారు. వైరాలో తమకున్న బలమైన క్యాడర్ ద్వారా విజయబాయిని గెలిపించుకుంటామన్నారు.
శీనన్నతో పనిచేసే అవకాశం రావడం
నా అదృష్టం: విజయబాయి
విజయబాయి మాట్లాడుతూ.. శీనన్నతో కలిసి పనిచేసే అవకాశం రావడం నిజంగా తన అదృష్టమని అన్నారు. తనపై నమ్మకం ఉంచి తన వర్గ అభ్యర్థిగా వైరాలో పోటీ చేసే అవకాశం కల్పిస్తున్న పొంగులేటికి రుణపడి ఉంటానని చెప్పారు. రాష్ట్ర మార్క్‌ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, కొణిజర్ల ఎంపీపీ గోసు మధు, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య, జూలూరుపాడు సొసైటీ చెర్మన్ లేళ్ల వెంకటరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పలువురు నేతల సస్పెన్షన్
రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, రైతుబంధు సమితి అధ్యక్షుడు మిట్టపల్లి నాగేశ్వర రావు, వైరా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుమ్మా రోశయ్య, అష్టగుర్తి సర్పంచ్ ఇటుకల మురళిని బీఆర్ఎస్ నుంచి బహిష్కరిస్తున్నట్లు వైరా టౌన్ పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ ప్రకటించారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట తిరుగుతూ, పార్టీ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వారిపై చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైనందుకు జూలూరుపాడు సొసైటీ చైర్మన్ లేళ్ల వెంకటరెడ్డితోపాటు మరో నలుగురు బీఆర్ఎస్ నాయకులను ఎమ్మెల్యే రాములునాయక్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నుంచి బహిష్కరించినట్లు పార్టీ మండల అధ్యక్షుడు పొన్నెకంటి సతీశ్ ఒక ప్రకటనలో తెలిపారు. వారు తమను బహిష్కరించడమేమిటని, తామే పార్టీకి రాజీనామా చేస్తున్నామని లేళ్ల వెంకటరెడ్డి, మరో ఇద్దరు సొసైటీ డైరెక్టర్లు, ఒక ఎంపీటీసీ తోపాటు 8 మంది ముఖ్య నాయకులు చెప్పారు.