- కేంద్ర గృహ నిర్మాణ సెక్రటరీ నారాయణ్‌కు మంత్రి పొంగులేటి విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇండ్ల నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, ఇందుకోసం రాష్ట్రానికి వీలైనంత సహాయాన్ని అందించాలని కేంద్ర హౌసింగ్ సెక్రటరీ కులదీప్ నారాయణ్ ను హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కోరారు.
రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర సెక్రటరీ కులదీప్ నారాయణ్ శుక్రవారం సచివాలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మార్యదపూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గడిచిన పదేండ్లలో పేదల ఇండ్ల నిర్మాణాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.
ఎంతో మంది నిరుపేదలు ఇందిరమ్మ ఇండ్ల కోసం ఎదురు చూస్తున్నారని, వారందరికీ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని తమ సర్కారు లక్ష్యంగా పెట్టుకుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలను గుర్తించి అవసరమైనంత మేర పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రానికి సాధ్యమైనంత ఎక్కువ ఇండ్లను మంజూరు చేయాలని మంత్రి పొంగులేటి కేంద్ర సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర హౌసింగ్ కార్యదర్శి జ్యోతి బుద్ధ ప్రకాశ్, స్పెషల్ సెక్రటరీ గౌతమ్ పాల్గొన్నారు.